Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ‘ఈ నగరానికి ఏమైంది’

By:  Tupaki Desk   |   29 Jun 2018 9:23 AM GMT
మూవీ రివ్యూ : ‘ఈ నగరానికి ఏమైంది’
X
చిత్రం : ‘ఈ నగరానికి ఏమైంది’

నటీనటులు: విశ్వక్సేన్ - సుశాంత్ రెడ్డి - అభినవ్ గోమఠం - వెంకటేష్ కాకుమాను - సిమ్రాన్ చౌదరి - అనీషా ఆంబ్రోస్ - గీతా భాస్కర్ తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మి
నిర్మాత: సురేష్ బాబు
రచన - దర్శకత్వం: తరుణ్ భాస్కర్

‘పెళ్ళిచూపులు’ సినిమాతో ఉవ్వెత్తున ఎగిశాడు తరుణ్ భాస్కర్. మళ్లీ అతడి నుంచి మరో సినిమా రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. ఈసారి కూడా అందరూ కొత్త వాళ్లను పెట్టి ఒక విభిన్నమైన సినిమా తీశాడు తరుణ్. అగ్ర నిర్మాత సురేష్ బాబు నిర్మాణంలో అతను తెరకెక్కించిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి తరుణ్ రెండో సినిమాతోనూ మెప్పించాడో లేదో చూద్దాం పదండి.

కథ:

వివేక్ (విశ్వక్సేన్) ఇంజినీరింగ్ చేస్తున్న సమయంలోనే డైరెక్టర్ అయ్యే దిశగా షార్ట్ ఫిల్మ్ తీయాలనే ప్రయత్నంలో ఉంటాడు. అతడికి ముగ్గురు స్నేహితులుంటారు. వీళ్లంతా కలిసి ఒక షార్ట్ ఫిలిం తీయడానికి సిద్ధమవుతారు. ఆ షార్ట్ ఫిలిం తీసే క్రమంలో ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు వివేక్. ఆ అమ్మాయీ ఇతడిని ప్రేమిస్తుంది. కానీ వివేక్ తీరు నచ్చక ఆ అమ్మాయి అతడికి దూరమవుతుంది. దీంతో వివేక్ దేవదాసు అయిపోతాడు. తర్వాత అతడి స్నేహితులు కూడా ఎవరి పనుల్లో పడిపోతారు. షార్ట్ ఫిలిం కల పక్కకు వెళ్లిపోతుంది. కొన్నేళ్ల తర్వాత ఈ నలుగురూ ఒక సందర్భంలో ఒక చోటికి చేరి తమ పాత జ్ఞాపకాల్ని నెమరువేసుకోవడం మొదలుపెడతారు. తర్వాత అనుకోని పరిస్థితుల్లో మళ్లీ షార్ట్ ఫిలిం తీయడానికి రెడీ అవుతారు. మరి వారి ప్రయత్నం ఏమేరకు విజయవంతమైంది.. ఆ క్రమంలో వాళ్ల జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం - విశ్లేషణ:

సినిమా కథలు ఎక్కడి నుంచో పుట్టవు. జీవిత అనుభవాలనే ఆసక్తికరంగా చెప్పే ప్రయత్నం చేయొచ్చు. ‘ఈ నగరానికి ఏమైంది’ ఈ తరహా ప్రయత్నమే. ఇది స్వయంగా తరుణ్ భాస్కర్ కథ. అతడి అనుభవాల్లోంచి పుట్టిన ఒక వాస్తవికమైన కథ. తెలుగు సినిమాల్లో ఎవ్వరూ టచ్ చేయకుండా.. సరైన ప్రాతినిధ్యం లేకుండా పోయిన తెలంగాణ అర్బన్ నేటివిటీ కామెడీని సరిగ్గా ప్రెజెంట్ చేయడం ద్వారా ‘పెళ్ళిచూపులు’తో కొత్త ఒరవడికి తెరతీసి.. దాన్నే ఒక ట్రెండుగా మార్చిన తరుణ్.. మరోసారి తనదైన మార్కు చూపిస్తూ మెప్పించాడు. కాకపోతే ‘పెళ్ళిచూపులు’లాగా ఇది బలమైన.. సార్వజనీనమైన సినిమాలా అనిపించదు. అర్బన్ కామెడీని ఎంజాయ్ చేసే యూత్ ను మాత్రం ఇది అలరిస్తుంది.

