Begin typing your search above and press return to search.

కీర్తి కిరీటంలో ఆ ఘ‌న‌కీర్తి వెన‌క‌

By:  Tupaki Desk   |   10 Aug 2019 8:23 AM GMT
కీర్తి కిరీటంలో ఆ ఘ‌న‌కీర్తి వెన‌క‌
X
ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు? రానే వ‌చ్చింది ఆ శుభ‌త‌రుణం! మ‌న‌కు కూడా జాతీయ అవార్డులు వ‌స్తాయా? అని పెద‌వి విరిచేసే వాళ్లే అవాక్క‌య్యేలా .. టాలీవుడ్ ఏకంగా ఏడు జాతీయ పుర‌స్కారాల్ని కొల్ల‌గొట్టి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మ‌న ప‌రిశ్ర‌మ‌లో వ‌చ్చిన అనూహ్య మార్పున‌కు అంతా నోరెళ్ల‌బెడుతున్నారు. క‌థ‌లు మారాయి.. టెక్నికాలిటీస్ అమాంతం హాలీవుడ్ స్టాండార్డ్స్ ని ట‌చ్ చేస్తున్నాయి. కొత్త‌త‌రం కొత్త జోన‌ర్ సినిమాలు తీస్తూ అద‌ర‌గొడుతున్నారు. అందుకే జాతీయ అవార్డు మ‌న ఇంటి త‌లుపు త‌ట్టింది.

2018 లో రిలీజైన వాటిలో అంతా ఊహించిన‌ట్టే `మ‌హాన‌టి` టైటిల్ పాత్ర‌ధారి కీర్తి సురేష్ కి ఉత్త‌మ న‌టి (తెలుగు) పుర‌స్కారం ద‌క్కింది. మ‌హాన‌టి చిత్రానికి మ‌రో రెండు కేట‌గిరీల్లో పుర‌స్కారాలు ద‌క్క‌డం ఉత్సాహం నింపింది. దీంతో పాటే రంగ‌స్థ‌లం చిత్రానికి ఆడియోగ్ర‌ఫీ విభాగంలో అవార్డు ద‌క్క‌డం ల‌క్కీ. ఇత‌ర రెండు చిన్న సినిమాలు పేరు తెచ్చాయి. అదంతా అటుంచితే.. `ఉత్త‌మ న‌టి`గా పుర‌స్కారం ద‌క్కించుకున్న కీర్త సురేష్ కంటే ముందు ఉత్త‌మ న‌టీమ‌ణులు ఇంకెవ‌రూ లేరా? అంటే..

కీర్తి కంటే ముందు తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో `జాతీయ ఉత్త‌మ న‌టి` అవార్డ్ అందుకున్న వారిలో ఓ నాలుగు పేర్లు క‌నిపిస్తున్నాయి. 1990లో `క‌ర్త‌వ్యం` సినిమాలో న‌ట‌న‌కు గానూ విజ‌య‌శాంతికి జాతీయ ఉత్త‌మ న‌టి అవార్డు ద‌క్కింది. ఆ చిత్రంలో సిన్సియ‌ర్ పోలీస్ అధికారిగా విజ‌య‌శాంతి న‌ట‌న స్ఫూర్తివంతం. ఏ.మోహ‌న్ గాంధీ ఆ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా .. ప‌రుచూరి సోద‌రులు మాట‌లు అందించారు. అలాగే 1978లో రిలీజైన‌ `నిమ‌జ్జ‌నం` అనే సినిమాలో న‌ట‌న‌కు గాను ఊర్వ‌శి శార‌దకు ఉత్త‌మ న‌టి పుర‌స్కారం ద‌క్కింది. ఆ త‌ర్వాత 1988లో `దాసి` అనే చిత్రంలో న‌ట‌న‌కు గాను అర్చ‌న‌కు ఉత్త‌మ న‌టిగా పుర‌స్కారం ల‌భించింది. విజ‌య‌శాంతి త‌ర్వాత కీర్తి సురేష్ కి మాత్ర‌మే మ‌ళ్లీ ఆ అవ‌కాశం.. అదృష్టం ద‌క్కాయి. `క‌ర్త‌వ్యం` రిలీజైన త‌ర్వాత‌.. దాదాపు 29 సంవ‌త్స‌రాలకు ఇది సాధ్య‌మైంది. అంత‌కుముందు ఎంద‌రో క‌థానాయిక‌లు గొప్ప ప్ర‌ద‌ర్శ‌న‌తో అల‌రించినా ఎందుక‌నో జాతీయ అవార్డులు అయితే రాలేదు.