Begin typing your search above and press return to search.

మహానాయకుడికి మహా చిక్కులు!

By:  Tupaki Desk   |   19 Dec 2018 9:07 AM GMT
మహానాయకుడికి మహా చిక్కులు!
X
అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని అనే ఆత్రేయ గారి ఉపమానం ఎన్టీఆర్ బయోపిక్ కు అతకినట్టు సరిపోతుంది. మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక వాయిదా ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉన్న తరుణంలో బాలయ్యకు మరో చిక్కొచ్చి పడేలా ఉంది. ఎన్టీఆర్ రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కథానాయకుడు జనవరి 9నే వస్తుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆ మేరకు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ల దగ్గరి నుంచి లోకల్ బయ్యర్ల దాకా అందరికి సమాచారం వెళ్లిపోయింది.

కానీ మహానాయకుడు విషయమే ఎటూ తేలడం లేదు. మరోపక్క వైఎస్ ఆర్ కథతో రూపొందిన యాత్ర ఫిబ్రవరి 8ని లాక్ చేసుకుంది. దాని కన్నా ఒక్క రోజు ముందు అంటే 7నే మహానాయకుడు రిలీజ్ చేయాలనే ఆలోచన ఉంది కానీ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. క్రిష్ టీమ్ కు మాత్రం రెండో వారం లేదా మూడో వారం మహానాయకుడు విడుదల చేయాలనే ఆలోచన ఉందట. అయితే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రకటన ఫిబ్రవరి మూడో వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయన్న వార్త యూనిట్ ని టెన్షన్ లో పెడుతోంది. ఎందుకంటే ప్రకటన వచ్చాక ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.టిడిపి వ్యవస్థాపకుడి సినిమా కాబట్టి ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు ప్రదర్శనలు ఆపాల్సి రావొచ్చు.

యాత్ర అప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుని ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్యా లేదు. అయితే మహానాయకుడు ఆలస్యంగా వస్తే వసూళ్లు పోయి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని ఏ డేట్ ఫిక్స్ చేస్తారన్నది సస్పెన్స్ గా మారింది. ముందు అనుకున్న జనవరి 25 ఇప్పుడు చేయి దాటి పోయింది. మిస్టర్ మజ్ను-118-మణికర్ణికలు దాదాపు ఫిక్స్ అయిపోగా సంక్రాంతికి పెట్టా రాకపోతే అది కూడా ఆ డేట్ కే దాడి చేస్తుంది. మరి ఫైనల్ గా మహానాయకుడి సందిగ్దత ఎప్పుడు తొలగుతుందో చూడాలి.