Begin typing your search above and press return to search.

కమ్ముల సార్.. ఎందుకిలా చేశారు?

By:  Tupaki Desk   |   4 April 2018 11:30 PM GMT
కమ్ముల సార్.. ఎందుకిలా చేశారు?
X
నటి శ్రీరెడ్డి దాదాపు నెల రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సినీ పరిశ్రమపై రకరకాల ఆరోపణలు చేస్తోంది. పెద్ద పెద్ద వాళ్ల బాగోతాలకు సంబంధించి తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అంటోంది. కానీ ఇప్పటిదాకా ఎవరి పేరూ బయటపెట్టలేదు. తన ఫేస్ బుక్ పేజీలో రోజూ ఏదో ఒక పోస్టు పెట్టడం.. ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయడం.. వీడియోలు షేర్ చేయడం చేస్తోందామె. ఐతే మొన్న దర్శకుడు శేఖర్ కమ్ముల పేరు ధ్వనించేలా ఆమె కొన్ని ఆరోపణలు చేసింది. ఆమె ఎవరిని అంటోందో చాలామందికి అర్థం కాలేదు. కొందరు మాత్రం ఆమె ఆరోపణలు చేసింది శేఖర్ కమ్ములపై అని భావించారు. దీనిపై పెద్ద చర్చేమీ జరగలేదు. కానీ ఇంతలోనే కమ్ముల లైన్లోకి వచ్చేశాడు. శ్రీరెడ్డి పేరెత్తకుండా ఆమెకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు.

ఐతే శేఖర్ స్పందించడంతో ఇది హాట్ టాపిక్ అయిపోయింది. దీనిపై చర్చోప చర్చలు నడిచాయి. మీడియాలో ఇది పెద్ద వార్తయి కూర్చుంది. శ్రీరెడ్డి ఆరోపణలు చేసినపుడు ఎవరూ పట్టించుకోలేదు కానీ.. కమ్ముల స్పందనతో ఇది పెద్ద వార్తగా మారింది. అసలు శ్రీరెడ్డి ఏమందో చూద్దామన్న కుతూహలం అందరిలో కలిగింది. ఆమె ఆరోపణల గురించి అందరికీ తెలిశాయి. శ్రీరెడ్డి ఏం కోరుకుందో అదే జరిగింది. ఆమెకు కావాల్సినంత ప్రచారం జరిగింది. దీంతో కమ్ముల స్పందించి తప్పు చేశాడన్న అభిప్రాయం కలుగుతోంది. తన గురించి కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నా భరించలేనన్న భావనతో కమ్ముల స్పందించి ఉండొచ్చు కానీ.. ఈ స్పందనతో శ్రీరెడ్డికి అనవసర ప్రచారం కల్పించినట్లయింది. ఆయన అనవసరంగా బురదలో రాయి వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజంగా తప్పులు చేసిన వాళ్లు ఏ భయం లేకుండా దర్జాగా తిరిగేస్తుంటే కమ్ముల ఇలా స్పందించడం వల్ల అనవసరంగా వార్తల్లో నిలిచాడని అంటున్నారు. మొత్తంగా కమ్ముల స్పందనకు సంబంధించి భిన్నాభిప్రాయలున్నాయి కానీ.. మెజారిటీ జనాలు మాత్రం ఆయన స్పందించాల్సింది కాదనే అభిప్రాయపడుతున్నారు.