Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూ : దొంగాట

By:  Tupaki Desk   |   8 May 2015 12:09 PM GMT
సినిమా రివ్యూ :  దొంగాట
X
రివ్యూ: దొంగాట

రేటింగ్‌: 2.5 /5

తారాగణం: మంచు లక్ష్మి, అడవి శేష్‌, బ్రహ్మానందం, మధునందన్‌, ప్రగతి, ప్రభాస్‌ శీను, జయప్రకాష్‌ రెడ్డి, గిరిబాబు, ప్రభాకర్‌ తదితరులు

సంగీతం: సత్యమహవీర్‌, రఘుకుంచె, సాయికార్తిక్‌

స్క్రీన్‌ప్లే: ఎన్‌.వంశీకృష్ణ, మోహన్‌ భరద్వాజ్‌

నిర్మాత: మంచు లక్ష్మి

కథ, దర్శకత్వం: ఎన్‌.వంశీకృష్ణ



ఈ సినిమాకు రామ్‌ గోపాల్‌వర్మ దర్శకత్వం వహించాల్సింది... అయితే ఆయన బిజీగా ఉండి కాదన్నాడు అంటూ సినిమాపై ఒక టైప్‌ అంచనాలు ఏర్పరిచింది మంచులక్ష్మి. మరి వర్మఫామ్‌లో ఉన్నప్పుడు తీసిన సినిమాలా ఉంటుందేమో అనే అంచనాలతో ఈ సినిమాకు వెళ్లిన వారికి తీరా ఎస్వీ కృష్ణారెడ్డి స్టైల్‌ సినిమాను చూపించి సెంటిమెంట్‌తో పిండేసే యత్నం చేశారు! ఒకవేళ వర్మ ఈ సినిమాకు ఇదే స్క్రీన్‌ప్లేతో దర్శకత్వం వహించి ఉంటే.. ఇది ఆయన తీసిన గొప్ప సెంటిమెంటల్‌ సినిమా అయ్యేది. 'దొంగాట' అంటూ కన్నింగ్‌ కథాంశానికి ఎక్స్‌ప్రెషన్‌లా ఉన్న టైటిల్‌తో మ్యాజిక్‌ చేస్తారు అనుకొంటే.. మెలోడ్రామా ఎక్కువచూపించి మరోరకంగా దొంగాట ఆడారు. మరి ఈ ఆట పూర్తిగా నచ్చుతుందా అంటే.. మధ్యలోమనతో ఆడుకోవడాన్ని కూడా భరించాల్సి ఉంటుందని చెప్పాలి.

కథ:

శృతి(మంచులక్ష్మి) టాలీవుడ్‌లోని ప్రముఖ యాక్షన్‌ హీరోయిన్‌. ఆమెను కిడ్నాప్‌ చేసి పది కోట్ల రూపాయలను డిమాండ్‌ చేసే ఎత్తును వేస్తారు వెంకట్‌(అడవి శేష్‌), విజ్జి(మధునందన్‌) కాటంరాజ్‌(ప్రభాకర్‌-మర్యాదరామన్న ఫేమ్‌). అనుకొన్నట్టుగా ఆమెను కిడ్నాప్‌ చేసి ఖాళీగా ఉన్న విజ్జిబాస్‌(బ్రహ్మానందం) ఫ్లాట్‌కు తరలిస్తారు. హీరోయిన్‌ కిడ్నాప్‌ అయ్యిందంటే అనవసరమైన వివాదాలు వస్తాయని శృతి తల్లి(ప్రగతి) పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ప్రైవేట్‌ డిటెక్టివ్‌ను ఆశ్రయిస్తుంది. ఆ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ ఎవరో కాదు.. విజ్జిబాస్‌ బ్రహ్మీనే రంగంలోకి దిగుతాడు. హీరోయిన్‌ను తన ఫ్లాట్‌లోనే చూసి షాక్‌ అయిన బ్రహ్మీ అనుకోని పరిస్థితుల మధ్య ఈ కిడ్నాపింగ్‌ వ్యవహారాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోతాడు. ఇంతలో పోలీసులు రంగంలోకి దిగుతారు. అక్కడ నుంచి హీరోయిన్‌ కిడ్నాప్‌ చేసిన ముగ్గురు ఎలా తప్పించుకొన్నారు. తాము అనుకొన్న పది కోట్ల రూపాయలను ఎలా సంపాదించారు. అసలు హీరోయిన్‌ కిడ్నాపింగ్‌ వెనుక అసలు కథ ఏమిటి? దాని వెనుక ఎవరున్నారు. వారి వ్యూహాలు ఏమిటి? అనేవి ట్విస్టులు. ఈ ట్విస్టులన్నీ చివరకు ఏ తీరానికి చేరాయి... అనేది మిగతా కథ.

