Begin typing your search above and press return to search.

'భోళా శంకర్' లో చిరంజీవితో కలిసి నటించాలని పునీత్ ఆశపడ్డారు: మెహర్ రమేష్

By:  Tupaki Desk   |   31 Oct 2021 4:30 AM GMT
భోళా శంకర్ లో చిరంజీవితో కలిసి నటించాలని పునీత్ ఆశపడ్డారు: మెహర్ రమేష్
X
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. పునీత్ గుండెపోటుతో చనిపోవడంతో అందరినీ షాక్ కు గురి చేసింది. అభిమానులు, శ్రేయోభిలాషులు శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మెహర్ రమేష్ విచారం వ్యక్తం చేస్తూ పునీత్ చిరకాల కల నెరవేరకుండానే కన్నుమూశారని అన్నారు.

''పునీత్ నాకు కెరీర్ ఇచ్చిన హీరో. ఆయన నటించిన 'వీర కన్నడిగ' సినిమాతో నేను డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయ్యాను. నా రెండో సినిమా కూడా ఆయనతోనే చేశాను. రెండూ సూపర్ హిట్ అయ్యాయి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న నన్ను ఏమి డిటైల్స్ అడక్కుండా, పూరీ గారు చొరవతో డైరెక్టర్ ని చేసి రెండు సినిమాలు నాతో చేశారు. నన్ను పిలిచి 'ఒక్కడు' సినిమా రీమేక్ నువ్వే చేయాలి అని నాతో 'అజయ్' సినిమా చేయించారు. నాకు బ్రదర్ లాంటివారు. నన్ను తన ఫ్యామిలీ మెంబర్ లాగా చూసుకునేవారు. హోటల్ లో భోజనం చేస్తే ఒప్పుకునేవారు కాదు. షూటింగ్ జరిగినన్ని రోజులూ వాళ్ల ఇంటిలో వారితో కలిసి భోజనం చేసేవాడిని. గొప్ప మనసున్న హీరో. ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను'' అని మెహర్ రమేష్ తెలిపారు.

''ఇటీవల నేను 'భోళా శంకర్' సినిమా అనౌన్స్ చేసిన సమయంలో పునీత్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. అభినందనలు చెబుతూ.. 'చిరంజీవి సర్ తో స్క్రీన్ పంచుకోవాలనేది నా కోరిక. మీరు ఛాన్స్ ఇస్తే ఈ సినిమాలో ఏదైనా గెస్ట్ రోల్ ఉంటే చేస్తాను. అది కుదరకపోతే కనీసం ఒక పాటలోనైనా ఆయనతో కలిసి ఓ చిన్న స్టెప్పు వేస్తాను' అని అడిగారు. నేను వెంటనే ఓకే అన్నాను. ఆ విషయాన్ని నేను చిరంజీవి గారితో కూడా చెప్పాను. పునీత్ కోసం సినిమాలో ఓ స్పెషల్ రోల్ రాయాలనుకున్నాను. సినిమా ఓపెనింగ్ కు కూడా పునీత్ ను గెస్టుగా పిలవాలనుకున్నాను. ఇంతలో ఇలా జరిగిపోయింది. అంత మంచి మంచి మనిషిని మంచి స్టార్ ని మనం కోల్పోయాం'' అని మెహర్ రమేశ్ భావోద్వేగానికి గురయ్యారు.

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో పునీత్ భౌతికకాయాన్ని టాలీవుడ్ ప్రముఖులు సందర్శించిన ఆయన పుష్పాంజలి ఘటించారు. బాలకృష్ణ - ఎన్టీఆర్ - చిరంజీవి - వెంకటేష్ - శ్రీకాంత్ - అలీ - నరేష్ - శివబాలాజీ వంటి వారు ఆయనకు నివాళులు అర్పించారు. పునీత్ మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని.. చిన్న వయసులోనే పునీత్ మనల్ని వదిలి వెళ్లడం బాధాకరమని అన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తల కొట్టుకుంటూ కన్నీటిపర్యంతం అయ్యారు. చిరంజీవి కూడా పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ ను హత్తుకొని ఏడ్చారు. రేపు ఆదివారం పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియల కోసం కర్ణాటక ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.