Begin typing your search above and press return to search.

మనీ లాండరింగ్‌ కేసులో రియాకు సమన్లు జారీ చేసిన ఈడీ...?

By:  Tupaki Desk   |   1 Aug 2020 10:30 PM IST
మనీ లాండరింగ్‌ కేసులో రియాకు సమన్లు జారీ చేసిన ఈడీ...?
X
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌ పుత్‌ ఆత్మహత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబ సభ్యులు అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించి ఉంటారని సుశాంత్‌ తండ్రి కృష్ణ కుమార్‌ సింగ్‌ ఆరోపిస్తూ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్‌ వ్యవహారాలు కూడా జరిగినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్‌ ఖాతాలో ఉన్న రూ.15 కోట్లు ఎవరికి బదిలీ అయ్యాయో నిగ్గుతేల్చాలని కేకే సింగ్ పోలీసులను కోరారు. దీనిపై కేసు నమోదు చేసిన బీహార్ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇక రంగంలోకి దిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) బీహార్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌.ఐ.ఆర్‌ ఆధారంగా నిందితులపై మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. నిందితుల్లో రియా మరియు ఆమె కుటుంబ సభ్యులతో పాటు మరో ఆరుగురు వ్యక్తుల పేర్లు ఉన్నట్లు సమాచారం.

కాగా ఇప్పటికే ఈడీ సుశాంత్‌ ఆదాయం, బ్యాంకు ఖాతాలు సేకరించి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. అంతేకాకుండా సుశాంత్ కు చెందిన వివిడ్రేజ్ రియాలిటీఎక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఫ్రంట్ ఇండియా ఫర్ వరల్డ్ ఫౌండేషన్ అనే రెండు కంపెనీల వివరాలు కూడా సేకరించిందని సమాచారం. ఈ రెండు సంస్థలకు రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. నేషనల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మనీ లాండరింగ్‌ కేసులో నెక్స్ట్ వీక్ హాజరవ్వాలని రియాకు ఈడీ సమన్లు జారీ చేసిందని తెలుస్తోంది. ఈడీ విచారణ తర్వాత ఈ కేసులో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. మరోవైపు రియా 'తనకి న్యాయం జరుగుతుందని.. దేవుడిపై న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని.. సత్యమేవ జయతే' అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది.