Begin typing your search above and press return to search.

తేజ్ తిప్పలు అన్నిఇన్ని కావు

By:  Tupaki Desk   |   12 Jun 2018 7:18 AM GMT
తేజ్ తిప్పలు అన్నిఇన్ని కావు
X
జయాపజయాలు సినిమా పరిశ్రమలో ఎంతగా ప్రభావితం చేస్తాయో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కి ప్రత్యక్షంగా తెలిసి వస్తోంది. తన కొత్త సినిమా తేజ్ ఐ లవ్ యు కి ఆశించనంత బజ్ లేకపోవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. మెగాస్టార్ చిరంజీవిని అతిధిగా తీసుకొచ్చి సుమారు 20 నిముషాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టేజి మీద మాట్లాడించినా దాని తాలూకు ప్రభావం బిజినెస్ మీద అంతగా లేదు. కారణం తేజుకి గత రెండేళ్లలో వచ్చిన డిజాస్టర్లే. మెగా హీరో అని చెప్పి గుడ్డిగా కొనేందుకు డిస్ట్రిబ్యూటర్లు సిద్ధంగా లేరు. అందుకే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇంకా వ్యాపార లావాదేవీలు పూర్తి కాలేదని టాక్. అందుకే ముందు ప్రకటించిన జూన్ 29 విడుదలకు కట్టుబడటం అంత ఈజీగా కనిపించడం లేదు. ఒక సినిమా అమ్మకం విషయంలో హీరో ఇమేజ్ తో దర్శకుడి ట్రాక్ రికార్డు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ రకంగా చూసుకుంటే కరుణాకరన్ కు ట్రేడ్ లో ఏమంత పేరు లేదు. అప్పుడెప్పుడో ప్రభాస్ తో హిట్టు కొట్టిన డార్లింగ్ సినిమాను చూసి తేజ్ ఐ లవ్ యు కొనేంత సీన్ లేదు. ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చినా రెండో రోజే సినిమాను నిలబెట్టలేనంత వీక్ పొజిషన్ లో తేజు ఉన్నాడన్నది నిజం. సుప్రీమ్ ని మించిన బలమైన హిట్ పడితే తప్ప అది జరిగే పని కాదు.

మరి ఇలాంటి అడ్డంకులు ఇన్ని పెట్టుకుని తేజ్ ఐ లవ్ యు చెప్పిన టైంకి రావడం గురించి పలు అనుమానాలు ఉన్నాయి. పైగా టైటిల్ మరీ సాఫ్ట్ గా ఉండటం ఒక ఎత్తైతే మెగా హీరోలకు బలమైన మాస్ ని టార్గెట్ చేసిన అంశాలు లేనట్టుగా ఇంప్రెషన్ క్రియేట్ చేయటం ఇవన్నీ నెగటివ్ గా పని చేస్తున్నాయి. దానికి తోడు సీనియర్ నిర్మాతే అయినప్పటికీ సబ్జెక్టు డిమాండ్ చేయటంతో ముందు అనుకున్న దాని కన్నా కెఎస్ రామారావు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చిందట. విడుదలకు ముందే లాభాలతో నిశ్చితంగా ఉందాం అనుకున్న రామారావు బయ్యర్ల నుంచి వస్తున్న స్పందన వల్ల ఆలోచనలో పడినట్టు తెలిసింది. సాఫ్ట్ లవ్ స్టోరీ కాబట్టి తొలిప్రేమ తరహాలో వర్క్ అవుట్ అవుతుంది అనే నమ్మకంతో ఓవర్సీస్ వరకు మంచి రేట్లకు అమ్ముకున్నారు కానీ అసలు చిక్కంతా తెలుగు బయ్యర్ల దగ్గర వచ్చింది. జవాన్-ఇంటెలిజెంట్ లాంటి సినిమాలు మంచి హైప్ తో వచ్చినప్పుడే నష్టాలు తప్పలేదు అలాంటిది బజ్ తక్కువగా ఉన్న తేజ్ ఐ లవ్ మీద రిస్క్ చేయలేమని తేల్చి చెప్పినట్టు వినికిడి. వాళ్ళు అడిగిన రేట్లకు ఇస్తే నిర్మాతకు లెక్కలు సెట్ కావు. రామారావుతో చరణ్ ది ఒక సినిమా ఉంటుంది అని చిరంజీవి ప్రకటించినా అది ఎంత లేదన్న రెండేళ్ల తర్వాతే ఉంటుంది . ఆలోగా ఏదైనా జరగొచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కొనేద్దాం అనుకోరు. మరి రామారావు ఆశించిన రేట్లు వచ్చే వరకు ఆగి ఓ వారం వాయిదా వేస్తారా లేక స్వంతంగా రిలీజ్ కు పూనుకుంటారా వేచి చూడాలి. ఇప్పటికైతే జూన్ 29 మంచి డేట్. పోటీ కూడా లేదు. వాయిదా పడిందా జులైలో మాంచి రసవత్తరమైన పోటీ ఉంది. అప్పుడు నెగ్గడం అంత సులభంగా ఉండదు.