Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'డ‌ర్టీ హ‌రి'

By:  Tupaki Desk   |   19 Dec 2020 1:35 PM GMT
మూవీ రివ్యూ: డ‌ర్టీ హ‌రి
X
చిత్రం : డ‌ర్టీ హ‌రి

న‌టీన‌టులు: శ‌్రావ‌ణ్ రెడ్డి - సిమ్ర‌త్ కౌర్ - రుహాని వ‌ర్మ‌ - అప్పాజీ అంబ‌రీష‌ - సురేఖా వాణి - అజ‌య్ త‌దిత‌రులు
సంగీతం: మార్క్.కె.రాబిన్
ఛాయాగ్ర‌హణం: బాల్ రెడ్డి
నిర్మాత‌లు: గూడూరు స‌తీష్ బాబు-గూడూరు సాయిపునీత్ - కేదార్ సెల‌గంశెట్టి - వం శీ కారుమంచి
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: ఎం.ఎస్.రాజు

ఒక‌ప్పుడు శ‌త్రువు.. దేవి.. మ‌న‌సంతా నువ్వే.. ఒక్క‌డు.. వ‌ర్షం.. నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి టాప్ క్లాస్ సినిమాల‌తో నిర్మాత‌గా త‌న‌దైన ముద్ర వేసిన ఎం.ఎస్.రాజు ఇప్పుడు ద‌ర్శ‌కుడిగా *డ‌ర్టీ హ‌రి* అనే ఎరోటిక్ ట‌చ్ ఉన్న థ్రిల్ల‌ర్ తీసి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. దీని ప్రోమోలు చూసి రాజు నుంచి ఇలాంటి సినిమా ఏంటి అని అంతా షాక‌య్యారు. ఈ రోజే ఆన్ లైన్లో పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో విడుద‌లైన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం ప‌దండి.

క‌థ:

హ‌రి (శ్రావ‌ణ్ రెడ్డి) ఒక చ‌ద‌రంగ క్రీడాకారుడు. రాష్ట్ర స్థాయిలో ప‌త‌కాలు సాధించిన అత‌ను.. హైద‌రాబాద్ కు వ‌చ్చి ఒక క్ల‌బ్బులో చెస్ కోచ్ గా చేర‌తాడు. అక్క‌డ ప‌రిచ‌యం అయిన ఓ బిగ్ షాట్ ద్వారా అత‌డి కుటుంబానికి.. త‌న చెల్లెలైన వైదేహి (రుహాని)కి చేరువ‌వుతాడు. వాళ్లిద్ద‌రూ ప్రేమ‌లో ప‌డతారు. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా జ‌రుగుతుంది. కానీ వైదేహి అన్న‌య్య ప్రేయ‌సి అయిన జాస్మిన్ (సిమ్ర‌త్)కు అనుకోకుండా ద‌గ్గ‌రైన హ‌రి.. త‌న పెళ్లి త‌ర్వాత కూడా ఆమెతో రాస‌లీల‌లు సాగిస్తాడు. ఇంత‌లో ఆమె గ‌ర్భ‌వ‌తి అవుతుంది. వైదేహిని వ‌దిలేసి త‌న‌తోనే ఉండాల‌ని జాస్మిన్ ప‌ట్టుబ‌డితే.. ఏం చేయాలో పాలుపోని స్థితి ప‌డ‌తాడు హ‌రి. అప్పుడ‌త‌ను ఏం చేశాడ‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

క‌థ‌నం - విశ్లేష‌ణ:

