Begin typing your search above and press return to search.

దృశ్యం 2 ఓటీటీలో.. ద‌ర్శ‌కుడేమ‌న్నారంటే?

By:  Tupaki Desk   |   24 Nov 2021 5:30 PM GMT
దృశ్యం 2 ఓటీటీలో.. ద‌ర్శ‌కుడేమ‌న్నారంటే?
X
ప్ర‌శాంతంగా ఒక ఊరు .. ఆ ఊళ్లో అంద‌మైన ఫ్యామిలీ.. అనుకోని క్రైమ్.. ఆ త‌ర్వాత దానినుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఆ ఫ్యామిలీ ఏం చేసింద‌నే క‌థాంశంతో దృశ్యం తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తెలుగు-త‌మిళం-మ‌ల‌యాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న చిత్ర‌మిది. ఇప్పుడు దృశ్యం సీక్వెల్ దృశ్యం 2 తెలుగులో ఈనెల 25 నుంచి ఓటీటీ(అమెజాన్ ప్రైమ్‌)లోకి వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా దృశ్యం రీక్యాప్ వీడియోని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ప్ర‌చారంలోనూ వేడి పెంచారు.

మ‌ల‌యాళంలో జీతు జోసెఫ్ థ్రిల్లర్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అతని 2013 క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం భారీ విజయం సాధించింది. ఇది అన్ని ప్రధాన భారతీయ భాషల్లోకి రీమేక్ చేయబడడమే కాకుండా చైనీస్ రీమేక్ కు కూడా ప్రేరణనిచ్చింది. అయితే జీతూ ఇప్పుడు నేరాలు మోసం కప్పిపుచ్చడం వంటి క్రైమ్ డ్రామాతో సినిమాలు తీసి ఘ‌న‌విజ‌యం అందుకున్నాడు.

ప్ర‌స్తుతం అతను ఇప్పుడు దృశ్యం 2 విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు. ఇది అతని 2013 హిట్ కి సీక్వెల్. ఈ చిత్రం ఈ గురువారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ గా ప్రదర్శితం కానుండ‌గా జీతూ మీడియా ప్ర‌మోష‌న్స్ లో బీజీగా ఉన్నారు. తన భవిష్యత్ ప్రాజెక్ట్ ల గురించి మాట్లాడుతూ.. కేవలం 'థ్రిల్లర్ దర్శకుడు'గా మాత్రమే పేరు పొందడం ఎందుకు సంతోషంగా లేన‌ని తెలిపాడు. ఇక వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాలు తీస్తాన‌ని అన్నారు.

మలయాళంలో ఒరిజినల్ సీక్వెల్ తెలుగులో రీమేక్ వేగంగా పూర్త‌య్యాయ‌ని జీతూ తెలిపారు. మలయాళంలో చేస్తున్నప్పుడే తెలుగు రీమేక్ ప్లాన్ చేశారా? అని అడిగితే... మేము మలయాళం సీక్వెల్ షూటింగ్ పూర్తి చేసినప్పుడు,.. సురేష్ (బాబు) సార్ నన్ను పిలిచి సినిమా స్క్రిప్ట్ కోసం నన్ను అడిగారు. దానికి ఆంగ్లానువాదం పంపాను. స్క్రిప్ట్ నచ్చిందని సినిమా చూడాలని ఉందని చెప్పాడు. డబ్బింగ్ పూర్తయిన తర్వాత సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకుండా అతని కోసం ప్రివ్యూ స్క్రీనింగ్ ఏర్పాటు చేసాను. ఆయనకు కూడా సినిమా నచ్చింది. సమాంతరంగా మేము తెలుగు రీమేక్ కి పని చేయడం ప్రారంభించాము అని తెలిపారు.

థ్రిల్లర్‌ల పట్ల మీ అభిరుచిని ఎలా పెంచుకున్నారు? అన్న ప్ర‌శ్న‌కు.. నేను చిన్నతనంలో అగాథా క్రిస్టీ కథలు.. షెర్లాక్ హోమ్స్ .. ఇతర నవలలు చాలా చదివాను. బేసిగ్గా నాకు థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం. కానీ నేను ఇతర జానర్ లను కూడా ఇష్టపడతాను. నా మొదటి చిత్రం పరిశోధనాత్మక చిత్రం (డిటెక్టివ్). నా రెండవ చిత్రం కుటుంబ చిత్రం (మమ్మీ & నేను). తదుపరిది కామెడీ చిత్రం (మై బాస్). అందుకే అన్ని జోనర్ లలో సినిమాలు చేయాలనుకుంటున్నాను. నా నిర్మాతలను 'నాతో ఎందుకు కామెడీ సినిమాలు చేయడం లేదు?' అని అడుగుతాను. అందరూ థ్రిల్లర్స్ కోసం అడుగుతున్నారు.. అని అన్నారు.