Begin typing your search above and press return to search.

రాజమౌళిని కొట్టాలని ఎంత కసో..?

By:  Tupaki Desk   |   2 Oct 2019 4:32 AM GMT
రాజమౌళిని కొట్టాలని ఎంత కసో..?
X
ఒక ఐదేళ్ల ముందు వరకు దక్షిణాదిన టాప్ డైరెక్టర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా శంకర్ అనేవాళ్లు. ఆయన్ని మించిన క్లాసిక్స్ తీసిన దర్శకులున్నప్పటికీ.. ‘రోబో’ లాంటి చిత్రంతో దక్షిణాది సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లి పెట్టిన శంకర్‌‌కే అగ్రతాంబూలం దక్కేది. కానీ రాజమౌళి అనే అతి సామాన్య దర్శకుడు అనూహ్యంగా తన స్థాయిని పెంచుకుంటూ ‘మగధీర’, ‘ఈగ’ లాంటి సినిమాలు తీసి శంకర్‌కు చేరువ అయిపోయాడు. ఇక ‘బాహుబలి’తో శంకర్‌ను వెనక్కి నెట్టేసి ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ హోదా దక్కించుకున్నాడు. అప్పటి నుంచి శంకర్ రగిలిపోతున్నాడని.. తన స్థాయి చాటాలని తపించిపోతున్నాడని అంటుంటారు దగ్గరివాళ్లు. ‘2.0’ సినిమా విషయంలో శంకర్ వైఖరి చూస్తే అది నిజమే అనిపించింది. కేవలం విజువల్ ఎఫెక్ట్స్ మాయాజాలంతో ‘బాహుబలి’ని దాటాలని శంకర్ అయినకాడికి ఖర్చు చేయించి సినిమాను దెబ్బ తీసిన మాట వాస్తవం.
కానీ సినిమా అంచనాల్ని అందుకోలేక శంకర్ చెడ్డపేరే మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయినా ఆయన మారినట్లు సంకేతాలు కనిపించలేదు. ‘భారతీయుడు-2’ చిత్రాన్ని భారీ బడ్జెట్లో తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీగా మార్చాలని శంకర్ తపిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ వాళ్లతో బడ్జెట్ విషయంలో పేచీ వచ్చినా తలొగ్గలేదు. తాను అనుకున్నట్లుగా సినిమాను భారీ లెవెల్లో తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్ విలన్ పాత్ర చేస్తాడని వార్తలొచ్చాయి. అది ఖరారు కాకముందే అనిల్ కపూర్ లైన్లోకి వచ్చాడు. అజయ్ స్థానంలో అనిల్ వచ్చాడని ప్రచారం జరగ్గా.. అదేమీ కాదని, అజయ్‌తో పాటు అనిల్ కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తాడని చిత్ర వర్గాలు అంటున్నాయి. సినిమాలో వివిధ భాషలకు చెందిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు భాగం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మళ్లీ తన పూర్వపు స్థాయిలో ఓ సినిమా అందించి రాజమౌళిని మించాలని, కనీసం అతడికి దీటుగా నిలవాలని శంకర్ ఎంతగానో తపిస్తున్న సంగతి స్పష్టంగా అర్థమవుతోంది.