Begin typing your search above and press return to search.

పుష్ప‌.. కార్తికేయ 2 ని చూసి నేర్చుకోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   26 Aug 2022 6:51 AM GMT
పుష్ప‌.. కార్తికేయ 2 ని చూసి నేర్చుకోవాల్సిందేనా?
X
బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని టార్గెట్ చేసుకుని వాళ్ల‌ని మాత్ర‌మే ప్ర‌స‌న్నం చేసుకుని పాన్ ఇండియా వైడ్ గా స‌త్తా చాటాల‌నుకున్న మ‌న టాలీవుడ్‌ మేక‌ర్స్ కి ఈ మ‌ధ్య బ్యాక్ టు బ్యాక్ గ‌ట్టి ఎదురుదెబ్బ‌లు త‌గిలాయి. పేరుకు తెలుగు సినిమాలే అయినా ఎంచుకున్న నేప‌థ్యం.. ఉత్త‌రాది వారికి కనెక్ట్ కావాల‌న్న తాప‌త్ర‌యం మాత్ర‌మే క‌నిపించింది. అయితే మ‌న వాళ్లు ఎంత‌గా ఉత్త‌రాది వారిని ప్ర‌స‌న్నం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నించారో అంత‌గా అది బెడిసి కొట్టింది. భారీ డిజాస్ట‌ర్ ల‌ని అందించింది.

వివ‌రాల్లోకి వెళితే.. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ 'బాహుబ‌లి' త‌రువాత త‌న‌కు ఉత్త‌రాదిలో భారీగా క్రేజ్ పెర‌గ‌డంతో సౌత్ కంటే నార్త్ ఆడియ‌న్స్ ని ప్ర‌ధాన టార్గెట్ గా చేసుకుని దాదాపు 350 కోట్ల భారీ బ‌డ్జెట్ తో 'రాధేశ్యామ్‌' మూవీని చేశారు. ఆధునిక టైటానిక్ అంటూ ప్ర‌చారం చేసిన ఈ మూవీ ఏ విష‌యంలోనూ నార్త్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని సైతం ఆక‌ట్టుకోలేక‌పోవ‌డంతో భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ప్ర‌భాస్ కెరీర్ లోనే అత్యంత భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది.

మేక‌ర్స్ కి భారీ స్థాయిలో న‌ష్టాల‌ని మిగిల్చింది. ఇక ఇదే ఫార్ములాని అనుస‌రిస్తూ రీసెంట్ గా రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'లైగ‌ర్‌' మూవీ విడుద‌లైంది. పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన ఈ మూవీ నేప‌థ్యం, ఫ్లేవ‌ర్ మొత్తం బాలీవుడ్ సినిమాల‌ని అనుస‌రించిన‌ట్టుగా ప్లాన్ చేశారు. హిందీ ప్రేక్ష‌కుల‌నే ప్ర‌ధాన టార్గెట్ గా చేసుకుని టెక్నీషియ‌న్స్‌, మ్యూజిక్‌..కీల‌క న‌టీన‌టులు.. ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ బాలీవుడ్ కు ప్ర‌ధాన పాత్ర ఇచ్చారు.

ఇదే బెడిసి కొట్టింది. సినిమాలో క‌థ‌, క‌థ‌నాలు లేక‌పోవ‌డం.. పూర్తిగా ఉత్త‌రాది వాస‌న వుండ‌టంతో తెలుగు ప్రేక్ష‌కులు ఓన్ చేసుకోలేక‌పోతున్నారు. దీంతో ఈ మూవీ రీసెంట్ గా విడుద‌లైన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ స్థాయిలో అటు ఉత్త‌రాది వారిని, ఇటు ద‌క్షిణాది ప్రేక్ష‌కుల్ని నిరాశ‌కు గురిచేసింది. అల్లు అర్జున్ న‌టించిన పుష్ప‌, యంగ్ హీరో నిఖిల్ న‌టించిన 'కార్తికేయ 2' సినిమాల‌ని చూసైనా మ‌న వాళ్లు నేర్చుకోవ‌డం లేద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

ఈ రెండు సినిమాల‌ని బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ఉద్దేశించి తీయ‌లేదు. అలాగ‌ని ఉత్త‌రాదికే అధిక ప్రాధాన్య‌త నిస్తూ అక్క‌డికి వెళ్లి ప్ర‌మోష‌న్స్ అంత‌క‌న్నా చేయ‌లేదు. కానీ ఈ రెండు సినిమాల‌కు అక్క‌డి ప్రేక్ష‌కుల కేవ‌లం మౌత్ టాక్ తో బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించారు.

'కార్తికేయ 2' కు క‌నీసం థియేట‌ర్లు కూడా ప్రారంభంలో ల‌భించ‌లేదు. కానీ మౌత్ టాక్ స్ప్రెడ్ కావ‌డంతో ప్ర‌స్తుతం ఉత్త‌రాదిలో ఈ మూవీకి భారీ స్థాయిలో థియేట‌ర్లు పెరిగాయి. సినిమా ఊహించ‌ని విధంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ విజ‌య‌వంతంగా ముందుకు సాగుతోంది. ఈ రెండు సినిమాల‌ని చూసైనా మ‌న మేక‌ర్స్ ఆలోచ‌నా విధానం మారుతుంద‌ని ఆశిద్దాం అని స‌గ‌టు ప్రేక్ష‌కులు కామెంట్ చేస్తున్నారు.