Begin typing your search above and press return to search.

ధోనిపై రాజమౌళి గొప్పగానే మాట్లాడాడు కానీ..

By:  Tupaki Desk   |   25 Sep 2016 9:01 AM GMT
ధోనిపై రాజమౌళి గొప్పగానే మాట్లాడాడు కానీ..
X
టీమ్ ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మన దర్శక ధీరుడు రాజమౌళి ఎంత పెద్ద అభిమానో నిన్న ‘ఎం.ఎస్.ధోని’ ఆడియో వేడుకలో అందరికీ తెలిసిందే. సగటు క్రికెట్ అభిమానిగా మారిపోయి.. ధోని మీద ప్రశంసల జల్లు కురిపించాడు జక్కన్న. ధోని ధోని.. అంటూ ఆయన చేసిన నినాదాలు.. ఆయన ఎగ్జైట్మెంట్ చాలామందిని ఆశ్చర్యపరిచాయి. ధోని కర్మయోగి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ధోని గొప్పదనాన్ని చెబుతూ ఆయన చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఐతే ధోని రాకముందు.. ధోని వచ్చాక వచ్చిన మార్పు గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు మాత్రం క్రికెట్ అభిమానులకు కొంత ఆశ్చర్యం కలిగించాయి.

80లు 90ల్లో భారత అభిమానులకు క్రికెట్ పై అభిమానం బాగా పెరిగిందని చెప్పిన రాజమౌళి.. అప్పుడు అందరం ఇండియా మ్యాచ్ ఓడిపోతుందేమో అని భయం భయంగా క్రికెట్ చూసేవాళ్లమని.. ధోని వచ్చాకే ఆ భయం పోయి.. మ్యాచ్ లను ఆస్వాదించడం మొదలైందని అన్నాడు. ఇక్కడే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ధోని కంటే ముందు గంగూలీ సారథ్యంలోనే ఈ మార్పు మొదలైంది. బెదురు లేని క్రికెట్ ఆడటం గంగూలీ కెప్టెన్సీలోనే టీమ్ ఇండియా అలవాటు చేసుకుంది. 2001 నాటి ఈడెన్ గార్డెన్స్ టెస్టు తర్వాత భారత క్రికెట్ ముఖచిత్రమే మారిపోయింది. ఇంటా బయటా మ్యాచ్ లు గెలవడం.. ప్రత్యర్థుల్ని చిత్తు చేయడంలో భారత్ ఆరితేరింది. మన ఫ్యాన్స్ కూడా భయం వదిలి.. మ్యాచ్ లు ఆస్వాదించడం గంగూలీ నాయకత్వంలోనే మొదలైంది. ధోని వచ్చి మరింతగా మార్పు తెచ్చాడు. ధోని గొప్పదనం గురించి జక్కన్న చెప్పిన మాటలన్నీ కరెక్టే కానీ.. గంగూలీ ఎరాను విస్మరించడం మాత్రం కరెక్ట్ కాదు.