Begin typing your search above and press return to search.

డౌట్ గా ఉంటేనే నిర్మాత‌లు ఓటీటీకి వెళుతున్నారా?

By:  Tupaki Desk   |   12 Sep 2021 2:30 PM GMT
డౌట్ గా ఉంటేనే నిర్మాత‌లు ఓటీటీకి వెళుతున్నారా?
X
ఓటీటీలు హీరోలు.. నిర్మాత‌ల పాలిట ర‌క్ష‌ణ క‌వ‌చాల్లా మారుతున్నాయా? క‌నీస రిట‌ర్న్ గ్యారెంటీ ఇస్తున్నాయా? అంటే.. అవున‌నే కొన్ని స‌న్నివేశాలు నిరూపిస్తున్నాయి. ఇటీవలే భారీ అంచ‌నాల న‌డుమ నాని `ట‌క్ జ‌గ‌దీష్` అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు డివైడ్ టాక్ వ‌చ్చింది. అనుకున్నంత విష‌యం సినిమాలో లేద‌ని సోష‌ల్ మీడియా మెజార్టీ వ‌ర్గం కామెంట్ల రూపంలో తెలిపింది. రొటీన్ ఫార్ములా క‌థ‌.. కంటెట్ అనే విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌చ్చాయి.

ఈ నేప‌థ్యంలో ట‌క్ జ‌గ‌దీష్ ఓటీటీలో రిలీజ్ అయి సేఫ్ జోన్ లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అదే సినిమా థియేట‌ర్లో రిలీజ్ అయితే ఇంత‌కు మించిన మౌత్ టాక్ తో వ‌సూళ్లు ప‌డిపోవేవి. ఆ కార‌ణంగా నిర్మాత‌లు..డిస్ట్రిబ్యూటర్లు.. బ‌య్య‌ర్లు తీవ్ర న‌ష్టాల‌కు గుర‌య్యేవారు.

హీరో మార్కెట్ పైనా ఫ‌లితం ప్ర‌భావం చూపించేది. ఆ ర‌కంగా ట‌క్ జ‌గ‌దీష్ ఓటీటీలో రిలీజ్ చేసి మిగ‌తా వారికి మంచి ప‌నిచేసాడ‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయి. నిర్మాత ముందుగానే ఒప్పందం ప్రకారం సినిమా అమ్మేసారు కాబ‌ట్టి న‌ష్టాల‌తో ఎలాంటి సంబంధం లేదు. ఆ ర‌కంగా నిర్మాత 100 శాతం సేఫ్ అని తెలుస్తోంది. స‌రిగ్గా ఇలాంటి స‌న్నివేశమే కొన్ని నెల‌ల క్రితం ధ‌నుష్ న‌టించిన సినిమా ఎదుర్కుంది. ధ‌నుష్ న‌టించిన `జ‌గ‌మే తంతిరామ్` ఎన్నో ప్ర‌తికూల ప‌రిస్థితుల న‌డుమ ఓటీటీలో రిలీజ్ అయింది.

నెట్ ప్లిక్స్ కి విక్ర‌యించినంద‌కు నిర్మాత‌ల‌పై పంపిణీదారులు మండిప‌డ్డారు. క‌ట్ చేస్తే సినిమా రిలీజ్ త‌ర్వాత నెట్ ప్లిక్స్ రిలీజ్ అవ్వ‌డం వ‌ల్ల తాము సేఫ్ అయ్యామ‌ని అదే పంపిణీదారులు త‌ర్వాత చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఓటీటీలో స‌రైన ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు. అలా ఓటీటీ రిలీజ్ లు కొన్ని సినిమాల‌కు వ‌రంగానే మారుతున్నాయ‌ని చెప్పొచ్చు. ప్రొడ‌క్ట్ పై డౌట్ ఉంటేనే నిర్మాత‌లు ఓటీటీకి వెళ్తున్నారా? అన్న సందేహాలు ఇప్పుడు రెయిజ్ అవుతున్నాయి. ఏదేమైనా ఓటీటీలు నిర్మాత‌ల‌కు వ‌రంగానే మారాయి.