Begin typing your search above and press return to search.

నెం.1 హీరో అనిపించుకోవాలనే బన్నీ చిరకాల కోరిక నెరవేరినట్లేనా..?

By:  Tupaki Desk   |   12 Jan 2022 12:30 PM GMT
నెం.1 హీరో అనిపించుకోవాలనే బన్నీ చిరకాల కోరిక నెరవేరినట్లేనా..?
X
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు అల్లు అర్జున్. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా, మెగా ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం వెనుక బన్నీ కష్టం ఎంతో ఉంది. 'గంగోత్రి' చిత్రంతో హీరోగా తొలి అడుగే విజయవంతంగా వేసిన అల్లు వారబ్బాయి.. సినిమా సినిమాకి నటన పరంగా ఇంప్రూవ్ అవడమే కాదు.. స్టైలింగ్ లోనూ స్పెషల్ అనిపించుకున్నారు. ఈ క్రమంలోనే స్టయిలిష్ స్టార్ నుంచి ఇప్పటి ఐకాన్ స్టార్ గా పిలవబడుతున్నారు.

అల్లు అర్జున్ కేవలం తెలుగులోనే కాకుండా, తన సినిమాలతో పొరుగు ఇండస్ట్రీల్లోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. 'ఆర్య' నుంచి ప్రతీ చిత్రాన్ని ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేస్తూ మార్కెట్ విస్తరించుకున్నారు. ముఖ్యంగా మలయాళంలో బన్నీకి అక్కడి స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని ఇమేజ్ ఏర్పడింది. తమిళంలోనూ ఆయన సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బన్నీ పాన్ ఇండియా వైడ్ మార్కెట్ మీద దృష్టి సారించారు.

గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో మంచి ఫార్మ్ లో ఉన్న అల్లు అర్జున్.. 2020 ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురములో' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసింది. ఈ క్రమంలో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తన క్రేజ్ ను మరింత పెంచుకునేలా కథలు ఎంపిక చేసుకున్న బన్నీ.. 'పుష్ప' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు.

అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' చిత్రాన్ని రెండు భాగాలుగా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. 'పుష్ప: ది రైజ్' డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. టాక్ తో సంబంధం లేకుండా రిలీజైన అన్ని భాషల్లోనూ సత్తా చాటింది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ లో ఈ సినిమా ప్రభంజనం సృష్టించింది.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన హిందీ వెర్సన్.. ఇప్పటి వరకు 81 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ అనే ఊర మాస్ డీ గ్లామర్ పాత్రలో అల్లు అర్జున్ అద్భుతమైన పెరఫార్మెన్స్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో 2021లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా 'పుష్ప: ది రైజ్' రికార్డ్ క్రియేట్ చేసింది. అలానే రెండో భాగం 'పుష్ప: ది రూల్' మీద అంచనాలు రెట్టింపు చేసింది.

ఎలాగైతేనేం 'అల వైకుంఠపురములో' 'పుష్ప' పార్ట్-1 చిత్రాలతో బన్నీ బాక్సాఫీస్ వద్ద రెండు బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి నంబర్ వన్ అనిపించుకోవాలనే తన చిరకాల కోరికను అల్లు అర్జున్ తీర్చుకున్నాడని అనుకోవాలి.

అయితే బన్నీ సక్సెస్ కు కరోనా మహమ్మారి కూడా కూసింత కాదు.. బాగానే సహాయం చేసింది. వివిధ దేశాల్లో అప్పటికే వైరస్ ప్రభావం మొదలవ్వగా.. ఇండియాలో మాత్రం 'అల వైకుంఠపురంలో' లాంగ్ రన్ పూర్తైన తర్వాతే ఎంటర్ అయింది. అందుకే కోవిడ్ ఎఫెక్ట్ ఈ సినిమా మీద ఏమాత్రం పడలేదు. ఇక 'పుష్ప' సినిమా మొదటి భాగానికి కూడా వైరస్ సహకారం లభించింది.

బన్నీ సినిమా రిలీజ్ సమయానికి కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గడమే కాకుండా.. ఆల్మోస్ట్ అన్ని ఏరియాలలో మంచి కలెక్షన్స్ సాధించిన తర్వాత థర్డ్ వేవ్ ప్రభావం వచ్చింది. అలానే పాండమిక్ నేపథ్యంలో గత రెండేళ్లలో మిగతా స్టార్ హీరోల సినిమాలు విడుదలవ్వకపోవడం అల్లు అర్జున్ కు కలిసొచ్చింది. ఏదైతేనేం 'పుష్ప' సక్సెస్ తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించారని చెప్పవచ్చు.