Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'దొరసాని'

By:  Tupaki Desk   |   12 July 2019 9:14 AM GMT
మూవీ రివ్యూ: దొరసాని
X
చిత్రం: 'దొరసాని'

నటీనటులు: ఆనంద్ దేవరకొండ - శివాత్మిక - వినయ్ వర్మ - కిషోర్ - శరణ్య - బైరెడ్డి - వంశీకృష్ణారెడ్డి తదితరులు
సంగీతం: ప్రశాంత్ విహారి
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి - యాష్ రంగినేని
రచన - దర్శకత్వం: కేవీఆర్ మహేంద్ర

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్.. రాజశేఖర్ తనయురాలు శివాత్మిక హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా ‘దొరసాని’. కేవీఆర్ మహేంద్ర అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం అందమైన ప్రోమోలతో ప్రేక్షకుల దృష్లిని ఆకర్షించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

నక్సలైట్ శివన్న (కిషోర్) 30 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించి బయటికి వస్తాడు. రాగానే రాజు అనే తన స్నేహితుడి కోసం అతడి ఊరికి వెళ్తాడు. రాజు గురించి అక్కడి వాళ్లను అడిగి.. అతడి కథను గుర్తు చేసుకుంటాడు. రాజు (ఆనంద్ దేవరకొండ) తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఓ పేద కుటుంబానికి చెందిన కుర్రాడు. అతను ఆ ఊరి దొర కూతురు.. అందరూ చిన్న దొరసానిగా పిలుచుకునే దేవకి (శివాత్మిక)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడి పట్ల ఆకర్షితురాలవుతుంది. కానీ ఇరు కుటుంబాల మధ్య ఉన్న అంతరం వల్ల వీరి ప్రేమకు అడ్డంకులు ఎదురవుతాయి. ఈ అడ్డంకుల్ని అధిగమించి వాళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

పెద్దింటి అమ్మాయి.. పేదింటి కుర్రాడు ప్రేమలో పడితే ఎదురయ్యే పర్యవసనాల నేపథ్యంలో నడిచే కథ ‘దొరసాని’. అయితే ఈ కథ ప్రకారం చూస్తే ఇప్పటి నేపథ్యంతో సినిమాను చెబితే ఇందులో ఏ ప్రత్యేకతా కనిపించదు. తెలంగాణ గ్రామాల్లో దొరల పాలన సాగిన 30 ఏళ్ల కిందటి నేపథ్యాన్ని ఈ కథ కోసం ఎంచుకోవడం ‘దొరసాని’ని భిన్నంగా నిలబెడుతుంది. అప్పటి గ్రామీణ పరిస్థితుల్ని - వాతావరణాన్ని చాలా అథెంటిగ్ గా తెరమీదికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు కేవీఆర్ మహేంద్ర. ఇక ప్రేమకథ విషయానికి వస్తే.. అందులో కొత్తదనం ఏమీ కనిపించదు. కథగా చెప్పుకోవడానికి ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. ప్రేమకథ కంటే కూడా అందులోని మూమెంట్స్ ప్రత్యేకంగా అనిపిస్తాయి. నేపథ్యం భిన్నంగా ఉండటం వల్ల కొంచెం కొత్తగా అనిపిస్తుంది తప్ప ‘దొరసాని’ మరీ ప్రత్యేకమైన సినిమా ఏమీ కాదు. ఏ హంగులూ లేకుండా.. స్వచ్ఛంగా ఒక ప్రేమకథను చెప్పాలన్న దర్శకుడి ప్రయత్నం అభినందనీయమే కానీ.. కథలో కొత్తదనం లేకపోవడం.. మరీ నెమ్మదిగా సాగే కథనం ‘దొరసాని’కి ప్రతికూలంగా మారాయి.

మూడు దశాబ్దాల ముందు ఒక జమీందారు కూతురిని ఒక కూలీ కొడుకు ప్రేమిస్తే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యేవో ప్రేక్షకులకు ఒక అంచనా ఉంటుంది. ‘దొరసాని’ కథ ఆ అంచనాలకు భిన్నంగా ఏమీ సాగదు. హీరోను చూడకుండానే అతడి కవితలకు ఫిదా అయిపోయిన హీరోయిన్ అతడిని అభిమానించడం.. తర్వాత ఇద్దరి మధ్య స్నేహం చిగురించి అది ప్రేమగా మారడం.. వీరి ప్రేమ బయటపడ్డాక హీరోయిన్ తండ్రి ఇద్దరినీ వేరు చేసి హీరోను హింసకు గురి చేయడం.. ఇదంతా కూడా చాలా రొటీన్ వ్యవహారం లాగా అనిపిస్తుంది. కథ ఎక్కడా కూడా ప్రేక్షకుల్ని ఎగ్జైట్ చేయదు. కాకపోతే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని మూమెంట్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. దొర కూతురికి దగ్గరయ్యాక కూడా ఆమె మంచి నీళ్లు తెచ్చిస్తే మేం తాగొచ్చా అని హీరో అడగడం.. దానికి ఆమె కదిలిపోయి అతడిని ముద్దాడటం అందులో ఒకటి. ఐతే కేవలం ఇలాంటి కొన్ని మూమెంట్స్ మాత్రమే సినిమాను నిలబెట్టేయవు కదా?

