Begin typing your search above and press return to search.

రాజమౌళి 'బొమ్మరిల్లు ఫాదర్' అంటే మీరు నమ్ముతారా?

By:  Tupaki Desk   |   25 April 2022 9:30 AM GMT
రాజమౌళి బొమ్మరిల్లు ఫాదర్ అంటే మీరు నమ్ముతారా?
X
రాజమౌళి క్రమశిక్షణకు మారుపేరు అనే సంగతి తెలిసిందే. తనతో పాటు తన సినిమా టీమ్ ఐడీ కార్డులు ధరించడం .. షూటింగు సమయంలో ఎవరూ కూడా సెల్ ఫోన్స్ వాడకూడదు అనే నియమం పెట్టడం .. ప్రమోషన్స్ సమయంలో ఆ సినిమా టైటిల్ ను షర్ట్స్ పై డిజైన్ చేయించడం ఇవన్నీ కూడా ఆయన పద్ధతికి అద్దం పడతాయి. ఒక సినిమా షూటింగు పూర్తి అయ్యేవరకూ ఆయన ఆ సినిమాపైనే పూర్తి దృష్టి పెడతారు. ఈ లోగా మరో కథను వినడానికి కూడా ఆయన ఆసక్తిని చూపడనే సంగతిని స్వయంగా విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

రాజమౌళి ఒక కథను సెట్ చేసుకుని రంగంలోకి దిగితే అది సినిమాగా పూర్తి రూపాన్ని సంతరించుకుని థియేటర్లకు రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక కథ ప్రకారం ఆయన సినిమాల్లో హీరోలకు ప్రత్యేకమైన లుక్ ఉంటుంది. అందువలన వాళ్లు ఆ సినిమా పూర్తయ్యేవరకూ మరో సినిమా చేయడానికి అవకాశం ఉండదు. ప్రభాస్ .. ఎన్టీఆర్ విషయంలో ఇదే జరిగింది. అయితే ఒక్క చరణ్ మాత్రం అందుకు భిన్నంగా 'ఆర్ ఆర్ ఆర్' సెట్స్ పై ఉండగానే, కొరటాల దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా చేశాడు.

అది ఎలా సాధ్యమైందనేది 'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చరణ్ చెప్పాడు. ఆ సినిమాలో సిద్ధూ చేయి ప్రకాశ్ రాజ్ చేతిలోనే ఉంటుంది. ఆ సినిమాలో సిద్ధూ చేతిని ప్రకాశ్ రాజ్ చేయి ఎలా పట్టుకుని ఉంటుందో, తన సినిమా చేసే హీరో చేతిని రాజమౌళిగారి చేయి అలాగే పట్టుకుని ఉంటుంది.

ఆ చేయిని విడిపించుకోవడం చాలా కష్టం. అవతల చూస్తేనేమో నేను .. నాన్న కలిసి నటించాలనేది అమ్మ డ్రీమ్. అంతకుముందు ఇద్దరం కలిసి కనిపించినా 'ఆచార్య'కి ఉన్న ప్రత్యేకత .. ప్రాధాన్యత వేరు. అందువలన నేను కొరటాలగారు కలిసి నాన్నను ముందుకు నెట్టాము.

నాన్నే వెళ్లి రాజమౌళి గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు. ఆ తరువాత వీలును బట్టి ఆయన నన్ను వదులుతూ ఉండటంతో 'ఆచార్య'ను పూర్తి చేయడం జరిగింది. అందుకు మా అమ్మ రాజమౌళిగారికి థ్యాంక్స్ చెబుతోంది అంటూ తల్లివైపు చూపించాడు. సురేఖ నమస్కారానికి రాజమౌళి వేదికపై నుంచి ప్రతి నమస్కారం చేశారు.

ఇక చరణ్ చెప్పిన విషయాన్నే చిరంజీవి తనదైన స్టైల్లో చెప్పారు. ఇద్దరూ కలిసి 'ఆచార్య' సాధ్యపడటానికి ప్రధానమైన కారకుడు రాజమౌళి అని తేల్చేశారు. రాజమౌళి కూడా ఆ తండ్రీ కొడుకుల మధ్యనున్న వ్యత్యాసాన్ని తనదైన స్టైల్లో చెప్పి ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించారు.