Begin typing your search above and press return to search.

మంచుకు లీగల్ నోటీస్...వైవీఎస్ వివాదాన్ని పెంచేసినట్టేనా?

By:  Tupaki Desk   |   9 April 2019 2:22 PM GMT
మంచుకు లీగల్ నోటీస్...వైవీఎస్ వివాదాన్ని పెంచేసినట్టేనా?
X
టాలీవుడ్ లో కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న సీనియర్ నటుడు - లక్ష్మీప్రసన్న పిక్చర్స్ ఓనర్ మంచు మోహన్ బాబు... దర్శకుడు వైవీఎస్ చౌదరిల మధ్య వివాదం మరింతగా ముదిరినట్టుగానే కనిపిస్తోంది. రూ.40 వేల మొత్తానికి సంబంధించిన కేసులో వైవీఎస్ వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఎర్రమంజిల్ కోర్టు... మోహన్ బాబును దోషిగా తేలుస్తూ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మోహన్ బాబుకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.41 లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. అయితే ఓ నెల పాటు శిక్ష అమలుపై వాయిదా సంపాదించిన మోహన్ బాబు... ఈ కేసుపై మీడియాతో మాట్లాడుతూ వైవీఎస్ పై తీవ్ర ఆరోపణలే చేశారు.

తాము వైవీఎస్ దర్శకత్వంలో తీసిన చిత్రం హిట్ అవుతుందన్న ఉద్దేశ్యంతో మరో చిత్రాన్ని ఆయనతో తీద్దామన్న భావనతో అడ్వాన్స్ గా రూ.40 లక్షల చెక్కు ఇచ్చామని - అయితే ఆ తర్వాత సదరు ప్రతిపాదనను విరమించుకున్నామని - ఈ విషయాన్ని వైవీఎస్ కు చెప్పినా... చెక్ ను బ్యాంకులో డిపాజిట్ చేసి చెక్ బౌన్స్ అయ్యేలా చేసి కేసు వేశారని తెలిపారు. ఈ కేసుపై తాము పైకోర్టుకు వెళ్లనున్నట్లు కూడా మోహన్ బాబు వెల్లడించారు. అయితే ఈలోగానే ఏమైందో తెలియదు గానీ... తన స్థలంలోకి తనను అనుమతించడం లేదంటూ ఏకంగా మోహన్ బాబుకు వైవీఎస్ లీగల్ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై వైవీఎస్ మీడియాతో మాట్లాడుతూ... మోహన్ బాబు కుమారుడితో సినిమా చేసిన సమయంలోనే వారి ఇంటికి సమీపంలోనే తన సొంత డబ్బుతో అర ఎకరం స్థలాన్ని తాను కొనుగోలు చేశానని, అయితే ఇప్పుడు ఆ స్థలంలోకి తనను గానీ, తన మనుషులను గానీ అనుమతించకుండా మోహన్ బాబు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని వైవీఎస్ సంచలన ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తనదే తప్పు అన్నట్లుగా చిత్రీకరించేసిన మోహన్ బాబు... తనను మానసికంగా బాగానే ఇబ్బంది పెట్టారని - ఈ కారణంగానే తాను మోహన్ బాబుకు లీగల్ నోటీసులు జారీ చేశానని వైవీఎస్ చెప్పుకొచ్చారు. నిన్నటిదాకా కోర్టులో కేసు కారణంగానే ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తితే... ఇప్పుడు కొత్తగా లీగల్ నోటీసులు కూడా ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదం మరింతగా ముదిరే అవకాశాలే ఉన్నాయని చెప్పక తప్పదు. అంతేకాకుండా మోహన్ బాబు ఇటీవలే వైసీపీలో చేరి రాజకీయంగా బాగానే యాక్టివేట్ అయిపోయారు. ఇలాంటి కీలక తరుణంలో ఈ వివాదం మోహన్ బాబును ఎంతగా ఇబ్బందికి గురి చేస్తుందన్న విషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.