కథనం:

ఒకటి కాదు రెండు కాదు.. లెక్కలేనన్ని ట్విస్టులు. కిడ్నాప్‌ తో ముడిపడిన కామెడీడ్రామా అనుకొంటే... ఒక్కొక్కటిగా వచ్చే మలుపులు ఆసక్తికరంగా ఉంటాయి. ఇంటర్వెల్‌ నుంచే ట్విస్టులు ఇవ్వడం మొదలవుతుంది. సినిమాపై ఆసక్తి జనరేట్‌ అవుతుంది. అయితే ఆ తర్వాత అనవసరమైన వచ్చే డ్రామా... సెంటిమెంట్లు మాత్రం విసుగును తెప్పిస్తాయి. అనాథాశ్రమం బిల్డింగ్‌ను రక్షించుకోవడం కోసం హీరోలు కిడ్నాప్‌లకు తెగబడే కాన్సెప్టులు తెలుగు వాళ్లకు కొత్త కాదు.

అలాగే అనాథలుగా అందరి నిరాదరణకు గురైన హీరోహీరోయిన్ల నేపథ్యం.. అనాథశ్రమంలోని వ్యక్తుల కథలను ఎందుకు స్క్రిప్ట్‌లో నెత్తికెత్తుకొన్నారో అర్థం కాదు! చక్కటి స్క్రిప్ట్‌ను రాసుకొన్నారు.సూటిగా దాన్ని ఫాలో అయిపోయి ఉంటే.. దొంగాట అన్న కాన్సెప్ట్‌కు జస్టిఫికేషన్‌ జరిగేది. అయితే ఎలాగూ మోసం చేయదలుచుకొన్న మెయిన్‌ క్యారెక్టర్‌తో ఎందుకు అంత డ్రామా పండించే ప్రయత్నం చేశారో! అంత వరకూ ఆ పాత్రను ఒకతీరుగా చూపించి క్లైమాక్స్‌లో గొప్ప ట్విస్టు ఇచ్చి ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాం అని రచయితలు అనుకొన్నారేమోకానీ.. ఈ ప్రయత్నంలో జనాలకు బోర్‌ కొట్టిస్తున్నామని వారు గ్రహించలేకపోయినట్టున్నారు. ట్విస్టులతో ట్రిమ్‌ చేసుకొని ధనాధన్‌ అన్నట్టుగా సాగిపోవాల్సిన కథనానికి డ్రామాను జోడించడం బ్లండరే అని చెప్పాలి. ట్రిమ్‌ చేసుకోవడానికి ఎంతో ఉంది. బహుశా సినిమాను ఎంత లెంగ్తీగా తీస్తే అంత మేలని దర్శకుడు భావించాడు కాబోలు. క్రియేటర్‌కు తను సృష్టించిన దానిపై ప్రేమ ఉండటం సహజమే.. అయితే ఎక్కడ కత్తిరించాలో అక్కడ కత్తిరించక.. ప్రతి రీల్‌పైనా ప్రేమను పెంచుకొంటే ఆ సృజనేకే అర్థం లేకుండా పోతుంది. దొంగాట విషయంలో దాదాపు ఇదే జరిగింది.

