Begin typing your search above and press return to search.

డబుల్ బ్లాక్ బస్టర్.. డబుల్ డిజాస్టర్.. ఇదే ఇప్పుడు ట్రెండ్..!

By:  Tupaki Desk   |   7 Sep 2022 6:30 AM GMT
డబుల్ బ్లాక్ బస్టర్.. డబుల్ డిజాస్టర్.. ఇదే ఇప్పుడు ట్రెండ్..!
X
కరోనా పాండమిక్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి మరియు ఆలోచనా విధానంలో చాలా మార్పులు వచ్చాయనేది వాస్తవం. ఓటీటీలలో విస్తృతమైన కంటెంట్ కు అలవాటు పడిపోయిన జనాలు.. ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా థియేటర్లలో సినిమాలు చూస్తున్నారు.

టీజర్ - ట్రైలర్ - సాంగ్స్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ఆకర్షించిన చిత్రాలను చూడటానికి ఆడియన్స్ ఆసక్తి కనబరుస్తున్నారు. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందిస్తున్నారు. మిగతా వాటిని డిజిటల్ వేదికల మీద చూడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఇటీవల కాలంలో సినిమాలను గమనిస్తే కంటెంట్ బాగుంటే డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్స్ చేస్తున్నారు.. లేకపోతే డబుల్ ట్రిపుల్ డిజాస్టర్స్ గా మార్చేస్తున్నారు. ఇక సెమీ హిట్స్ - యావరేజ్ సినిమాలు కనిపించడం లేదు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే కొత్త ట్రెండ్ అని అనుకోవాలి.

ఈ ఏడాదిలో 'డీజే టిల్లు' 'ఆర్.ఆర్.ఆర్' 'మేజర్' 'సర్కారు వారి పాట' 'బింబిసార' 'సీతా రామం' 'కార్తికేయ 2' వంటి తెలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. వీటిలో కొన్ని ఇతర భాషల్లోనూ సత్తా చాటాయి. అలానే హిందీలో 'ది కాశ్మీర్ ఫైల్స్' 'భూల్ బులయ్యా 2' వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

కన్నడలో 'కేజీఎఫ్ 2' 'విక్రాంత్ రోణా' 'చార్లీ 777'.. తమిళ్ లో 'విక్రమ్' 'కాలేజ్ డాన్' 'తిరు'.. మలయాళంలో 'హృదయం' 'భీష్మ పర్వం' 'జనగణమన' వంటి సినిమాలు విజయం సాధించాయి. అదే సమయంలో భారీ అంచనాల నడుమ విడుదలైన బిగ్ బడ్జెట్ చిత్రాలు తీవ్రంగా నిరాశ పరిచాయి.

'రాధే శ్యామ్' 'ఆచార్య' 'లైగర్' 'లాల్ సింగ్ చద్దా' 'సామ్రాట్ పృథ్వీరాజ్' 'షంసేరా' 'ఎటాక్' 'బచ్చన్ పాండే' 'జెర్సీ' 'ధాకడ్' వంటి పలు సినిమాలు ఫెయిల్యూర్స్ గా నిలిచాయి. వీటిల్లో రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో హడావిడి చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద అల్ట్రా డిజాస్టర్స్ గా నిలవడం గమనార్హం.

పెద్దగా ప్రచారం చేయకుండా మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలు భారీ హిట్లుగా నమోదు అవడాన్ని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ నెలలో రాబోయే 'బ్రహ్మాస్త్ర' మరియు 'పొన్నియన్ సెల్వన్-1' వంటి రెండు పాన్ ఇండియా సినిమాలపై అందరి దృష్టి పడింది.

బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బ్రహ్మాస్త్ర: మొదటి భాగం-శివ' చిత్రాన్ని దక్షిణాదిలో దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. ఇది సెప్టెంబర్ 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇందులో రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బచ్చన్ - అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు.

మరోవైపు 'PS 1' మూవీ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రచారం చేయబడుతోంది. దీంట్లో విక్రమ్ - కార్తీ - జయం రవి - ఐశ్వర్యారాయ్ - త్రిష వంటి భారీ తారాగణం భాగమైంది. సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

'బ్రహ్మాస్త్ర 1' మరియు 'పొన్నియన్ సెల్వన్-1' రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రాలే. ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయబడుతున్నాయి. కంటెంట్ బాగుంటే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు ఖాయంగా కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఏదేమైనా ఎలాంటి సినిమాలు చూడాలనే విషయంలో ప్రేక్షకులు చాలా క్లియర్ గా ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. కంటెంట్ బాగుండి దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తే బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. భారీ ప్రచారం చేసినా కంటెంట్ లేకపోతే నిర్థాక్ష్యంగా తిరస్కరిస్తున్నారు. ఫిలిం మేకర్స్ ఈ విషయాన్ని గ్రహించి సినిమాలు తీస్తే మంచి ఫలితాలు అందుకునే అవకాశాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.