Begin typing your search above and press return to search.

శర్వాను అంతగా బాధపెట్టిన ఆ సినిమా ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   7 Sep 2022 10:30 AM GMT
శర్వాను అంతగా బాధపెట్టిన ఆ సినిమా ఏంటో తెలుసా?
X
శర్వానంద్ హీరోగా 'ఒకే ఒక జీవితం' సినిమా రూపొందింది. ఎస్.ఆర్. ప్రభు నిర్మించిన ఈ సినిమాకి శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించాడు. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికగా రీతూ వర్మ నటించగా, కీలకమైన పాత్రలో అమల అక్కినేని కనిపించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమాను తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. దర్శకుడిగా .. నటుడిగా తన ప్రత్యేకతను చాటుకున్న తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి సంభాషణలు అందించాడు. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన శర్వానంద్ ను ఇంటర్వ్యూ చేశాడు.

శర్వానంద్ మొదలెడుతూ .. ఉన్నది 'ఒకే ఒకే జీవితం' గనుక ఫిల్టర్స్ లేకుండా మాట్లాడతాను. "మొదటి నుంచి కూడా నేనేం ఫస్టు క్లాస్ స్టూడెంట్ ను కాదు .. బొటాబొటి మార్కులతో పాస్ అవుతూ ఉండేవాడిని. నాకు అంతగా గుర్తుకులేదుగానీ .. ఎవరైనా సరే పెద్దయిన తరువాత ఏమౌతావురా? అని అడిగితే 'చిరంజీవిలా హీరోను అవుతాను' అని చెప్పేవాడినట. నాపై చిరంజీవిగారి ప్రభావం ఉండటం మాత్రం కరెక్టు. చిరంజీవి గారి 'స్వయంకృషి' చూసిన తరువాత కష్టపడితే మనం కూడా హీరో కావొచ్చును కదా అనిపించింది. రజనీ సార్ 'ముత్తు' సినిమాలోని 'ఒకడే ఒక్కడు మొనగాడు' పాట కూడా నాలో ఒక రకమైన ఉత్తేజాన్ని కలిగించింది.

ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తవుతుండగా నేను సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నట్టుగా మా పేరెంట్స్ కి చెప్పాను. ముంబైలోని ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో చేరతానని అన్నాను. 'వీడు పెద్దగా కష్టపడ లేడు .. ఎలాగూ వెనక్కి వచ్చేస్తాడు' అనుకుని మా పేరెంట్స్ పంపంచారు.

నాకు సినిమాలంటే పిచ్చి గనుక ఎంత కష్టమైనా ఇక్కడే పడాలనే ఒక నిర్ణయానికి వచ్చాను. అలా నా ప్రయాణం మొదలైంది. ఒక వైపున సినిమాలు చేస్తూనే డిగ్రీ పూర్తి చేశాను. ఈ మధ్య కాలంలో నేను చేసిన కొన్ని సినిమాలు పోయాయి. ఆ సినిమాలలో 'పడి పడి లేచే మనసు' ఒకటి. ఆ సినిమా పోయినప్పుడు మాత్రం షాక్ అయ్యాను. ఓ మూడు నెలలు ఇంట్లో నుంచి బయటికి రాలేదు.

ఒక ఆరు నెలలుగా మాత్రం బ్రేక్ తీసుకున్నాను. ఎక్కడ పొరపాట్లు చేస్తూ వచ్చాను అనేది ఒక పరిశీలన చేస్తూ వచ్చాను. ఇక్కడంతా డబ్బు చుట్టూనే ఉంటుందని నేను అనుకోలేదు. 'కో అంటే కోటి' సినిమాకి నేనే నిర్మాతను. ఆ సినిమా పోవడంతో .. అప్పటి వరకూ చుట్టూ ఉన్నవారు కనిపించలేదు.

ఆ అప్పు తీర్చడానికి నాకు ఆరేళ్లు పట్టింది. ఆ సమయంలో నేను ఒక్క షర్టు కూడా కొనుక్కోలేదు. ఆ తరువాత నాకు హిట్స్ పడినా నమ్మలేని స్థితికి వచ్చాను. 'ఒకే ఒక జీవితం' సినిమా విషయానికి వస్తే, శ్రీకార్తీక్ కథను చాలా అందంగా చెప్పిన తీరు నచ్చడంతో ఓకే చెప్పాను. కథలోని ఫీల్ నన్నేకాదు, ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.