Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ద‌ర్శ‌కుల‌కు అవ‌మానం?!

By:  Tupaki Desk   |   22 May 2019 1:30 AM GMT
టాప్ స్టోరి: ద‌ర్శ‌కుల‌కు అవ‌మానం?!
X
ఒక సినిమా ప్రారంభ‌మై కొంత షూటింగ్ జ‌రిగాక ఆ సినిమా నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించారంటే దాని వెనక ఎంత పెద్ద క‌థ జ‌రిగి ఉంటుందో అర్థం చేసుకోవ‌చ్చు. హీరోతో స‌రిగా కుద‌ర‌క‌పోవ‌డ‌మో.. లేక నిర్మాత‌ల‌తో పొస‌గ‌క‌పోవ‌డ‌మో జ‌రిగితే ఇక ఆ ప్రాజెక్టు ముందుకెళ్ల‌డం చాలా క‌ష్టం. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ అనేవి ఈ రంగంలో చాలా స‌ర్వ‌సాధార‌ణం. ఇటీవ‌ల ఆ త‌ర‌హా హీట్ ని ఎదుర్కొన్న ద‌ర్శ‌కుల జాబితా ప‌రిశీలిస్తే... ఓ న‌లుగురి పేర్లు ప్ర‌ముఖంగా చెప్పుకోవ‌చ్చు.

క్రిష్ - కంగ‌న - మ‌ణిక‌ర్ణిక వివాదం.. బాలా- ధృవ్ అర్జున్ రెడ్డి రీమేక్ వివాదం.. లారెన్స్- అక్ష‌య్ కుమార్- కాంచ‌న రీమేక్ (ల‌క్ష్మీ బాంబ్) వివాదం.. జి.కార్తీక్ రెడ్డి- మంచు విష్ణు- ఓట‌ర్ వివాదం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌చ్చాయి. టాలీవుడ్ ద‌ర్శ‌కుల్లో క్రిష్ .. జి.కార్తీక్ రెడ్డి ఈ త‌ర‌హా ఇబ్బందులు ఎదుర్కోవ‌డం బ‌య‌ట‌ప‌డింది. క్వీన్ కంగ‌న ర‌నౌత్ ప్ర‌ధాన‌ పాత్ర‌లో క్రిష్ తెర‌కెక్కించిన `మ‌ణిక‌ర్ణిక‌- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ` మెజారిటీ పార్ట్ చిత్రీక‌ర‌ణ పూర్తి కాగానే అస‌లు వివాదం త‌లెత్తింది. ఈ సినిమాకి సంబంధించిన క్రియేటివ్ పార్ట్ లో కంగ‌న ఫింగ‌రింగ్ చేయ‌డంతో క్రిష్ అర్థాంత‌రంగా వ‌దిలేసి హైద‌రాబాద్ వ‌చ్చేశారు. ఇక్క‌డ నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా ఎన్టీఆర్ బ‌యోపిక్ ని ప్రారంభించారు. అనంత‌ర కాలంలో క్రిష్ - కంగ‌న మ‌ధ్య మాటా మాటా పెరిగిన సంగ‌తి తెలిసిందే. అయితే కంగ‌న వ‌ల్ల క్రిష్ అవ‌మానం ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. మ‌ణిక‌ర్ణిక రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించినా అస‌లు క్రిష్ పేరు వినిపించ‌కుండా కంగ‌న మొత్తం క్లీన్ స్వీప్ చేసేసింది. ఆ స‌క్సెస్ క్రెడిట్ మొత్తం త‌న ఖాతాలోకి మ‌ళ్లించింది. ఈ మొత్తం వివాదంలో మ‌ణిక‌ర్ణిక నిర్మాత‌లు.. ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ పూర్తిగా కంగ‌న‌కే స‌పోర్ట్ గా నిల‌వ‌డంపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. ఇక ఇటీవ‌లే `ఓట‌ర్` విష‌యంలో ఆ చిత్ర ద‌ర్శ‌కుడు జి.కార్తీక్ రెడ్డి హీరో మంచు విష్ణు పై తీవ్రంగా ఆరోపించారు. ఓట‌ర్ క‌థ హ‌క్కుల విష‌యంలో విష్ణుతో త‌లెత్తిన వివాదం చినికి చినికి గాలివాన అయ్యింది. కోర్టుల ప‌రిధిలో ఒక‌రిపై ఒక‌రు కేసులు వేసుకునేంత వ‌ర‌కూ వెళ్లింది. ద‌ర్శ‌కుడు కార్తీక్ రెడ్డి త‌న‌కు విష్ణు కుటుంబం వ‌ల్ల ప్ర‌మాదం ఉంద‌ని ఆరోపిస్తూ ఓ వీడియోని మీడియాకి రిలీజ్ చేయ‌డం సంచ‌ల‌న‌మైంది. ఓట‌ర్ క‌థతో మోహ‌న్ బాబు `అసెంబ్లీ రౌడీ` క‌థకు ఏ సంబంధం లేద‌ని.. కానీ విష్ణు త‌న పేరును టైటిల్స్ వేసుకున్నార‌ని.. మార్పులు చేయించి రిలీజ్ లేట‌య్యేందుకు కార‌కుడ‌య్యాడ‌ని.. ద‌ర్శ‌కుడు కార్తీక్ రెడ్డి ఆరోపించారు. మొత్తానికి హీరో- ద‌ర్శ‌కుడి మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ ప‌తాక శీర్షిక‌ల‌కెక్కాయి. ఇక ద‌ర్శ‌కుడు కార్తీక్ రెడ్డికి ఆ ఎపిసోడ్ లో అవ‌మానం త‌ప్ప‌లేదని అంద‌రికీ అర్థ‌మైంది.

బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌లో న‌టించిన‌ ఎన్టీఆర్ బ‌యోపిక్ అవ‌కాశం తొలుత తేజ‌ను వ‌రించింది. స్క్రిప్టు పూర్త‌యి.. ప్రారంభోత్స‌వం జ‌రిగాక తేజ ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నారు. బాల‌కృష్ణ‌తో క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల‌నే తేజ త‌ప్పుకున్నాని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే పెద్దాయ‌నను స్థాయికి త‌గ్గ‌ట్టు చూపించ‌లేన‌నే భ‌యంతోనే త‌ప్పుకున్నాన‌ని తేజ ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. కానీ ఎవ‌రూ ఇప్ప‌టికీ దానిని న‌మ్మ‌డం లేదు. ఈ ఎపిసోడ్ లో తేజ‌కు అవ‌మానం అనేకంటే అత‌డి మొండిత‌నం ప్ర‌ముఖంగా ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చింది. స్వ‌త‌హాగా మొండివాడైన తేజ తాను అనుకున్న‌దే తీయాల‌నుకుంటాడు. ఈ విష‌యంలో బాల‌య్య‌తో డిఫ‌రెన్సెస్ త‌ప్ప‌లేద‌ని చ‌ర్చించుకున్నారు. ఇక ఎన్టీఆర్ బ‌యోపిక్ తీసేందుకు కాపు కాసుకుని కూచున్న వ‌ర్మ‌కు ఆ ఛాన్స్ రాక‌పోవ‌డంతో `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` తీసి క‌సి తీర్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఆర్జీవీ ఎంతో శ్ర‌మించి `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` తీస్తే ఆ చిత్రాన్ని ఏపీలో రిలీజ్ కానీకుండా తీర‌ని అవ‌మానానికి గురి చేయ‌డం చ‌ర్చ‌కొచ్చింది. ఇదంతా తేదేపా - చంద్ర‌బాబు కుట్ర అంటూ వ‌ర్మ నెత్తి నోరు బాదుకున్నా రిలీజ్ మాత్రం స‌స్పెన్స్ లో ప‌డింది. మే 23 రిజ‌ల్ట్ త‌ర్వాత కానీ ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ కాని ప‌రిస్థితి నెల‌కొంది.

త‌మిళ ద‌ర్శ‌కుల్లో జాతీయ అవార్డ్ గ్ర‌హీత.. సీనియ‌ర్ మోస్ట్ డైరెక్ట‌ర్ బాలాకు ఎదురైన అవ‌మానం గురించి తెలిసిందే. అత‌డు ఓ సినిమాని పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేస్తున్న స‌మ‌యంలో దానిని స్క్రాప్ లో వేసేయ‌డం సంచ‌ల‌న‌మైంది. చియాన్ విక్ర‌మ్ వారసుడు ధృవ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ బాలా తెర‌కెక్కించిన `వ‌ర్మ` (అర్జున్ రెడ్డి రీమేక్) స‌రిగా రాలేదంటూ నిర్మాత‌లు వ్య‌తిరేకించారు. అనంత‌రం ఆ ప్రాజెక్టు నుంచి బాలా త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. వేరొక ద‌ర్శ‌కుడితో ఆ సినిమాని తిరిగి ఏ టు జెడ్ పూర్తి చేస్తున్నారు. ఆ వివాదంలో ఎంతో సీనియ‌ర్ అయిన బాలాకు తీర‌ని అవ‌మాన‌మే మిగిలింది.

తాజాగా లారెన్స్ మాస్టార్ వివాదం అంతే ర‌చ్చ‌కెక్కింది. కాంచ‌న హిందీ రీమేక్ విష‌యంలో లారెన్స్ కి చిత్ర క‌థానాయ‌కుడు అక్ష‌య్ కుమార్ తో విభేధాలు త‌లెత్తాయి. ఆ క్ర‌మంలోనే లారెన్స్ కి తెలియ‌కుండానే `ల‌క్ష్మీ బాంబ్` ఫ‌స్ట్ లుక్ ని కిలాడీ అక్ష‌య్ కుమార్ లాంచ్ చేసేశారు. దీంతో త‌న ఆత్మ గౌర‌వానికి భంగం క‌లిగింద‌ని అలాంటి వాళ్ల‌తో ప‌ని చేయ‌లేన‌ని లారెన్స్ ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నారు. ఒక షెడ్యూల్ పూర్త‌య్యాక ఈ డిఫ‌రెన్సెస్ బ‌య‌ట‌ప‌డ్డాయి. కిలాడీ వ‌ల్ల లారెన్స్ మాస్టార్ తీర‌ని అవ‌మానం ఫీల‌య్యారు. ఇక గ‌తంలో మ‌హేష్ `ఆగ‌డు` చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో శ్రీ‌నువైట్ల కు ప్ర‌కాష్ రాజ్ కి మ‌ధ్య గొడ‌వ తెలిసిందే. ఆన్ లొకేష‌న్ శ్రీ‌నూ అసిస్టెంట్ ని ప్ర‌కాష్ రాజ్ అవ‌మానించార‌ని దాంతో వైట్ల గొడ‌వ పడ్డార‌ని ప్ర‌చారం సాగింది. ఆ త‌ర్వాత ప్ర‌కాష్ రాజ్ ఆ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ వివాదంలో శ్రీ‌ను వైట్ల‌కు అవ‌మానం ఎదుర‌వ్వ‌లేదు కానీ.. రిలీజై డిజాస్ట‌ర్ అయ్యాక మాత్రం అవ‌మానాల‌ ఫ‌ర్వం గురించి తెలిసిందే.