Begin typing your search above and press return to search.

లెక్క‌ల మాస్టారు డ‌బుల్ గేమ్ ఏంటో కానీ!

By:  Tupaki Desk   |   9 Feb 2023 7:30 PM IST
లెక్క‌ల మాస్టారు డ‌బుల్ గేమ్ ఏంటో కానీ!
X
భారీ సినిమాల కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ప‌ని చేయ‌డం హాలీవుడ్ ఫిలింమేక‌ర్స్ స్టైల్. ఒక్కో సినిమా కోసం ఏళ్ల‌కు ఏళ్లు ప‌ని చేస్తుంటారు. జేమ్స్ కామెరూన్ - స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్- ర‌స్పో బ్ర‌ద‌ర్స్ లాంటి వాళ్ల‌కే ఇది అల‌వాటు అనుకుంటే పొర‌పాటు. ఇటు సౌత్ ఇండియాలో రాజ‌మౌళి- శంక‌ర్ లాంటి ద‌ర్శ‌కులు ఇందులో త‌క్కువేమీ కాదు. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి బాహుబ‌లి రెండు భాగాల కోసం ఐదేళ్ల స‌మ‌యం తీసుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ కోసం రెండేళ్లు పైగానే స‌మ‌యం వెచ్చించారు. రోబో-2.0 లాంటి సినిమాల కోసం శంక‌ర్ కూడా ఇంచుమించు ఇలానే బెంచ్ మార్క్ టైమ్ ని ఫిక్స్ చేసుకుని ప‌ని చేసారు.

ఒక భారీ సినిమాని ఎంపిక చేసుకుని దానికోసం ఏళ్ల త‌ర‌బ‌డి పని చేయ‌డం ఆ ఇద్ద‌రి స్టైల్. కానీ సౌత్ లో శ‌ర‌వేగంగా సినిమాలు పూర్తి చేసేవాళ్లు ద‌ర్శ‌క‌త్వంతో సంబంధం లేకుండా ఇత‌ర హీరోలు ద‌ర్శ‌కుల‌కు స్క్రిప్టు ప‌నులు చేసేవారు లేక‌పోలేదు. ముఖ్యంగా లెక్క‌ల మాస్టారు సుకుమార్ ఇలాంటి విద్య‌లో ఎంతో ఆరితేరిపోయారు. ఇత‌రుల‌కు సుక్కూ పూర్తిగా భిన్నం.

ఓవైపు పుష్ప‌- పుష్ప 2 లాంటి సినిమాల‌కు స్క్రిప్టులు రాస్తూనే సుకుమార్ రైటింగ్స్ టీమ్ లో యువ ర‌చ‌యిత‌ల‌తో క‌థ‌లు - స్క్రిప్టులు రాయించి తాను ఫైన‌ల్ ట‌చ్ ఇస్తున్నారు. అలాగే తాను అనుకున్న లైన్ ని యువ‌ర‌చ‌యిత‌ల‌తో గొప్ప‌గా మ‌లిచే నైపుణ్యం సుక్కూ సొంతం.

అలాగే వాటిని తెర‌కెక్కించేందుకు త‌న శిష్యుల్లో మెరుగైన ద‌ర్శ‌కుల‌ను ఎంపిక చేసుకుని వినియోగిస్తున్నారు. మ‌రోవైపు నిర్మాత‌గా పెట్టుబ‌డులు స‌మ‌కూరుస్తూ త‌న శిష్యుల‌కు లైఫ్ నిస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్ లో ఇలాంటి చిన్న సినిమాల‌తో స్టార్ల‌కు మంచి మైలేజ్ ద‌క్కుతోంది. 100 ప‌ర్సంట్ ల‌వ్- కుమారి 21 ఎఫ్- 18 పేజెస్ లాంటి చిన్న సినిమాల‌కు సుకుమార్ స్క్రిప్టులు అందించ‌గా అవి పెద్ద రేంజులో వ‌ర్క‌వుట్ అయ్యాయి. నాగ‌చైతన్య‌- రాజ్ త‌రుణ్‌- నిఖిల్ లాంటి హీరోల‌కు చ‌క్క‌ని బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించింది సుకుమార్ లోని రైట‌ర్ ప‌నిత‌నమే. ఇటీవ‌ల‌ సాయిధ‌ర‌మ్ కి విరూపాక్ష స్క్రిప్టును సుకుమార్ అందించాడు. ఇప్పుడు డీజే ఫేం సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ కొత్త‌ సినిమాకి సుకుమార్ స్క్రిప్టును అందించారు.

ఓవైపు పుష్ప‌2 చిత్రీక‌ర‌ణ‌తో బిజీగా ఉంటూనే సుకుమార్ చిన్న హీరోల కోసం స్క్రిప్టులు అందించ‌డం నిర్మాత‌గా మారి పెట్టుబ‌డుల సాయం అందించ‌డం నిజంగా గ్రేట్. అత‌డి డ్యూయ‌ల్ స్ట్రాట‌జీ కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌గా అత‌డికి మార్కెట్లో డిమాండ్ ని పెంచింది ఈ ఎత్తుగ‌డే!


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.