Begin typing your search above and press return to search.

ఇదసలు శంకర్ స్టైల్ కానే కాదే!

By:  Tupaki Desk   |   17 April 2021 10:30 AM GMT
ఇదసలు శంకర్ స్టైల్ కానే కాదే!
X
శంకర్ .. దక్షిణాది సినిమాను ప్రపంచ పటానికి పరిచయం చేసిన పేరు .. ఉత్తరాదివారిని విస్తుపోయేలా చేసిన పేరు .. విస్మయానికి గురిచేసిన పేరు. భారీ సినిమాలను బాలీవుడ్ వారు మాత్రమే తీయగలరు ..అఖండ విజయాలను తాము మాత్రమే అందుకోగలమని వాళ్లు అనుకునేవారు. అలాంటివారిని శంకర్ అనే పేరు టెన్షన్ పెట్టింది. కథ .. కథనం .. భారీతనం .. మాటలు .. పాటలు .. కెమెరాపనితనం .. సాంకేతిక పరిజ్ఞానం .. ఇలా అన్ని శాఖలపై ఆయనకి గల పట్టును చూసి వాళ్లంతా 'ఔరా' అనుకున్నారు.

శంకర్ నుంచి ఒక సినిమా వస్తుందంటే అది ఒక తమిళ సినిమా అనువాదంగా ఎవరూ అనుకోలేదు. తమ భాషా చిత్రమే అన్నంతగా ఆ సినిమాల కోసం ఎదురుచూశారు .. వీలైనంతవరకూ విజయాలనే ముట్టజెప్పారు. మారుమూల ప్రాంతాల్లోని థియేటర్ల నుంచి వివిధ దేశాల్లోని స్క్రీన్లు ఆయన సినిమాల కోసం తపనపడ్డాయి సక్సెస్ ఆయన లాన్ లో పడి ఉండటానికి కారణం, సినిమాను శంకర్ ఒక తపస్సుగా భావించడం .. ఒక యజ్ఞంలా దానిని పూర్తి చేయడం. ఎంతటి స్టార్ తో పనిచేస్తున్నా ఆయనలో బెరుకుతనం కనిపించదు. అందుకు కారణం తను ఎంచుకున్న కథపై తనకి గల నమ్మకం .. కథనంపై తనకి గల పట్టు.

సాధారణంగా శంకర్ ఒక సినిమా కోసం పేపర్ పై పెన్ను పెట్టాడంటే, ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకూ మరో ప్రాజెక్టును గురించి ఆయన ఆలోచన చేయడు. అలాగే ఎంత పారితోషికం ఇస్తానని చెప్పినా ఆయన ఇతర భాషా సినిమాలు చేయడానికి అంతగా ఆసక్తిని చూపించడు. ఆయన తమిళంలోనే చేస్తారు .. అది ఇతర భాషల్లోకి మారవలసిందే. కానీ ఈ సారి శంకర్ ఒక వైపున 'ఇండియన్ 2' సెట్స్ పై ఉండగానే, తెలుగులో చరణ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతేకాదు హిందీలో 'అపరిచితుడు' రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. ఇలా ఆయన ఒకేసారి రెండు పడవలపై కాళ్లు పెట్టడానికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి. మరి హఠాత్తుగా శంకర్ లో ఇంతటి మార్పు ఎందుకు వచ్చిందో .. ఏమిటో?