Begin typing your search above and press return to search.

నా దృష్టిలో ఐటమ్ సాంగ్స్ అన్నీ భక్తి గీతాలే..!

By:  Tupaki Desk   |   18 Dec 2021 7:44 AM GMT
నా దృష్టిలో ఐటమ్ సాంగ్స్ అన్నీ భక్తి గీతాలే..!
X
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం దక్షిణాది అగ్ర సంగీత దర్శకులలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఐటమ్ సాంగ్స్ కంపోజ్ చేయడంలో తనకు తిరుగులేదని అనిపించుకున్నారు దేవిశ్రీ. కెరీర్ ప్రారంభం నుంచీ ఎన్నో సూపర్ హిట్ ప్రత్యేక గీతాలకు స్వరాలు సమకూర్చిన దేవి.. మాస్ ఆడియన్స్ ని విపరీతంగా అలరించారు. అయితే అవన్నీ ఐటమ్ సాంగ్స్ కాదని.. భక్తి గీతాలని దేవిశ్రీ అభిప్రాయ పడుతున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ''పుష్ప: ది రైజ్'' సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ - సుకుమార్ - దేవిశ్రీ కాంబోలో వస్తున్న ఈ సినిమా పై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే ఇందులోని అన్ని పాటలూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ముఖ్యంగా 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా' పాట సోషల్ మీడియాను షేక్ చేసింది.

గతంలో వీరి కలయికతో వచ్చిన 'అ అంటే అమలాపురం' 'రింగ రింగా' తరహాలోనే 'పుష్ప' ఐటమ్ సాంగ్ లిరికల్ వీడియోకి స్పందన లభించింది. ఈ స్పైసీ ఐటెమ్ నంబర్‌ కు చంద్రబోస్ లిరిక్స్ రాయగా.. ఇంద్రవతి చౌహాన్ ఆలపించింది. ఇందులో బన్నీతో కలిసి సమంత చిందులు వేసింది. మగవాళ్ళ బుద్ధి వంకర అంటూ వచ్చిన ఈ స్పెషల్ సాంగ్ గురించి ఇటీవల దేవిశ్రీప్రసాద్ మాట్లాడారు.

''అది ప్రేక్షకులకు మాత్రమే ఐటమ్ సాంగ్.. మ్యూజిక్ కంపోజర్ గా నాకు ఇది మరొక పాట మాత్రమే. ఆ సిచ్యుయేషన్ కు తగ్గట్లుగా బెస్ట్ సాంగ్ ఇవ్వాలని అనుకుంటాను. 'ఏ బిడ్డా' 'శ్రీవల్లి' ఎలాగో అది కూడా ఒక సాంగ్ అంతే. నా దృష్టిలో ఐటమ్ సాంగ్స్ అన్నీ డివోషనల్ సాంగ్స్. మనల్ని ఒక ట్రిప్ లోకి తీసుకెళ్లేది డివోషనల్ మెడిటేషన్.. అది ఐటమ్ సాంగ్ అయితేనేం మరేదైతేనేం. ట్యూన్‌ లో దేవుడికి సంబంధించిన లిరిక్స్ వేస్తే అది భక్తిగీతం అవుతుంది. అలాంటి వాటిలో నాకు 'ఊ అంటావా' బెస్ట్ సాంగ్'' అని దేవిశ్రీప్రసాద్ అన్నారు.

ఈ సందర్భంగా 'రంగ రింగా' పాట ట్యూన్ కు 'నాకు ఉన్న కోరికలన్నీ.. నువ్వు తీర్చాలి స్వామీ..' అంటూ భక్తి గీతం వినిపించారు దేవీ. అలానే 'ఊ అంటావా మావా' పాటకు కూడా 'ఊ అంటావా స్వామీ.. ఊఊ అంటావా స్వామీ' అంటూ మరో గీతాన్ని ఆలపించారు. 'కెవ్వు కేక' కూడా అంతే అని అన్నారు. ''నాకు ఏ పాటైనా ఒకటే. 'రంగ రంగ' ఎలాగో.. 'ఫీల్ మై లవ్' కూడా అలానే. నాకు అవన్నీ మ్యూజిక్ మాత్రమే. అందుకే ఎవరైనా ఐటమ్ సాంగ్ అన్నప్పుడు 'వీడెవడు ఐటమ్ లాగా ఉన్నాడు' అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఐటమ్ రాజా అని ఫీల్ అవుతుంటా'' అని డీఎస్పీ చెప్పారు.

అన్నమాచార్య కీర్తనలకు ప్రసిద్ధి చెందిన గాయని శోభారాణి గారిని ఉటంకిస్తూ.. గీతా జయంతి సందర్భంగా 'ఊ అంటావా' ట్యూన్ లో భక్తిగీతాన్ని అప్‌లోడ్ చేశారని దేవిశ్రీప్రసాద్ వెల్లడించారు. ‘ఊ అంటావా మాధవా.. ఊఊ అంటావా’ అనే లిరిక్స్ తో చేసిన డివోషనల్ సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోందని.. ప్రస్తుతం ఈ పాటను అందరూ షేర్ చేస్తున్నారని డీఎస్పీ తెలిపారు. 'పుష్ప' పాటల కోసం ఎప్పుడూ ఒత్తిడి ఫీలవలేదని.. కొత్తగా చేయాలని అనుకున్నానని చెప్పుకొచ్చారు.

కాగా, ఒకప్పుడు టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న దేవిశ్రీప్రసాద్.. ఇటీవల కాలంలో కాస్త స్పీడ్ తగ్గించారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ 'భవదీయుడు భగత్ సింగ్' - రవితేజ 'ఖిలాడి' -రామ్ పోతినేని 'RAPO19' - చిరంజీవి 'Chiru154' - అల్లు అర్జున్ 'పుష్ప: ది రూల్' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ కు దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాలతో మళ్ళీ డీఎస్పీ తన సత్తా చాటుతారని అభిమానులు భావిస్తున్నారు.