Begin typing your search above and press return to search.

'కౌబాయ్ సినిమా చేయాల‌నేది నా డ్రీమ్‌.. ఓటీటీ వైపు వెళ్లాల‌ని లేదు'

By:  Tupaki Desk   |   10 Jan 2022 5:30 PM GMT
కౌబాయ్ సినిమా చేయాల‌నేది నా డ్రీమ్‌.. ఓటీటీ వైపు వెళ్లాల‌ని లేదు
X
'భలే మంచి రోజు' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీరామ్ ఆదిత్య.. 'శమంతకమణి' 'దేవదాస్‌' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు అశోక్ గల్లా ను హీరోగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. ''హీరో'' అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై గల్లా పద్మావతి నిర్మించారు. ఇందులో అశోక్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌ గా నటించింది. సంక్రాంతి కానుక‌గా జనవరి 15న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ద‌ర్శ‌కుడు శ్రీ‌రామ్ ఆదిత్య మీడియా స‌మావేశంలో ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు. ఆ విశేషాలు ఆయన మాటల్లో...

* నా ద‌గ్గ‌రున్న క‌థ‌కు అశోక్ క‌రెక్ట్‌ గా స‌రిపోతాడ‌ని భావించి ఆయ‌న‌తో సినిమా చేయాల‌నుకున్నాను. అశోక్ త‌న అమ్మ‌గారు ప‌ద్మ‌గారిని ప‌రిచ‌యం చేయ‌డంతో ఆమెకూ న‌చ్చి సినిమా ప‌ట్టాలెక్కింది. అశోక్ కు సినిమాపై విప‌రీత‌మైన ఇంట్రెస్ట్ వుంది.

* నా ద‌గ్గ‌ర వున్న క‌థ‌కు కొత్త‌వారైతేనే పూర్తి న్యాయం జ‌రుగుతుంద‌నే అశోక్ ను తీసుకున్నాం . టైటిల్ ప‌రంగా చెప్పాలంటే హీరో అవ్వాల‌నుకునే కుర్రాడి క‌థ కాబ‌ట్టి అదే యాప్ట్ గా అనిపించింది.

* చాలామంది ఏదో సంద‌ర్భంలో హీరో అవ్వాల‌నుకుంటారు. న‌లుగురిలో మంచి పేరు తెచ్చుకోవాల‌ని ఫీలింగ్ వుంటుంది. ఇది కామ‌న్ పాయింట్ ఇది నా అనుభ‌వంతో తీసిన క‌థ‌ కాదు. చుట్టూ స్ట‌డీ చేసి రాసుకున్న క‌థ‌.

* `హీరో` సినిమా ఎటువంటి విసుగు కలిగించ‌కుండా క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో తీశాం. చూసిన ప్రేక్ష‌కుడు రెండు గంట‌లు న‌వ్వుకుంటూనే వుంటారు. అశోక్‌ ను కొత్త హీరోని చూశామ‌నే ఫీలింగ్ క‌ల‌గ‌దు.

* జోన‌ర్ ప‌రంగా చెప్పాలంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ వుంటూనే ఇంత‌వ‌ర‌కు ఎవ‌రూ స్కృశించ‌ని అంశం ఇందులో వుంటుంది. తాజాగా విడుద‌లైన ట్రైలర్ లో అశోక్ ను కౌబాయ్‌ గా, జోక‌ర్‌ గా చూసుంటారు. క‌థ‌లో అటువంటి వైవిధ్యాలు కుదిరాయి.

* కౌబాయ్ సినిమా చేయాల‌నేది ఎప్ప‌టినుంచో నా డ్రీమ్‌. అటువంటి సినిమా అంటేనే సూప‌ర్ స్టార్ కృష్ణ‌ - మ‌హేష్‌ బాబు గుర్తుకు వ‌స్తారు. సినిమాలో మొద‌టి ప‌ది నిముషాలు అస్స‌లు మిస్ కావ‌ద్దు.

- సినిమాకు గ్యాప్ రావ‌డం అనేది కోవిడ్ వ‌ల్ల అని చెప్ప‌వ‌చ్చు. నా ద‌గ్గ‌ర ప‌ది క‌థ‌లున్నాయి. నాకు కొత్త‌గా అనిపిస్తేనే, ఎవ్వ‌రూ ఈ పాయింట్‌ ను చెప్ప‌లేద‌ని అనుకుంటేనే సినిమా చేస్తాను. 'హీరో' సినిమాలో అటువంటిదే చూస్తారు.

* అశోక్‌ ను చూస్తే కొత్త‌వాడ‌నే ఫీలింగ్ రాకూడ‌ద‌ని చిరంజీవి - మ‌హేష్‌ బాబు సినిమాలు చూడ‌మ‌ని చెప్పాను. వారిలో కామేడీ టైమింగ్ నాకు బాగా న‌చ్చుతుంది. యాక్టింగ్ కోర్సు చేయ‌డంకంటే చాలామంది స్టార్స్‌ ను చూసి మ‌నం చాలా నేర్చుకోవాల్సి వుంటుంది. వారిని ప‌రిశీలించి మ‌న‌కు న‌చ్చింది మ‌న‌కు అప్ల‌య్ చేసుకోవాలి. అందుకే అశోక్‌ ను సినిమాలు చూడ‌మ‌ని చెప్పాను.