వేగంగా పరిగెత్తడంప్రారంభించి... కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌తో ఆకట్టుకొనేలా కథనాన్ని లాగించి.. ప్రేక్షకుడిలో ఆసక్తిని జనరేట్‌ చేసి.. అనవసరమైన డ్రామా వైపు వెళ్లి... సెంటిమెంట్‌ను పండించబోయే ప్రయత్నం చేశారు. తన ఇంట్లోనే, తనవాళ్లే హీరోయిన్‌ను బంధించారనే విషయాన్ని గ్రహించలేని ప్రైవేట్‌ డిటెక్టివ్‌గా బ్రహ్మీ కనిపించే తరహా సీన్లను డిజైన్‌ చేసుకోవడం దర్శకుడి ప్రతిభ కనిపిస్తుంది. అయితే ఆ టెంపోను కంటిన్యూ చేయలేకపోవడం మాత్రం ఫెయిల్యూరే. అదే సినిమాకు డ్రా బ్యాక్‌.

నటీనటులు:

ఈ సినిమాకు తనే ప్రొడ్యూసర్‌గా మారడంతో పాటు.. ఈ పాత్రను పండించిన విషయంలో కూడా మంచులక్ష్మిని అభినందించవచ్చు. అవకాశం ఇస్తే ఇలాంటి సినిమాలను చేయగల నటీమణులు ఉంటారేమో కానీ.. నిర్మాతగా మారి ఖర్చు పెట్టుకొనే ధైర్యం లక్ష్మికే కనిపిస్తోంది. మంచివాడిలా కనిపించే కన్నింగ్‌ క్యారెక్టర్‌కు అడవిశేష్‌ రూపం.. అతడి నటన సెట్‌ అయ్యింది. ఇక మ్యాన్‌ ఆన్‌ ఫైర్‌ అంటూ బఫూన్‌ అయ్యే క్యారెక్టర్‌ బ్రహ్మీకి కొత్త కాదు. ఆయన సహజంగానే దీన్ని లీడ్‌ చేశాడు. థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వి, మధునందన్‌, మర్యాదరామన్న ఫేమ్‌ ప్రభాకర్‌, ప్రగతి తదితరులకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కాయి. వాటికి వారందరూ తమ సహజశైలిలో న్యాయం చేశారు.

సాంకేతిక వర్గం:

ఇద్దరు కుర్రాళ్లు ఒక పేరున్న లేడీని కిడ్నాప్‌ చేసి డబ్బు సంపాదించుకోవాలనే కథాంశాన్ని వింటేనే 'మనీ' సినిమా గుర్తుకురాకమానదు. తొలి సగం వరకూ కథను మనీ రీతిలోనే నడిపిస్తున్నాడేమో అనిపించినా వంశీకృష్ణ ఆ తర్వాత కథను డిఫరెంట్‌గానే తీసుకెళ్లాడు. ఈ రకంగా అతడు ఓకే. అయితే అనాథలపై... ఆదరణలేని వృద్ధులపై తన సినిమా ద్వారా ప్రేమను వ్యక్తబరిచే ప్రయత్నం చేయబోయి రూట్‌ తప్పాడు.

ఇక సినిమాను ఇంత లెంగ్తీగా తయారు చేయడమే ఈ టీమ్‌ చేసిన పెద్దపొరపాటు. ట్రిమ్‌ చేసుకోవడం మొదలు పెడితే అరగంట సేపు వ్యవధిని తగ్గించుకోగల వృథా కంటెంట్‌ ఉంది! అలాంటి వ్యర్థాన్ని తెరకెక్కించడానికి వారు బడ్జెట్‌ను వృథా చేసుకోవడమే గాక.. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకుల సమయాన్ని కూడా వృథా చేశారు. ఇక నిర్మాణ విలువల పరంగా సినిమాను క్రిటిసైజ్‌ చేయడానికేం లేదు. పాటలే అనవసరమైన సబ్జెక్టులో నీతులు చెప్పే రెండు పాటలను పెట్టి విసుగును రెట్టింపు చేశారు కాబట్టి సంగీత కారుల గురించి మాట్లాడుకోవడం అనవసరం.

చివరిగా...

దొంగాట.. ఎంత సేపు ఆడాలో.. ఎలా ఆడాలో.. గ్రహించలేకపోయారు. ఆడిన తీరుతో కొంతవరకే ఆకట్టుకొన్నారు!