Begin typing your search above and press return to search.

దసరాకు వచ్చి దీపావళికి కూడా కంటిన్యూ!

By:  Tupaki Desk   |   4 Nov 2021 4:12 AM GMT
దసరాకు వచ్చి దీపావళికి కూడా కంటిన్యూ!
X
కరోనా నేపథ్యంలో గత ఏడాది నుండి సినిమాల విడుదల గగనం అయ్యింది. గత నెల రోజుల నుండి కాస్త హడావుడి కనిపిస్తుంది కాని ఏడాదిన్నర పాటు దేశం మొత్తం కూడా సినిమా పరిశ్రమ అలా సైలెంట్ గా ఉండి పోయింది. దసరా సందర్బంగా సౌత్ లో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అయ్యాయి. తెలుగు సినిమాల్లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ పర్వాలేదు అనిపిస్తే తమిళంలో డాక్టర్ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ఆ సినిమా పై విడుదల సమయంలో జనాల్లో పెద్దగా అంచనాలు కాని ఆసక్తి కాని లేవు. కాని ఎప్పుడైతే ఆ సినిమా విడుదల అయ్యిందో అప్పటి నుండి తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఆ సినిమాకు సంబంధించిన హడావుడి కనిపిస్తుంది. సెకండ్ వేవ్‌ తర్వాత అత్యధిక వసూళ్లు దక్కించుకున్న ఇండియన్ మూవీగా ఇప్పటికే డాక్టర్‌ సినిమా ఘనత దక్కించుకుంది.

ఈమద్య కాలంలో సినిమాలు ఎంత పాజిటివ్ టాక్ దక్కించుకున్నా సక్సెస్ టాక్ దక్కించుకున్నా కూడా రెండు మూడు వారాలను మించి ఆడటం కష్టం అయ్యింది. కాని ఈ తమిళ సినిమా డాక్టర్‌ మాత్రం దసరాకు ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ వసూళ్లు దక్కించుకుంటుంది. డాక్టర్‌ ను విడుదల అయిన రెండు మూడు వారాల్లో ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి నిర్మాతలు మొదట వచ్చారు. కాని సినిమా వసూళ్లు కంటిన్యూస్‌ గా వస్తూనే ఉన్నాయి. సినిమా కు వస్తున్న ఆధరణ నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్‌ ను వాయిదా వేస్తూ వచ్చారు. దసరాకు విడుదల అయిన డాక్టర్ సినిమా ను ఇంకా జనాలు థియేటర్లలో చూస్తూనే ఉన్నారు. దీపావళి వచ్చేసింది.. ఈ సందర్బంగా కూడా డాక్టర్ సినిమాకు తమిళనాట హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్ నమోదు అవుతున్నట్లుగా అక్కడ ట్రేడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఈమద్య కాలంలో ఒక సినిమా ఇన్ని రోజులు భారీ వసూళ్లను నమోదు చేయడం అంటే మామూలు విషయం కాదు. తమిళంతో పాటు తెలుగు మరియు మలయాళంలో కూడా ఈ సినిమా భారీగా వసూళ్లను రాబట్టింది. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను దక్కించుకుంటూ దూసుకు పోతుంది. ఈ సినిమా 50 కోట్లు వసూళ్లు చేస్తే చాలా గొప్ప విషయంగా అంతా భావించారు. కాని ఏకంగా వంద కోట్ల మార్క్‌ ను క్రాస్‌ చేసింది. అన్ని భాషల్లో కలిపి డాక్టర్‌ దక్కించుకున్న వసూళ్లు కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత రికార్డుగా నిలిచాయి. ఓవర్సీస్‌ లో కూడా ఈ సినిమాకు మంచి ఆధరణ లభించింది. మొత్తంగా సినిమా బాగుంటే కరోనా కాదు ఇంకా ఏం వచ్చినా కూడా కలెక్షన్స్ ను అడ్డుకోలేవు అని డాక్టర్ నిరూపించాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.