* హీరో యుఎస్‌లో చ‌దివినా అశోక్ కు తెలుగు రాయ‌డం, మాట్లాడ‌డం బాగా తెలుసు. నాకే స‌రిగ్గా తెలీదు. డ‌బ్బింగ్ కూడా త‌నే చెప్పుకున్నాడు.

* లాక్‌ డౌన్ స‌మ‌యంలో ఓటీటీలో ప‌లు భాషా చిత్రాలు చూశాం. చాలామందికి కొన్ని న‌చ్చాయి కూడా. అలాంటివారికి కూడా 'హీరో' సినిమా న‌చ్చుతుంది. ఎందుకుంటే రొటీన్ ఫార్మెట్ కాకుండా భిన్నంగా తీసిన సినిమా ఇది. థియేట‌ర్ల‌లో చూస్తేనే బాగుంటుంది.

* ఈ సినిమాలో ఛాలెంజింగ్ ఏంటంటే, ప్ర‌యోగంతోపాటు వాణిజ్యాంశాలు కూడా వుండేలా చేయ‌డ‌మే. క‌రోనా గ్యాప్ వ‌ల్ల షూటింగ్ చేసింది చూసుకుని ఇంకా ఏమైనా బెట‌ర్ చేయ‌వ‌చ్చ‌నేది ఆలోచించేలా తోడ్ప‌డింది. అంద‌రిని ఒప్పించేలా సినిమా చేయాలి అనేది నా రూల్‌.

* నిధి అగ‌ర్వాల్ ఫ్రొఫెష‌న‌ల్‌ గా న‌టించింది. ఇంత‌కుముందు గ్లామ‌ర్ పాత్ర‌లు చేసినా 'హీరో' సినిమాలో స‌హ‌జంగా వుండే పాత్ర పోషించింది.

- లాక్‌ డౌన్ వ‌ల్ల న‌టీన‌టుల్లో ఆహార్యంలో తేడాలున్నా క‌థ‌లో మాత్రం ఎటువంటి మార్పులేకుండా తీశాం. కంటెన్యూటీ సీన్స్ అనేవి ఛాలెంజింగ్ అనిపించాయి.

* కృష్ణ‌గారు నేను చేసిన `భ‌లేమంచి రోజు` చూశారు. మెచ్చుకున్నారు. ఇప్పుడు `హీరో` సినిమా చూశారు. చాలా బాగా తీశామ్ అన్నారు. ఆయ‌న మాట మాకు ఎంతో ఆనందంగా అనిపించింది.

* రాజ‌మౌళిగారు ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. నా ఫేవ‌రేట్ ద‌ర్శ‌కుడు ఆయ‌న‌. ఆయ‌న చేసిన బాహుబ‌లి ఒక‌టికి వంద‌సార్లు చూశాను. ఎందుకంటే స్టోరీ టెల్లింగ్ ఆయ‌న్నుంచి నేర్చుకోవాలి. అంత బాగా చెబుతారు.

* ఇక కెమెరా మెన్‌ లు ఇద్ద‌రు మారినా క‌ల‌ర్ పాట్ర‌న్‌ లో ఎటువంటి మార్పులేదు. క‌థ మార‌న‌ప్పుడు అవేవీ మార‌వు క‌దా. స‌మీర్ రెడ్డిగారు నా రెండో సినిమాకు ప‌నిచేశారు. ఆయ‌న‌కు ఒక సీన్ చెబితే చాలు అన్నీ ఆయ‌నే చూసుకుంటారు.

- ఓటీటీ వైపు వెళ్లాల‌ని లేదు. ముందు ముందు నిర్మాణంలోకి వెళ‌తానేమో చెప్ప‌లేను. ప్రస్తుతానికి కొత్త సినిమాలు ఇంకా ఏమీ అనుకోలేదు.

- అస‌లు 'హీరో' సినిమాను న‌వంబ‌ర్‌ లోనే విడుద‌ల చేద్దామ‌నుకున్నాం. అప్ప‌టికీ ఇంకా థియేట‌ర్ల‌కు జ‌నాలు వ‌స్తారో రారో అనే సందిగ్థంలో వున్నాం. ఆ త‌ర్వాత సంక్రాంతికి పెద్ద సినిమాలు వాయిదా ప‌డ‌డంతో పండుగ‌నాడు ఎంట‌ర్‌టైన్మెంట్ సినిమా వుండాల‌ని వ‌స్తున్నాం. సంక్రాంతికి మంచి వినోదం క‌లిగించే సినిమా అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను.