Begin typing your search above and press return to search.

రీమేక్ వ‌ద్దు...డ‌బ్బింగే ముద్దు అనాల్సిందే!

By:  Tupaki Desk   |   2 Dec 2022 5:30 PM GMT
రీమేక్ వ‌ద్దు...డ‌బ్బింగే ముద్దు అనాల్సిందే!
X
తెలుగులో రీమేక్ సినిమాల‌కు కాలం చెల్లిన‌ట్టేనా..? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. గ‌తంలో ఇత‌ర భాష‌ల్లో సూప‌ర్ హిట్‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ లుగా నిలిచిన సినిమాల గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా తెలిసేది కాదు. అంతే కాకుండా ప‌లానా భాష‌లో సూప‌ర్ హిట్ అయిన సినిమాకు రీమేక్ గా ఈ మూవీని చేస్తున్నామ‌ని నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు చెప్పేవారు కూడా కాదు. దాంతో రీమేక్ లు ప్రేక్ష‌కుల‌కు ఫ్రెష్ గా అనిపించేవి.

ఎక్కువ మంది చూడ‌టానికి ఇష్ట‌ప‌డేవారు. కానీ ఈ మ‌ధ్య ఓటీటీల ప్ర‌భావం పెరిగిన పోయిన త‌రువాత ఏ భాష‌లో విడుద‌లై హిట్ అనిపించుకున్నా ఇట్టే తెలిసిపోతోంది. అంతే కాకుండా ఓ హీరో రీమేక్ మూవీ చేస్తున్నాడ‌న‌గానే దానికి మాతృక ఎలా వుందా? అని ప్రేక్ష‌కులు ఆరాతీయ‌డం మొద‌లు పెడుతున్నారు. దీంతో రీమేక్ ల వెన‌కున్న సీక్రెట్స్ అన్నీ బ‌య‌టికి వ‌చ్చేస్తున్నాయి. ప‌లానా సినిమా ని రీమేక్ చేస్తున్నారంటూ ఆడియ‌న్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా సీన్స్ తో స‌హా చెప్పేస్తూ బిట్స్ పెట్టేయ‌డంతో రీమేక్ ల‌పై ఆస‌క్తి క్ర‌మ క్ర‌మంగా తగ్గుతూ వ‌స్తోంది.

ఇక రీసెంట్ గా మెగాస్టార్ న‌టించిన 'గాడ్ ఫాద‌ర్‌' ఫిలితం చూశాక రీమేక్ లంటే చేయ‌డానికి హీరోలు కూడా ధైర్యం చేయ‌డం లేదు. అప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన మాతృక అయిన‌టువంటి 'లూసీఫ‌ర్‌' తెలుగు అనువాదం యూట్యూబ్ లో , ఓటీటీలో అందు బాటులో వుండ‌టం.. చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కులు ఆ మూవీని చూడ‌టంతో 'గాడ్ ఫాద‌ర్‌'ని చూడ‌టానికి ఆస‌క్తిని చూపించ‌లేదు. దీంతో ఈ మూవీ అనుకున్న స్థాయిలో ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేకపోయింది.

ఇదే స‌మ‌యంలో డ‌బ్బింగ్ సినిమాలు భారీ విజ‌యాల్ని సాధించ‌డం, బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డంతో ఇప్ప‌డు అంద‌రి దృష్టి డ‌బ్బింగ్ సినిమాల‌పై ప‌డింది. గ‌తంలో శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఏ.ఎం. ర‌త్నం త‌ను త‌మిళంలో నిర్మించిన క్రేజీ సినిమాల‌ని తెలుగులో రీమేక్ చేయ‌కుండా డ‌బ్బింగ్ చేస్తూ వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకున్నారు. ఆ త‌రువాత కొన్ని సినిమాలు రీమేక్ చేశారు. అయితే ఈ మ‌ధ్య మాత్రం రీమేక్ సినిమాలు ఆడ‌క‌పోవ‌డంతో చాలా వ‌ర‌కు స్టార్ ప్రొడ్యూస‌ర్సే డ‌బ్బింగ్ లు చేస్తున్నారు.

గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ తాజాగా క‌న్న‌డ మూవీ 'కాంతార'ని తెలుగులో డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేయ‌డం తెలిసింది. రిష‌బ్ శెట్టి హీరోగా న‌టించిన తెర‌కెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. అంతే కాకుండా ఇదే త‌ర‌హాలో త‌మిళ హిట్ మూవీ 'ల‌వ్ టుడే'ని దిల్ రాజు రిలీజ్ చేయ‌డం.. అది కూడా ఊహించ‌ని విధంగా వ‌సూళ్ల‌ని రాబ‌డుతుండ‌టం తెలిసిందే. త‌క్కువ బ‌డ్జెట్ లో నిర్మించిన ఈ రెండు సినిమాలే రికార్డులు సృష్టిస్తున్నాయి.

కంటెంట్ బ‌లంగా వుంది కాబ‌ట్టే ఈ సినిమాలు సూప‌ర్ హిట్ లుగా నిలిచి తెలుగు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటున్నాయి. అదే కంటెంటే లేదంటే డ‌బ్బింగ్ సినిమాలు ఆక‌ట్టుకోవ‌డం క‌ష్టం. రీమేక్ ల‌ను మించి ఇటీవ‌లీ కాలంలో డ‌బ్బింగ్ సినిమాలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్న నేప‌థ్యంలో అంతా డ‌బ్బింగ్ సినిమాల వైపే మొగ్గు చూపుతున్నార‌ట‌. ఈ ఏడాది చాలా వ‌ర‌కు డ‌బ్బింగ్ సినిమాలు విడుద‌లైనా కేజీఎఫ్ 2, కాంతార‌, ల‌వ్ టుడే మాత్ర‌మే బాక్సాఫీస్ వ‌ద్ద ఆక‌ట్టుకున్నాయి. ఈ విష‌యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు నిర్మాత‌లు ప్రేక్ష‌కులు న‌చ్చే అనువాద సినిమాల‌ని అందిస్తార‌ని, రీమేక్ లు వ‌ద్దు డ‌బ్బింగే ముద్దు అంటార‌ని ఆశిద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.