*డ‌ర్టీ హ‌రి* ప్రోమోలు చూసిన వాళ్లంద‌రిలోనూ ఒక‌టే సందేహం.. ఒక‌ప్పుడు క్లీన్ ఎంట‌ర్టైన‌ర్ల‌తో నిర్మాత‌గా గొప్ప పేరు సంపాదించిన ఎం.ఎస్.రాజు నుంచి ఇలాంటి సినిమా ఏంట‌ని యూత్ ను ఆక‌ట్టుకోవ‌డానికి ఆయ‌న బూతునే నమ్ముకున్నార‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. దీనిపై రాజు స్పందిస్తూ.. ప్రోమోల్లో చూపించిన బోల్డ్ మూమెంట్స్ అన్నీ కేవ‌లం ప్రేక్ష‌కులను సినిమా వైపు ఆక‌ర్షించ‌డానికి మాత్ర‌మే అని.. నిజానికి సినిమాలో అంత‌కుమించి విష‌యం చాలా ఉంద‌ని.. కాబ‌ట్టి శుక్ర‌వారం సినిమా చూసి త‌ర్వాత‌ మాట్లాడాల‌ని అన్నారు. ఐతే రాజు ఇంత‌గా చెప్పాడంటే *డ‌ర్టీ హ‌రి* ఇంకేదో ఉంటుంద‌ని ఆశించి సినిమా చూస్తే.. అలాంటి విశేషాలేమీ ఇందులో క‌నిపించ‌వు. హాలీవుడ్ మూవీ *అన్ ఫెయిత్‌ఫుల్* స్టోరీ తీసుకుని.. ఒరిజిన‌ల్‌ను మించి శృంగార రసాన్ని బాగా ద‌ట్టించి యువ‌త‌ను రంజింప‌జేయ‌డానికి ఆయ‌న చేసిన సాదాసీదా ప్ర‌య‌త్నం.. డ‌ర్టీ హ‌రి.

బాలీవుడ్ వాళ్లు చాలా ఏళ్ల ముందే అదే ప‌నిగా తీసి తీసి అర‌గ‌దీసేసిన అక్ర‌మ సంబంధాల క‌థ‌ల్నే ఎం.ఎస్.రాజు అటు ఇటుగా తిప్పి *డ‌ర్టీ హ‌రి*గా ప్రెజెంట్ చేసిన‌ట్లు అనిపిస్తుంది. క‌థగా ఇందులో ఏ కొత్త‌ద‌నం క‌నిపించ‌దు. చివ‌ర్లో ఒక ట్విస్టు చూపించేసి.. ఏదో థ్రిల్ చేసేశామ‌ని రాజు ఫీలై ఉండొచ్చు కానీ.. అంత‌కుముందు న‌డిచేదంతా రొటీన్ వ్య‌వ‌హార‌మే. పెద్ద స్థాయికి ఎద‌గాల‌న్న‌ ఆలోచ‌న‌లున్న ఒక కుర్రాడు సిటీకి రావ‌డం.. దొరికిన అవ‌కాశాల‌న్నీ ఉప‌యోగించుకుంటూ ఒక పెద్ద ఫ్యామిలీలో అల్లుడైపోవ‌డం.. వారి కంపెనీని త‌న చేతుల్లోకి తీసుకోవ‌డం.. ఈ వ్య‌వ‌హార‌మంతా చాలా కంఫ‌ర్ట‌బుల్ గా సాగిపోతుందీ క‌థ‌లో. ఈ విష‌యంలో హీరోకు ఎక్క‌డా ఏ చిన్న ఇబ్బందీ రాదు. అస‌లు అత‌ణ్ని చూసి ఆ కుటుంబ‌మంతా ఎందుకు ఇంప్రెస్ అయిపోతుందో.. నెత్తిన పెట్టుకుంటుందో అర్థం కాదు. అత‌నేదో సాధించిన‌ట్లు కూడా ఎక్క‌డా చూపించ‌రు.

