Begin typing your search above and press return to search.

'డర్' పుట్టించిన సెప్టెంబర్

By:  Tupaki Desk   |   1 Oct 2018 6:40 AM GMT
డర్ పుట్టించిన సెప్టెంబర్
X
ఒకే నెలలో వారానికో మూడు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి అంటే బాక్స్ ఆఫీస్ నిజంగా కళకళలాడుతూ థియేటర్ కౌంటర్లు బిజీగా ఉండాలి. కానీ ఈ ఏడాది సెప్టెంబర్ మాత్రం దానికి భిన్నంగా చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు రిలీజైనా వాటి తాలూకు ఫలితాలు మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో బయ్యర్లే కాదు ప్రేక్షకులు కూడా ఉసూరుమంటున్నారు.

మొదటివారం మంచి ప్రీ రిలీజ్ టాక్ తో రిలీజ్ అయిన కేరాఫ్ కంచెరపాలెంకు సెలెబ్రిటీలు ఎంత అండగా నిలిచినా ఆ అవకాశాన్ని వసూళ్ల రూపంలో మార్చుకోవడంలో ఫెయిల్ అయ్యింది. మంచి సినిమా అనే స్టాంప్ అయితే పడింది కానీ కలెక్షన్స్ లో ఓడిపోయింది. ఇక అదే రోజు వచ్చిన సిల్లీ ఫెలోస్ కాంబో పుణ్యమా అని మొదటి రెండు రోజులు పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత టపా కట్టేసి తక్కువ బడ్జెట్ లో వచ్చినా నష్టాలు ఇవ్వక తప్పలేదు. టెక్నీకల్ గా ఎంత గొప్పగా ఉన్నా ప్రేక్షకుడిని మెప్పించే కంటెంట్ లేకపోతే ఒడిపోక తప్పదని మను నిరూపించింది.

రెండో వారంలో వచ్చిన మొగుడు పెళ్ళాలు నాగ చైతన్య సమంతాల శైలజా రెడ్డి అల్లుడు-యుటర్న్ రెండూ ఇంచుమించు ఒకే ఫలితాన్ని అందుకున్నాయి. జరిగిన బిజినెస్ కు తగ్గ షేర్ తేవడంలో చైతు ఫెయిల్ కాగా టాక్ బాగున్నా సమంతా ఇమేజ్ మీదే సినిమా నడవలేకపోవడం వల్ల యుటర్న్ తేడా కొట్టింది. మరుసటి రోజే జనతా హోటల్ అనే డబ్బింగ్ సినిమా వస్తే దుల్కర్ సల్మాన్ హీరో అయినా ఎవరూ పట్టించుకోలేదు.

ఇక మూడో వారంలో సుధీర్ బాబు నన్ను దోచుకుందువటేతో పలకరించాడు. యావరేజ్ కంటెంట్ తో సగటు ఎంటర్ టైన్మెంట్ తో సినిమాను నిలబెట్టే స్థాయి సుధీర్ కు లేదని ఇది రుజువు చేసింది. టాక్ రివ్యూస్ బాగానే వచ్చినా థియేటర్ల దగ్గర జనం లేని భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఇక విక్రమ్ సామీ గురించి మాట్లాడకపోవడం ఉత్తమం.

నాలుగో వారంలో పలకరించిన క్రేజీ మల్టీ స్టారర్ దేవదాస్ ఫలితం కూడా అంతంత మాత్రంగానే ఉంది - నాగార్జున నానిల కాంబో మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలలో సగం కూడా అందుకోలేకపోవడంతో జస్ట్ యావరేజ్ అనిపించుకునే దగ్గరే దేవదాస్ ఆగిపోయేలా ఉన్నాడు. ఈ రోజు నుంచి డ్రాప్ ఉండటం ఖాయమంటున్నారు ట్రేడ్ వర్గాలు. మణిరత్నం నవాబ్ ను ఒక వర్గం ప్రేక్షకులు ఆకాశానికెత్తినా నిజమేంటో పలుచగా ఉన్న రద్దీనే చెబుతోంది. టెక్నీకల్ గా మెప్పించిన మణి తనలో ఒరిజినల్ దర్శకుడిని మాత్రం చూపించలేకపోయారు.

ఇవి కాకుండా ఇదే నెలలో వచ్చిన అర్జున్ కురుక్షేత్రం-ఈ మాయ పేరేమిటో- ప్రేమకు రైన్ చెక్ లాంటివి కనీయం విడుదలయ్యాయి అనే విషయం ప్రేక్షకులు గుర్తించే లోపే మాయమయ్యాయి. ఈ రకంగా సెప్టెంబర్ డర్(భయం) పుట్టించడంలో మాత్రమే సక్సెస్ అయ్యింది.