Begin typing your search above and press return to search.

'శేఖర్' ప్రదర్శనకు లైన్ క్లియర్ అయినట్లేనా.. ?

By:  Tupaki Desk   |   23 May 2022 5:31 PM GMT
శేఖర్ ప్రదర్శనకు లైన్ క్లియర్ అయినట్లేనా.. ?
X
యాంగ్రీ మ్యాన్ డాక్టర్ రాజశేఖర్ కథానాయకుడిగా ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''శేఖర్''. గత శుక్రవారం విడుదలైన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.

పరంధామరెడ్డి అనే ఫైనాన్షియర్ తన దగ్గర అప్పుగా తీసుకున్న 65 లక్షల రూపాయలు నిర్మాత, దర్శకురాలు జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించడం లేదంటూ హైదరాబాద్ లోని సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. దీని కారణంగా 'శేఖర్' చిత్ర ప్రదర్శన నిలిపివేశారు.

అయితే 'శేఖర్' వివాదంపై వాదోపవాదనలు జరుగగా.. కోర్టులో జీవిత రాజశేఖర్ మరియు నిర్మాతలకు అనుకూలంగా న్యాయవాది మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని తామెక్కడా చెప్పలేదని న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు పేర్కొంటున్నారు.

కొంతమంది ఉద్దేశపూర్వకంగా సినిమా ప్రదర్శనకు ఆటంకం కలిగించారని.. అయితే కోర్టు సినిమా ప్రదర్శనకు ఎటువంటి అభ్యంతరం తెలపలేదని.. 'శేఖర్' సినిమాను నిరభ్యంతరంగా ప్రదర్శించవచ్చని న్యాయమూర్తి తెలిపారని అంటున్నారు.

ఇకపోతే 'శేఖర్' వివాదానికి సంబంధించి జీవితా రాజశేఖర్ - నిర్మాత బీరం సుధాకర్ రెడ్డి రేపు మంగళవారం ఉదయం 11 గంటలకు ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. వారి తరపు న్యాయవాదులు విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలను వెల్లడించనున్నారని సమాచారం. మరి మేకర్స్ రేపు ఏం చెప్తారో చూడాలి.

కాగా, మలయాళంలో ఘనవిజయం సాధించిన 'జోసెఫ్' చిత్రానికి అధికారిక రీమేక్ గా ''శేఖర్'' సినిమా తెరకెక్కింది. ఇందులో రాజశేఖర్ వయస్సు పైబడిన పాత్రలో మాస్ లుక్‌ లో కనిపించారు. ఆయన కూతురు శివాని రాజశేఖర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.

వంకాయలపాటి మురళీ కృష్ణ సమర్పణలో పెగాసస్ సినీ కార్పొరేషన్ - సుధాకర్ ఇంపెక్స్ ఐపియల్ - త్రిపురా క్రియేషన్స్ - టారాస్ బ్యానర్లపై ''శేఖర్'' చిత్రాన్ని రూపొందించారు. బీరం సుధాకర్ రెడ్డి - శివాని రాజశేఖర్ - శివాత్మిక రాజశేఖర్ - బొగ్గారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలుగా వ్యవహరించారు.