క‌థ‌లో ఈ అంశాల మీద అస‌లు ఫోక‌స్సే లేదు. ఎందుకంటే ఎం.ఎస్.రాజు ప్రోమోల‌తో ఎవ‌రిని టార్గెట్ చేశారో వాళ్ల‌కు ఏం అందించాల‌న్న‌దే చూశారు. సిమ్ర‌త్ కౌర్ తో హీరోకు ప‌రిచ‌యం మొద‌లైన‌ప్ప‌టినుంచి వీళ్లెప్పుడు ముగ్గులోకి దిగుతారా అని ప్రేక్ష‌కులు ఎదురు చూసేలా వ్య‌వ‌హారం న‌డుస్తుంది. ఇక ఇద్ద‌రి మ‌ధ్య తొలి *ఘ‌ట్టం* అయ్యాక‌‌ కొంత విరామం ఇచ్చి.. విర‌హాన్ని పెంచి, ఆ బ్రేక్ త‌ర్వాత శృంగారాన్ని ప‌తాక స్థాయికి తీసుకెళ్లారు. ఇక అక్క‌డి నుంచి అవే సీన్ల‌ను తిప్పి తిప్పి కాల‌క్షేపం చేయించి.. ఆ త‌ర్వాత ఆమె ప్రెగ్నెంట్ అవ‌డం.. హీరో ఆలోచ‌న మారిపోవ‌డం.. క్రైమ్ ఎలిమెంట్ ను తీసుకురావ‌డం.. లాంటి రొటీన్ టెంప్లేట్లో సినిమా సాగిపోతుంది. చివ‌రి 20 నిమిషాల వ‌ర‌కు కూడా క‌థ‌లో ఏ మ‌లుపు లేకపోవ‌డంతో రాజు చెప్పిన ఇంకేదో విష‌యం ఎక్క‌డ‌బ్బా అని ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప్రేక్ష‌కుల వంత‌వుతుంది. హిందీలో *మ‌ర్డ‌ర్* స‌హా అక్ర‌మ సంబంధాల క‌థ‌ల‌న్నీ చివ‌రికి ఒక క్రైమ్ ద‌గ్గ‌ర మ‌లుపు తిరుగుతాయి. ఐతే ఆ క్రైమ్ త‌ర్వాత చాలా క‌థ న‌డుస్తుంది. ఆ నేప‌థ్యంలో ఉత్కంఠ ఉంటుంది. కానీ ఇందులో అది లేదు.

చివ‌ర్లో ఒక 15-20 నిమిషాల పాటు మ‌ర్డ‌ర్-ఇన్వెస్టిగేష‌న్ చుట్టూ క‌థ‌ను న‌డిపించారు కానీ.. అదంతా హ‌డావుడి వ్య‌వ‌హారంలా అనిపిస్తుంది. చివ‌ర్లో ఏదో ట్విస్టు ఇవ్వాలి అన్న‌ట్లు ఇచ్చారు. రుహాని పాత్ర‌ను అప్ప‌టిదాకా మ‌రీ నామ‌మాత్రంగా న‌డిపించి.. చివ‌ర్లో ఆమె కోణంలో క‌థ‌ను ముగించి జ‌స్టిఫై చేయ‌డానికి ప్ర‌య‌త్నించారు కానీ.. అదేమంత ఇంప్రెసివ్ గా అనిపించ‌దు. చివ‌ర్లో ట్విస్టుతో ప్రేక్ష‌కులు మ‌రీ థ్రిల్ అయిపోయేది కూడా ఏమీ ఉండదు. ఇంట‌ర్వెల్ ద‌గ్గ‌రే హ‌త్య జ‌రిగి.. ద్వితీయార్ధ‌మంతా ఈ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ చుట్టూ అయినా క‌థ న‌డిస్తే.. ఉత్కంఠ‌కు అవ‌కాశ‌ముండేదేమో. కానీ శృంగార స‌న్నివేశాలు.. త‌ర్వాత గొడ‌వ‌లతోనే పుణ్య‌కాలం అంతా గ‌డిచిపోయింది. కేవ‌లం ప్రోమోల్లోనే కాదు.. సినిమాలో సైతం ఎరోటిక్ కంటెంట్ మాత్రమే హైలైట్ అయింది. మిగ‌తాదంతా బోరింగ్ వ్య‌వ‌హారం లాగే అనిపిస్తుంది. ప్రోమోల్లో చూసిన ఎరోటిక్ సీన్ల మీదే ఆస‌క్తి ఉంటే.. క‌థాక‌థ‌నాల‌తో సంబంధం లేకుండా కాల‌క్షేపం చేసేయొచ్చు కానీ.. అంత‌కుమించి సినిమాలో ఏదో ఉంటుంద‌ని ఆశిస్తే మాత్రం *డ‌ర్టీ హ‌రి* నిరాశ ప‌రుస్తుంది.

