Begin typing your search above and press return to search.

భోజ‌నం క్యారేజీని కాలితో త‌న్నింది!

By:  Tupaki Desk   |   24 April 2019 10:31 AM GMT
భోజ‌నం క్యారేజీని కాలితో త‌న్నింది!
X
వంద‌లాది చిత్రాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా న‌టించారు జానకి (76). న‌ట‌న‌.. డ‌బ్బింగ్.. డ్యాన్సింగ్ ఇలా ర‌క‌ర‌కాల విద్య‌ల‌తో బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలిగా సౌత్ సినిమాకి సుప‌రిచితం. `భూ కైలాస్‌` అనే క్లాసిక్ సినిమాతో సినీ కెరీర్‌ ప్రారంభించిన జాన‌కి డ‌బ్బింగ్ ఆర్టిస్టుగా త‌న‌దైన ముద్ర వేశారు. దీంతో డ‌బ్బింగ్ జాన‌కి గా పాపుల‌రైపోయారు. తెలుగు - తమిళ - కన్నడ - హిందీ భాషల్లో దాదాపు 700లకు పైగా చిత్రాల్లో నటించిన అనుభ‌వం త‌న సొంతం. తాజాగా `ఆలీతో సరదాగా` కార్యక్రమంలో జాన‌కి చెప్పిన సంగ‌తులు ఆస‌క్తి రేకెత్తించాయి. త‌న‌ క‌ళ్ల‌ముందే ఓ న‌టి భోజ‌నం క్యారేజీని కాలితో త‌న్నార‌ని.. ఆ త‌ర్వాత రాత్రి అంతా క‌డుపు కాలి అన్నం లేకుండా బాధ‌ప‌డింద‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రం. ఇంత‌కీ ఎవ‌రావిడ‌?

అలీతో స‌ర‌దాగా కార్య‌క్ర‌మంలో జాన‌కి ఎన్నో వ్య‌క్తిగ‌త సంగ‌తుల్ని రివీల్ చేశారు. ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి 60 ఏళ్ల‌య్యింది. త‌న భ‌ర్త మిల‌ట‌రీ అధికారి కావ‌డంతో ఆయ‌న బార్డ‌ర్ లో ఉండేవారు. దాంతో ఉపాధి కోసం మ‌ద్రాసులో అడుగుపెట్టి అక్క‌డే సినీరంగంలో ప్ర‌వేశించాన‌ని జాన‌కి తెలిపారు. అయితే ఈ రంగంలోకి డ‌బ్బు సంపాదించ‌డానికి రాలేద‌ని.. కేవ‌లం పొట్ట గ‌డిచేందుకు బ‌త‌క‌డానికి స‌రిప‌డేంత సంపాదించుకోవాల‌నే వ‌చ్చాన‌ని తెలిపారు. వంద‌లాది చిత్రాల్లో న‌టించేప్పుడు ర‌క‌ర‌కాల అనుభ‌వాలు ఎదుర‌య్యాయ‌ని వెల్ల‌డించారు.

ఓ సారి ఓ వింత అనుభ‌వం ఎదురైంది. ``ఔట్‌ డోర్‌ షూటింగ్‌ కు వెళ్లిన‌ప్పుడు ఇప్ప‌ట్లా సౌక‌ర్యం కుదిరేది కాదు. ఈరోజుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రూమ్‌ ఇస్తున్నారు కానీ.. ఆరోజుల్లో అలా లేదు. అప్పట్లో ఇద్దరు ముగ్గురికి కలిపి ఒక రూమ్‌ ఇచ్చేవారు. నాకేమో త్వరగా భోజనం చేసి నిదురించే అలవాటు ఉండేది. అలాగే ఆ రోజు నేను భోజనం చేసి పడుకున్నా. ఆవిడ తీరిగ్గా వచ్చి జానకి తినేసిందా? అని అడిగింది. తిని ప‌డుకుంద‌ని తెలిసి.. ఆవిడ తిన్న తర్వాత మిగిలింది నేను తినాలా? అంటూ భోజ‌నం క్యారేజ్‌ ను ఒక్క తన్ను తన్నింది. అంతే అన్నమంతా చిందరవందరగా పడిపోయింది. ఆ తర్వాత దానికి ఫలితం ఆవిడ అనుభవించింది`` అని తెలిపారు. ``పేరు చెప్పలేను కానీ.. తాను ఇప్పటికీ ప‌రిశ్ర‌మ‌లో ఉంది..`` అని జాన‌కి వెల్ల‌డించారు. మొత్తానికి త‌ల‌బిరుసుతో ఆ ప‌ని చేసిన ఆవిడెవ‌రై ఉంటారు?