Begin typing your search above and press return to search.

ఆడుతున్న సినిమాను ఆపి..నిర్మాతను ముంచాడు..

By:  Tupaki Desk   |   17 July 2018 2:30 PM GMT
ఆడుతున్న సినిమాను ఆపి..నిర్మాతను ముంచాడు..
X
దర్శకుడు ఎంత పకడ్బందీగా ఉంటే.. ఆ సినిమా అంత గొప్ప విజయం సాధిస్తుంది. సినిమా కథా - కథనం విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయినా ఆ సినిమా గోవిందే.. అందుకే ఇప్పటి దర్శకులు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కే సంవత్సరాల కొద్దీ టైం తీసుకుంటారు. కానీ ఓ దర్శకుడు చేసిన పొరపాటు ఓ నిర్మాతను నట్టేట ముంచింది. నిండా మునిగి ఏకంగా సినిమాలు వదిలేయాల్సిన పరిస్థితి దాపురించింది.

తెలుగు హీరో సందీప్ కిషన్.. ఏ ముహూర్తాన తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చాడో కానీ ఏదీ కలిసిరాలేదు. అతడు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కానీ తమిళంలో మాత్రం ఈ హీరో నిలదొక్కుకున్నాడు. సందీప్ కిషన్ నటించిన ‘మానగరం’ - మాయవన్ సినిమాలు బాగా ఆడడంతో అక్కడ మార్కెట్ ఏర్పడింది. రెండు వరుస హిట్స్ తో సందీప్ తో స్టార్ డైరెక్టర్ సుశీంద్రన్ సినిమా తీశాడు. ‘నెంజిల్ తునివిరుందాల్’ అనే చిత్రాన్ని తెలుగులో ‘కేరాఫ్ సూర్య’ పేరుతో రిలీజ్ చేశారు.

గతేడాది నవంబర్ 10న ఈ చిత్రం తమిళ - తెలుగు భాషల్లో రిలీజ్ అయ్యింది. తెలుగులో ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడో పోయిందో తెలియలేదు. అయితే సందీప్ ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళ వెర్షన్ లో దర్శకుడు చేసిన తప్పు వల్ల అందరూ మునిగిపోయారు.

సినిమా రిలీజ్ అయ్యి మోస్తారుగా ఆడుతుండగా.. దర్శకుడు సుశీంద్రన్ తీసుకున్న నిర్ణయం సినిమాను ముంచేసింది. సినిమా నిడివి ఎక్కువైందంటూ ఓ 20 నిమిషాలను కోత వేసి ఎడిటెడ్ వెర్షన్ ను నాలుగో రోజు మళ్లీ రిలీజ్ చేశాడు దర్శకుడు. అప్పటికీ సంతృప్తి చెందక ఆరో రోజే ఈ చిత్ర ప్రదర్శనను ఆపేశాడు. సినిమాలో మళ్లీ కొన్ని మార్పులు చేసి.. డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని సినిమాను ఆడకుండా తీసేశాడు.

సుశీంద్రన్ చేసిన పనికి నిర్మాత మునిగిపోయాడు. సినిమాను ఆపి వచ్చే కలెక్షన్లు కూడా రాకుండా దర్శకుడు చేశాడు. డిసెంబర్ పోయినా మళ్లీ సినిమాను పునర్నిర్మించలేదు.. విడుదల చేయలేదు. దీంతో బయ్యర్లందరూ నిర్మాత అంటోనీ మీద పడ్డారు. అతను పూర్తిగా మునిగిపోయాడు. ఈ సినిమా మీద పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది. సుశీంద్రన్ దెబ్బకు నిర్మాత ఇప్పుడు రోడ్డున పడ్డాడని తెలిసింది.