న‌టీన‌టులు:

హ‌రి పాత్ర‌లో చేసిన శ్రావ‌ణ్ రెడ్డిలో ముఖంలో పెద్ద‌గా హావ‌భావాలేమీ ప‌ల‌క‌లేదు. అత‌డికి పెద్ద‌గా న‌టించాల్సిన అవ‌కాశం కూడా రాలేదు. ఐతే హ‌రి పాత్ర‌కు అత‌ను స‌రిపోయాడు అనిపిస్తుంది. ఇద్ద‌రు హీరోయిన్ల‌తో అత‌ను బాగానే రొమాన్స్ పండించాడు. హీరోయిన్లిద్ద‌రిలో హైలైట్ అయింది సిమ్ర‌తే. ఆమె ఏ బెరుకూ లేకుండా శృంగార స‌న్నివేశాల్లో రెచ్చిపోయి న‌టించింది. సినిమా అంత‌టా స్కిన్ షో చేసింది. శ్రావ‌ణ్ తో ఆమె కెమిస్ట్రీ బాగానే పండింది. న‌ట‌న ప‌రంగా సిమ్ర‌త్ గురించి చెప్ప‌డానికేమీ లేదు. రుహాని పాత్ర‌కు ప్రాధాన్యం త‌క్కువే కానీ.. ఉన్నంత‌లో ఆమె బాగానే పెర్ఫామ్ చేసింది. అజ‌య్ ఐదు నిమిషాల పాత్ర‌లో ఓకే అనిపించాడు. అప్పాజీ అంబ‌రీష‌, సురేఖ వాణి ఓకే.

సాంకేతిక వ‌ర్గం:

సినిమాలో సంగీతానికి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. ఉన్నది ఒక పాట. కానీ ఆ పాట‌లో ప్రేక్ష‌కుల దృష్టంతా మ‌రెక్క‌డో ఉంటుంది. మార్క్ కె.రాబిన్ నేప‌థ్య సంగీతం జ‌స్ట్ ఓకే అనిపిస్తుంది. బాల్ రెడ్డి ఛాయాగ్ర‌హ‌ణం ప‌ర్వాలేదు. శృంగార స‌న్నివేశాలను ఎలివేట్ చేయ‌డానికే కెమెరామ‌న్ త‌న ప్ర‌తిభ‌నంతా ఉప‌యోగించాల్సి వ‌చ్చింది. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. ఇక రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ ఎం.ఎస్.రాజు.. హాలీవుడ్ క‌థ తీసుకుని.. బాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో సినిమా లాగించేసిన‌ట్లు అనిపిస్తుంది త‌ప్ప త‌న ముద్రంటూ ఏమీ క‌నిపించ‌లేదు. కుర్ర ద‌ర్శ‌కుల‌కు దీటుగా శృంగార స‌న్నివేశాల్ని చాలా అగ్రెసివ్ గా తీయ‌డం ఒక్క‌టే ఆయ‌న ప్ర‌త్యేక‌త‌గా చెప్పుకోవాలి.


చివ‌ర‌గా: డ‌ర్టీ హ‌రి.. బోల్డ్ అండ్ బోర్

రేటింగ్-2.25/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre