Begin typing your search above and press return to search.

'డీజే టిల్లు' రొమాన్స్ చూసి అలా అనుకోవద్దట!

By:  Tupaki Desk   |   8 Feb 2022 9:37 AM GMT
డీజే టిల్లు రొమాన్స్ చూసి అలా అనుకోవద్దట!
X
ఈ నెలలో .. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న సినిమాల్లో 'డీజే టిల్లు' ఒకటి. సిద్ధు జొన్నలగడ్డ - నేహా శెట్టి జంటగా నటించిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేస్తున్నారు. సితార బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అటు సోషల్ మీడియాలోను .. ఇటు బయట కూడా ఈ సినిమా ప్రమోషన్స్ వేగం పెంచారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా దర్శకుడు విమల్ కృష్ణ మాట్లాడాడు.

"నేను షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఈ వైపుకు వచ్చాను. మధ్యలో కొన్ని సినిమాలలో నటించాను కూడా. అయితే మొదటి నుంచి కూడా డైరెక్షన్ పైనే దృష్టి ఉండేది. అందువలన దర్శకత్వంపైనే పూర్తి దృష్టి పెట్టేసి .. ఆ దిశగానే ముందుకు వెళ్లాలని అనుకున్నాను. అప్పటి నుంచి కథలను తయారు చేసుకునే పనిలో పడ్డాను. మూడు .. నాలుగు కథలను సిద్ధం చేసుకున్నాను. అయితే ఒక దర్శకుడిగా ముందుగా యూత్ కి చేరువ కావాలనే ఉద్దేశంతో, 'డీజే టిల్లు' చేయాలని నిర్ణయించుకున్నాను.

సిద్ధు జొన్నలగడ్డతో నాకు పదేళ్లుగా మంచి పరిచయం ఉంది. ఆయన అయితే ఈ పాత్రకి కరెక్టుగా సెట్ అవుతాడని అనిపించింది. ఈ కథను గురించి ఆయనకి చెప్పగానే సూపర్ గా ఉందనేశాడు. స్క్రిప్ట్ విషయంలో త్రివిక్రమ్ గారి సలహాలు .. సూచనలు తీసుకుంటూ ముందుకు వెళ్లాము. ఈ కథకి సిద్ధూనే సంభాషణలు రాశాడు. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలిన తరువాత, ఇది రొమాంటిక్ సినిమా అని అంతా అనుకుంటున్నారు .. కానీ అది నిజం కాదు. రొమాన్స్ అనేది సందర్భాన్ని బట్టే తెరపై కనిపిస్తుంది కానీ .. కథ అంతా కూడా రొమాన్స్ ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను హాయిగా చూడవచ్చు.

సితార బ్యానర్ కి మంచి పేరు ఉంది .. ఈ బ్యానర్ పై ఇంతవరకూ వచ్చిన సినిమాలలో విజయవంతమైనవే ఎక్కువ. అన్ని సినిమాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగినవే. దీనిని బట్టి ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగినదే అనే విషయం అర్థమైపోతూనే ఉంది. ఈ సినిమా విడుదలైన తరువాత టీమ్ లోని వాళ్లందరికీ మంచి పేరు వస్తుంది. ట్రైలర్ బయటికి రాగానే ఇతర బ్యానర్ల నుంచి నాకు కాల్స్ వచ్చాయి. తరువాత ఏ సినిమా చేయనున్నది త్వరలో చెబుతాను" అన్నాడు. 'ఖిలాడి' సినిమా మరుసటి రోజునే వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో చూడాలి