Begin typing your search above and press return to search.

నిర్మాతలను ఎన్టీఆర్ ఎలా గౌరవించాడో తెలుసా?

By:  Tupaki Desk   |   30 May 2020 12:30 AM GMT
నిర్మాతలను ఎన్టీఆర్ ఎలా గౌరవించాడో తెలుసా?
X
పాత కాలానికి.. నేటికి సినిమా ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు హీరోల డేట్స్ కోసం నిర్మాతలు వారి గేట్ ముందు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిర్మాత పరిస్థితి క్యాషియర్ స్థాయికి దిగజారిపోయిందన్న ఆవేదన చాలా మంది నిర్మాతల్లో ఉంది. హీరోలు, దర్శకుల ముందర చేతులు కట్టుకొని నిలబడాల్సిందేనని కొందరు నిర్మాతలు తరుచుగా వాపోతుంటారు. ఎన్టీఆర్, ఎఎన్నార్ లు ఇచ్చిన గౌరవంతో పోలిస్తే నేటి స్టార్ హీరోలు ఇస్తున్న గౌరవం ఇసుమంత కూడా కాదని టాలీవుడ్ లో నాటి సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటారు.

తాజాగా ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుడిని పలువురు సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి హీరోలు, ఆర్టిస్టులు, హీరోయిన్లు ఎన్టీఆర్ తో అనుబంధాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దిగ్గజ నిర్మాత సి. అశ్వినీదత్ సైతం ఎన్టీఆర్ గొప్పతనం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్టీఆర్ చేతుల మీదుగానే ‘వైజయంతీ మూవీస్’ నిర్మాణ సంస్థ స్థాపించబడిందని ఆ సంస్థ అధినేత అశ్వినీదత్ తెలిపారు. ఎన్టీఆర్ హీరోగా ‘ఎదురులేని మనిషి’ అనే చిత్రాన్ని తొలి చిత్రంగా తీశానన్నారు. ఆ సమయంలో తన వయసు కేవలం 24 ఏళ్లు అని అశ్వినీదత్ గుర్తు చేసుకున్నారు.

24 ఏళ్ల యువకుడైన తనను నిర్మాతగా ఎన్టీఆర్ ఎంతటి సముచిత స్థానాన్ని ఇచ్చాడో అశ్వనీదత్ గుర్తు చేసుకున్నాడు. ఒక రోజు తాను సెట్ కు వస్తే ఎన్టీఆర్ లేచి నిలబడి మరీ తనను ఆహ్వానించారని.. ‘అన్న గారు నేను వస్తే మీరు లేచి నిల్చోవడం ఏంటి?’ అని తాను సిగ్గుతో అలా చేయొద్దని అన్నానని అశ్వినీదత్ అన్నాడట.. దానికి ఎన్టీఆర్ ‘ఈ సినిమాకి నిర్మాతవి .. అందరికీ పని కల్పించి అన్నం పెట్టేవాడివి. నిన్ను నేనే గౌరవించకపోతే ఇతరులు ఏం పట్టించుకుంటారు’ అని ఎన్టీఆర్ తిరిగి ప్రశ్నించారట.. అలా ఎన్టీఆర్ నిర్మాతలకు ఎంతో గౌరవం ఇచ్చేవారని అశ్వినీదత్ పాత సంగతులు గుర్తు చేసుకున్నారు.