30 ఏళ్ల ముందు కాలానికి వెళ్లి ఓ కథను చెబుతున్నపుడు ప్రేక్షకులు ఏదైనా షాకింగ్ ఫ్యాక్టర్ ఆశిస్తారు. సినిమా చివర్లో అలాంటి షాక్ ఉంటుంది కానీ.. అంతకుముందు వరకు కథాకథనాలు చాలా మామూలుగా సాగిపోతాయి. పాత్రల పరిచయం దగ్గర్నుంచి ప్రతి చోటా దర్శకుడు బాగా సమయం తీసుకున్నాడు. నరేషన్ మరీ డెడ్ స్లోగా ఉండటంతో ప్రేక్షకులకు నీరసం వచ్చేస్తుంది. కళాత్మక దృష్టితో సినిమా చూసేవాళ్లకు ఒకప్పటి తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని - భాషను - యాసను చాలా అథెంటిగ్ గా చెప్పే ప్రయత్నం ఆకట్టుకోవచ్చు. ప్రధాన పాత్రధారుల పెర్ఫామెన్స్ కూడా మెప్పించవచ్చు. సాంకేతిక ఆకర్షణలు కూడా బాగా అనిపించవచ్చు. కానీ సగటు ప్రేక్షకుడికి మాత్రం ‘దొరసాని’లో ఎంగేజ్ చేసే - ఎంటర్ టైన్ చేసే అంశాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. రొటీన్ కథ.. మరీ నెమ్మదిగా సాగే కథనం బోర్ కొట్టిస్తాయి. ‘దొరసాని’ని ఒక మంచి సినిమాగా చెప్పొచ్చు కానీ... ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లయితే ‘దొరసాని’ లేదన్నది వాస్తవం.

నటీనటులు:

‘దొరసాని’ సినిమాకు సంబంధించి అందరూ ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం.. ఆనంద్ దేవరకొండ.. శివాత్మిక ఎలా నటించారనే. వీళ్లిద్దరికీ మంచి మార్కులే పడతాయి. లుక్స్ పరంగా ఇద్దరూ హీరో హీరోయిన్ల స్థాయిలో లేరు. కానీ తమ పాత్రలకు వీళ్లిద్దరూ చక్కగా సరిపోయారు. ఆనంద్.. శివాత్మికల నటన సైతం సహజంగా.. పాత్రలకు తగ్గట్లుగా సాగి మెప్పిస్తుంది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాలో మేజర్ హైలైట్ గా చెప్పొచ్చు. దొర పాత్రలో వినయ్ వర్మ.. నక్సలైట్‌ గా కిషోర్ తమ ప్రత్యేకతను చాటుకున్నారు. హీరో స్నేహితులుగా చేసిన వాళ్లకు కూడా మంచి మార్కులు పడతాయి. ఆర్టిస్టులందరి పెర్ఫామెన్స్ బాగుంది.

సాంకేతిక వర్గం:

‘దొరసాని’ సాంకేతిక నిపుణుల ప్రతిభకు వేదికగా నిలిచింది. ప్రశాంత్ విహారి స్వరపరిచిన ప్రతి పాటా బాగుంది. కళ్లలో కలవరమై అన్నింట్లోకి స్టాండ్ ఔట్‌ గా నిలుస్తుంది. మిగతా పాటలన్నీ కూడా బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయింది. కథకు కీలకమైన సన్నివేశాల్ని ఎలివేట్ చేసింది. సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం కూడా చాలా బాగుంది. కథ నేపథ్యానికి తగ్గ కెమెరా పనితనంతో సినిమాకు ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడు సన్నీ. ఓ చిన్న సినిమా స్థాయికి మించి నిర్మాణ విలువలు కనిపిస్తాయి. మధుర శ్రీధర్ రెడ్డి - యాష్ రంగినేనిల అభిరుచిని మెచ్చుకోవాల్సిందే. ఇక దర్శకుడు కేవీఆర్ మహేంద్ర ఒక స్వచ్ఛమైన ప్రేమకథను సిన్సియర్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. 30 ఏళ్ల కిందటి వాతావరణాన్ని.. మనుషుల్ని.. భాషను.. యాసను తెరమీదికి తీసుకురావడంలో అతడి కృషి అభినందనీయం. అయితే అతనెంత కష్టపడ్డప్పటికీ.. కథలో ఏ కొత్తదనం చూపించలేకపోయాడు. కథను చెప్పడంలో మరీ నెమ్మదిగా సాగే అతడి శైలి ఈ తరం ప్రేక్షకులకు రుచిస్తుందా అన్నది సందేహమే.

చివరగా: దొరసాని.. ‘మంచి’ సినిమానే కానీ..!

రేటింగ్: 2.5/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre