Begin typing your search above and press return to search.

రామానాయుడు స్టూడియో చుట్టూ రౌండ్లు వేసేవాడ్ని!

By:  Tupaki Desk   |   8 Jan 2023 7:54 AM GMT
రామానాయుడు స్టూడియో చుట్టూ రౌండ్లు వేసేవాడ్ని!
X
డైరెక్ట‌ర్లుగా ఎదిగిన వారంతా క‌ష్ట‌ప‌డ్డావారే. ఎలాంటి సినీ నేప‌థ్యం లేకుండా వ‌చ్చి ఎదిగిన వారే. నేడు స్టార్ డైరెక్ల‌ర్లుగా నీరాజ‌నాలు అందుకుంటున్నారంటే? వాటి వెనుక ఎన్నో నిద్ర లేని రాత్రులు ఉన్నాయి. కొన్ని సంవ‌త్స‌రాల క‌ష్టం ఉంది. అలా ఎదిగిన వాళ్ల‌లో `కుమారి 21 ఎఫ్` ఫేం ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ కూడా ఒక‌ర‌ని తెలుస్తోంది. సుకుమార్ ప్రియ శిష్యుడిగా ఇత‌ను పాపుల‌ర్. `రంగ‌స్థ‌లం`..`పుష్ప‌` లాంటి సినిమాల‌కు రైటింగ్ విభాగంలో ప‌నిచేసారు.

ఇటీవ‌లే `18 పేజీస్` తోనూ ద‌ర్శ‌కుడిగా మ‌రో స‌క్సెస్ ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఆయ‌న కెరీర్ జ‌ర్నీ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చారు. మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వ‌చ్చిన సూర్య ప్ర‌తాప్ ప్ర‌యాణం కూడా అంద‌రిలాగే సాగింది. ఆవేంటోఆయ‌న మాట్లోనే..

`హైద‌రాబాద్ కి రావ‌డానికి ముందే ఇంగ్లీష్‌..హిందీ పై ప‌ట్టు సాధించా. ఆ త‌ర్వాతే బ్యాగులో బ‌ట్టులు స‌ర్దుకుని హైద‌రాబాద్ బ‌స్సెక్కా. ఎంబీయే చ‌దువుతోన్న అక్క ద‌గ్గ‌ర వాలిపోయా. ఆమె స‌ల‌హాతోనే ఎంసీఏలో చేరా. కానీ మ‌న‌సంతా సినిమాలే నిండి ఉన్నాయి. ఆ ఇష్టంతోనే చ‌దువుతూనే సినిమా ప్ర‌య‌త్నాలు చేసేవాడ్ని. అప్పుడే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో హిందీ తెలిసిన వాళ్ల‌కి అసిస్టెంట్ గా అవ‌కాశం క‌ల్పిస్తున్నార‌ని తెలిసి స్టూడియో చుట్టూ తిర‌గ‌డం మొద‌లు పెట్టాను.

రోజూ అమీర్ పేట నుంచి రామానాయుడు స్టూడియోకి 14 కిలోమీటర్లు న‌డుచుకునే వ‌చ్చేవాడిని. చేతిలో కొద్ది డ‌బ్బు ఉన్నా ఖ‌ర్చు అవుతాయ‌ని బ‌స్సు ఎక్కే వాడిని కాదు. స‌రిగ్గా తినేవాడిని కాదు. నా ప‌రిస్థితి గ‌మ‌నించి అక్క డ‌బ్బులిచ్చేది. ఇలా ఏడాది సాగింది. ఆ త‌ర్వాత సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో హిందీ స్ర్కిప్ట్ లు రాసే వ్య‌క్తి మానేశాడ‌ని తెలిసి వెళ్లాను.

కానీ ఆ అబ్బాయి మ‌ళ్లీ రావ‌డంతో నిరాశ ఎదురైంది. అప్పుడు చాలా బాధ‌ప‌డ్డా. నిరాశ‌తో నిరయ్యాను. తిండి మానేసాను. గుండె నిండా ఆవేద‌న‌తో ఇంటికొచ్చాను. ఆ త‌ర్వాత స‌రిగ్గా ఐదు రోజుల‌కి నాయుడిగారి నుంచి పిలుపొచ్చింది. న‌న్ను గుర్తు పెట్టుకుని మ‌రీ పిలిచార‌ని తెలిసింది. అలా 19 ఏళ్ల క్రితం సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో నా ప్ర‌యాణం మొద‌లైంది.

ఆ అవ‌కాశం రావ‌డంతో ఎంసీఏ మ‌ధ్య‌లోనే వ‌దిలేసా. `శివ‌య్య` సినిమాకి తొలిసారి క్లాప్ కొట్టా. దీంతో నాలో న‌మ్మ‌కం రెట్టింపు అయింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ కొన్ని క‌ష్టాలు ఎదుర‌య్యాయి. ఆ త‌ర్వాత కొన్నాళ్ల‌కి `హ‌నుమాన్ జంక్షన్ `సినిమా టైమ్ లో సుకుమార్ అన్న‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అక్క‌డ నుంచి నా కొత్త జీవితం మొద‌లైంది. ఎదిగే క్ర‌మంలో నాకుటుంబం..భార్య ఎంతో అండ‌గా నిల‌బ‌డ్డారు. అక్క పెళ్లిని సైతం వాయిదా వేసుకుంది. వీళ్లంతా నాబ‌లం`` అని చెప్పుకొచ్చారు.