Begin typing your search above and press return to search.

ఓటీటీల‌పై థియేట‌ర్ల య‌జ‌మాని అలా అన‌డం స‌మంజ‌స‌మా?

By:  Tupaki Desk   |   14 July 2021 6:49 AM GMT
ఓటీటీల‌పై థియేట‌ర్ల య‌జ‌మాని అలా అన‌డం స‌మంజ‌స‌మా?
X
రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారీ అంతా మార్చేసింది. అన్ని రంగాల కంటే సినిమా రంగం దీనివ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోయింది. ఈ రంగంపై ఆధార‌ప‌డిన ల‌క్ష‌లాది మంది జీవ‌నోపాధిని కోల్పోవాల్సి వ‌చ్చింది. ఈ క్రైసిస్ నుంచి నెమ్మ‌దిగా బ‌య‌ట‌ప‌డాలంటే తిరిగి య‌థావిధిగా కార్య‌క‌లాపాలు కొన‌సాగాలి. థియేట‌ర్ల‌లో వెంట‌నే బొమ్మ ప‌డాలి. బ్లాక్ బ‌స్ట‌ర్లు అవ్వాలి.

కానీ క్రైసిస్ కి భ‌య‌ప‌డి చాలామంది నిర్మాత‌లు త‌మ సినిమాల్ని ఓటీటీ రిలీజ్ ల‌కు అమ్మేసుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు త‌మ సినిమాల‌ను ఓటీటీల‌కే విక్ర‌యించడంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అలాగే థియేట‌ర్ య‌జ‌మానుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఇప్ప‌టికే ఓటీటీ రిలీజ్ కుద‌ర‌ద‌ని థియేట‌ర్ల‌లోనే సినిమాలు రిలీజ్ చేయాల‌ని నిర్మాత‌ల‌కు హెచ్చ‌రిక‌లు జారీ చేసినా వాటిని భేఖాత‌రు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అక్టోబ‌ర్ త‌ర్వాతే ఓటీటీల‌కు త‌మ సినిమాల‌ను విక్ర‌యించాల‌ని తెలంగాణ ఛాంబ‌ర్ కోరింది.

కానీ దానిని కొంద‌రు నిర్మాత‌లు ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా థియేట‌ర్ల‌ను కలిగి ఉన్న డి.సురేష్ బాబు త‌న సినిమాల‌ను థియేట‌ర్ల‌లో కాకుండా ఓటీటీల్లో రిలీజ్ చేయ‌డంపై ఒక సెక్ష‌న్ విమ‌ర్శిస్తోంది. దీనిపై నెటిజ‌నుల్లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వెంక‌టేష్ న‌టించిన‌ `నారప్ప` సినిమాను జులై 20న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలవుతోంది. ఈ నేప‌థ్యంలో సామాజిక మాధ్య‌మాల్లో దీనిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో డి.సురేష్ బాబు నిర్మాత‌ల త‌ర‌పున త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. కోట్లు ఖ‌ర్చు చేసి సినిమా తీసే నిర్మాత ఎక్క‌డ రిలీజ్ చేయాల‌న్నా స‌ర్వ‌హ‌క్కుల‌ను క‌లిగి ఉన్నార‌ని త‌న సినిమాల్ని తాను ఏ ఫార్మాట్ లో అయినా రిలీజ్ చేసుకోగ‌ల‌న‌ని డి.సురేష్ బాబు అన్నారు. ఈ బిజినెస్ లో త‌ప్పు ఒప్పుల‌ను చూడ‌టం స‌రికాద‌ని అన్నారు. కరోనా సమయంలో థియేటర్స్ యాజమాన్యమే కాదు నిర్మాతలు కూడా చాలా నష్టపోయారని సురేష్ బాబు అన్నారు. మంచి ధ‌ర ప‌లికిన‌ప్పుడు పోటీ అన్న‌దే లేని ఓటీటీలో రిలీజ్ చేస్తే త‌ప్పేమీ కాద‌ని సురేష్ బాబు త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు. ఇప్పుడున్న క్రైసిస్ లో థియేట్రిక‌ల్ రిలీజ్ కంటే కాంపిటీష‌న్ లేని ఓటీటీ రిలీజ్ స‌రైన‌దేన‌ని అన్నారు.

బిజినెస్ అన్న కోణంలో సురేష్ బాబు చెప్పేది కొంత‌వ‌ర‌కూ స‌మంజస‌మే క‌దా అనేవారు లేక‌పోలేదు. ఎందుకంటే ఆయ‌న కూడా థియేట‌ర్లు ఉన్న అగ్ర నిర్మాత‌. తెలుగు రాష్ట్రాల్లో ఇత‌ర ఎగ్జిబిట‌ర్ల‌కు ధీటుగా భారీగా థియేట‌ర్ల‌ను క‌లిగి ఉన్నారు. మ‌ల్టీప్లెక్స్ స్క్రీన్ల‌ను ఆయ‌న నిర్వ‌హిస్తున్నారు. ఆయ‌నా ఎగ్జిబిట‌ర్ గా క‌ష్ట‌న‌ష్టాల‌ను చ‌విచూశారు. ఒక అనుభ‌వ‌జ్ఞుడిగా బిజినెస్ అనే కోణంలో ఆయ‌న చెప్పేది స‌రైన‌దేన‌నే అభిప్రాయం వ్య‌క్తమవుతోంది. నిర్మాత కోణంలో కొంద‌రు ఆయ‌న‌కు మ‌ద్ధ‌తునిస్తున్నారు.

నారప్ప ఓటీటీ రిలీజ్ త‌ర్వాతా సురేష్ బాబు కాంపౌండ్ నుంచి విరాట‌ప‌ర్వం ఓటీటీలో రిలీజ‌వుతుంద‌ని క‌థ‌నాలొచ్చాయి. అలాగే వెంకీ న‌టించిన దృశ్యం 2 కూడా ఓటీటీకే విక్ర‌యించార‌ని గుసగుస‌లు వినిపించాయి. కానీ వాటిపై సురేష్ బాబు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.