Begin typing your search above and press return to search.

నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ- కె.రాఘవేంద్రరావు

By:  Tupaki Desk   |   22 May 2022 2:30 PM GMT
నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ- కె.రాఘవేంద్రరావు
X
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో దిగ్గ‌జం.. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆయ‌న జన్మదినం మే23. నేటితో ఆయన 80వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సినిమాకి రాసుకున్న ప్రేమ‌లేఖ అంత‌రంగం ఆద్యంతం ఆస‌క్తిక‌రం. ద‌ర్శ‌కేంద్రుడు ఈ లేఖ‌లో ఏమ‌ని రాసారంటే..!

ఈ జన్మదినం ప్రత్యేకత ఏంటంటే దర్శకునిగా శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించాను. ఈ అనుభవంతో ఓ పుస్తకాన్ని రాశాను. అది 1963వ సంవత్సరం ఆరోజు నాకు ఇంకా కళ్లముందే ఉంది. అసిస్టెంట్‌ డైరెక్టర్ గా కెరీర్‌ మొదటిరోజున `పాండవ వనవాసం` చిత్రానికి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ యన్టీఆర్ పై తొలిసారి క్లాప్ కొట్టటంతో నా కెరీర్‌ స్టార్టయింది. ప్రముఖ దర్శకులు కమలాకర కామేశ్వరరావు నాకు తొలిసారి అసిస్టెంట్‌ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చారు.

10 ఏళ్లపాటు అసిస్టెంట్ గా పనిచేసిన తర్వాత మా నాన్నగారు కె.యస్‌ ప్రకాశ్‌రావు గారు అందించిన `బాబు` (1975) చిత్రంతో దర్శకునిగా సినిమా ప్రయాణం... ఆ రోజు నుండి మొదలైన నా సినీ ప్రయాణంలో ఎన్నో విజయాలు,.. అపజయాలు,.. ఆనందాలు,.. ఎత్తులు,.. లోతులు అవార్డులు,.. రివార్డులు ఎన్నో చూసుంటాను. 48 ఏళ్ల దర్శకత్వ సుదీర్ఘ ప్రయాణం గురించి ఎంతని చెప్పాలి? ఏమని చెప్పాలి? అందుకే 80 ఏళ్ల నా జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ అంటూ నా స్వహస్తాలతో నేను ఓ పుస్తకం రాసుకున్నాను.

ఆ పుస్తకంలో నేను నడిచిన సినిమా దారిలో ఎంతోమంది స్నేహితులు,.. బంధువులు,.. ఆప్తులు,.. నన్ను నమ్మి నాతో పాటు నడిచిన నిర్మాతలు, .. హీరోలు,.. హీరోయిన్లు ,.. రచయితలతో పాటు ఎంతోమందిని గుర్తు చేసుకోవాలి అనుకున్నాను. అనుభవం నేర్పిన కొన్ని విషయాలను రాయాలనిపించింది. అందుకే నా ఈ (నా) ప్రేమలేఖల్ని మీ ముందు ఉంచుతున్నాను.

నా ఈ స్థితికి కారణమైన 24 శాఖలవారికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రేక్షకులకి నా గురించి,.. నేను నేర్చుకున్న పాఠాల గురించి.. ''అబద్దాలు రాయటం అనర్ధం.., నిజాలు రాయటానికి భయం ...అంటూ మనసు పెన్ తో రాశాను.., ఓపెన్ గా రాశాను. ఏది కప్పి చెప్పలేదు. విప్పి చెప్పలేదు.. కొంచెం తీపి.. కొంచెం కారం.. కొంచెం.....'' అంటూ తన బుక్‌ గురించి చెప్పుకొచ్చారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు.

చివరగా నేను చెప్పేదొక్కటే 'సినిమా అనేది ఇలానే ఉండాలి అనే గీత గీయకూడదు..ఇలా కూడా ఉండొచ్చు అని ఈ మధ్య విడుదలైన చాలా సినిమాలు నిరూపించాయి. ఈ పుస్తకం ప్రతి పుస్తకాలయాల్లో దొరుకుతుంది. పాఠలకులందరూ పుస్తకాన్ని చదివి ఆశీర్వధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా... ను అని కె.రాఘ‌వేంద్రరావు రాసారు.