సినిమా అంటే ఇలాగే ఉండాలి.. ఇలాగే తీయాలి అనే సంప్రదాయ ఆలోచనల్ని బ్రేక్ చేస్తూ తనదైన శైలిలో ‘పెళ్ళిచూపులు’ సినిమాను తీర్చిదిద్దిన తరుణ్ భాస్కర్.. మరోసారి ఆ శైలిని చూపించాడు ‘ఈ నగరానికి ఏమైంది’లో. మనం ఒక సినిమా చూస్తున్నట్లు కాకుండా నిజంగా కొందరు వ్యక్తుల జీవితాల్ని నేరుగా వాళ్ల పక్కన కుర్చీ వేసుకుని చూస్తున్నట్లుగా ఉంటుంది ఈ సినిమా చూస్తుంటే. వాళ్ల పాత్రలు.. సంభాషణలు అంత సహజంగా సాగి.. యూత్ బాగా రిలేట్ చేసుకునేలా ఉంటాయి. ప్రతి డైలాగ్ లోనూ ఒరిజినాలిటీ కనిపిస్తుంది. ఈతరం సిటీ కుర్రాళ్లు కొందరు కలిసి కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటే వాళ్ల మధ్య ఎలాంటి ఫన్ జనరేట్ అవుతుందో.. ఎలా జోకులు పేలుతాయో.. అదంతా సినిమాలో కనిపిస్తుంది. నటీనటులకు సందర్భం చెప్పి ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి అని వదిలేసినట్లుగా అనిపిస్తుంది ఒక్కో సీన్ చూస్తుంటే. ప్రత్యేకంగా డబ్బింగ్ చెప్పించకుండా సింక్ సౌండ్ టెక్నాలజీతో అక్కడిక్కడ డైలాగ్స్ చెప్పించడం వల్ల కూడా సహజత్వం మరింత పెరిగింది.

కాన్సెప్ట్.. ఇందులోని పాత్రల్ని రిలేట్ చేసుకునే వాళ్లకు.. కథను చెప్పడంలో భిన్నంగా సాగే తరుణ్ భాస్కర్ శైలిని ఇష్టపడే వాళ్లకు‘ఈ నగరానికి ఏమైంది’ బాగా నచ్చేయొచ్చు. అదే సమయంలో కొంతమందికి ఏంటీ సోది అని కూడా అనిపించవచ్చు. ‘పెళ్ళిచూపులు’లో ప్రధాన పాత్రల్ని చాలా బలంగా తీర్చిదిద్ది.. ఆ పాత్రల వ్యక్తిత్వాల్ని ఎస్టాబ్లిష్ చేయడంలోనూ ప్రత్యేకత చూపించాడు తరుణ్. ఆ పాత్రల్ని మెజారిటీ ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. అందులో కథ కూడా బలంగా కనిపిస్తుంది. వీటితో పాటు మరికొన్ని విషయాల్లోనూ ‘పెళ్ళిచూపులు’తో పోలిస్తే ‘ఈ నగరానికి ఏమైంది’ కొన్ని మెట్లు దిగువనే ఉంటుంది.

తరుణ్ తన సొంత కథను చెప్పాలనుకోవడం వల్లో ఏమో ఇందులో డ్రామా ఏమీ లేకపోయింది. ఇందులో చెప్పుకోదగ్గ కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా ఏమీ లేదు. పాత్రలకు చెప్పుకోదగ్గ క్యారెక్టరైజేషన్ లేదు. అసలిందులో కథేంటి అన్నది వెతుక్కోవాల్సిందే. నలుగురు కుర్రాళ్ల జీవితాల్లోని కొన్ని దశల్ని సరదాగా అలా చూపించినట్లుందంతే. నచ్చింది చేయడంలో ఉండే ఆనందం మరెందులోనూ ఉండదనేది ఈ సినిమా కోర్ పాయింట్. కానీ దాన్ని అనుకున్నంత బలంగా చెప్పలేకపోయాడు తరుణ్. పతాక సన్నివేశాల్లో ఈ విషయాన్ని చెబుతుంటే కొంచెం కృత్రిమంగా అనిపిస్తుంది తప్ప.. రావాల్సినంత ఫీల్ రాదు. సినిమాలో లవ్ స్టోరీ గురించి చెప్పడానికేమీ లేదు. ప్రధానంగా కామెడీనే హైలైట్ అయింది. ప్రథమార్ధం వరకు వేగంగానే సాగిపోయే ‘ఈ నగరానికి ఏమైంది’ ద్వితీయార్ధం నెమ్మదిస్తుంది. ప్రిక్లైమాక్స్ నుంచి పుంజుకుని ముగింపులో మెప్పిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే యూత్ ఎంజాయ్ చేయదగ్గ టైంపాస్ కామెడీకి ఢోకా లేని సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’.

నటీనటులు:

ప్రధాన పాత్రధారులు నలుగురూ బాగా చేశారు. ‘వెళ్ళిపోమాకే’ ఫేమ్ విశ్వక్సేన్.. తొలి సినిమాతో పోలిస్తే ఇందులో భిన్నంగా కనిపించాడు. అతడి లుక్.. యాక్టింగ్ అన్నీ మెప్పిస్తాయి. అతడి కంటే కూడా మెప్పించేది అభినవ్ గోమఠం. ప్రతి సీన్లోనూ అదరొట్టేశాడతను. టాలీవుడ్ కు మరో మంచి కమెడియన్ దొరికాడు అతడి రూపంలో. అతడి కామెడీ టైమింగ్ సూపర్బ్. ప్రియదర్శి తరహాలోనే అతను కూడా బాగా క్లిక్కయ్యాడు. సినిమాలో చాలా త్వరగా అతడికి అలవాటు పడిపోతాం. సుశాంత్ రెడ్డి.. వెంకటేష్ కాకుమాను కూడా బాగా చేశారు. హీరోయిన్లు అనీషా ఆంబ్రోస్.. సిమ్రన్ పర్వాలేదు. మిగతా వాళ్లూ ఓకే.

సాంకేతికవర్గం:

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ‘పెళ్ళిచూపులు’ రేంజ్ ఔట్ ఇవ్వలేకపోయాడు. ఈ సినిమాలో సంగీతానికి అంత ప్రాధాన్యం కూడా లేకపోయింది. ఉన్న రెండు మూడు పాటలు బాగానే ఉన్నాయి కానీ.. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా అయితే లేవు. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లుగా బాగా కుదిరింది. నికేత్ బొమ్మి ఛాయాగ్రహణం భిన్నంగా అనిపిస్తుంది. ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్.. మరోసారి అర్బన్ యూత్ కు బాగా కనెక్టయ్యే సినిమా తీశాడు. కానీ మిగతా వర్గాల గురించి మరిచిపోయాడు. ‘పెళ్ళిచూపులు’ తరహాలో అతను ఈ సినిమా విషయంలో కసరత్తు చేయలేదనిపిస్తుంది. తాను రాసిన ఫస్ట్ వెర్షనే నిర్మాత సురేష్ బాబుకు నచ్చేసిందని.. దాన్నే సినిమాగా తీసేయమని చెప్పాడని అన్నాడు తరుణ్. అక్కడే తప్పు జరిగిందేమో. ఈ స్క్రిప్టుపై మరోసారి కూర్చుని ఫైన్ ట్యూన్ చేస్తే ఇంకొంచెం బెటర్ గా అనిపించేదేమో.

చివరగా: ఈ నగరానికి ఏమైంది.. ఫన్ ఉంది ఫీల్ మిస్సయింది

రేటింగ్-2.75/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre