Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : భావోద్వేగాలతో కూడిన పొలిటిక‌ల్ డ్రామా 'జోహార్'..!

By:  Tupaki Desk   |   29 July 2020 1:30 AM GMT
ట్రైలర్ టాక్ : భావోద్వేగాలతో కూడిన పొలిటిక‌ల్ డ్రామా జోహార్..!
X
తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' ఇతర ఓటీటీలతో పోటీ పడే ప్రయత్నంలో కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తోంది. ఇప్పటికే 'రన్' 'భానుమ‌తి అండ్ రామ‌కృష్ణ‌' 'కృష్ణ అండ్ హిజ్ లీల' వంటి చిత్రాల‌ను ప్రేక్ష‌కుల‌ను అందించింది 'ఆహా' ఇప్పుడు ''జోహార్'' అనే సినిమాని విడుదల చేస్తోంది. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగ‌స్ట్ 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా ''జోహార్'' ట్రైలర్ విడుదల చేసారు. నాలుగు కథలు ఒక కీలకమైన నిర్ణయంతో ఘర్షణ పడతాయంటూ ఈ ట్రైలర్ ని షేర్ చేసారు వరుణ్ తేజ్.

కాగా 'జీవితాలనే కథగా చెప్తా వినండి' అంటూ స్టార్ట్ అయిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. 'ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టైనా సరే మా నాన్న విగ్రహం కట్టిస్తాను' వంటి డైలాగ్స్ తో పొలిటికల్ టచ్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. మొత్తం మీద ట్రైలర్ చూస్తుంటే భావోద్వేగాల కలయికలో పొలిటిక‌ల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కిందని అర్థం అవుతోంది. ''జోహార్'' చిత్రం ద్వారా తేజ మార్ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ధర్మ సూర్య పిక్చర్స్ బ్యానర్ పై భాను సందీప్ మార్ని ఈ సినిమాను నిర్మించారు. నైనా గంగూలీ - ఎస్తేర్ అనిల్ - చైతన్య కృష్ణ - అంకిత్ కొయ్యా - శుభలేఖ సుధాకర్ - రోహిణి - నీరజ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి ప్రియదర్శన్ సంగీతం సమకూర్చగా జగదీశ్ చీకటి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. స్వాతంత్ర్యదినోత్సవం కానుకగా రిలీజ్ కానున్న ''జోహార్'' ఆహాకి మంచి క్రేజ్ ని తీసుకొస్తుందేమో చూడాలి.