Begin typing your search above and press return to search.

నాగ శౌర్య పాట 'ఏముంది రా'

By:  Tupaki Desk   |   4 May 2022 11:40 AM GMT
నాగ శౌర్య పాట ఏముంది రా
X
యువ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ''కృష్ణ వ్రింద విహారి''. ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ ఆర్ కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో షెర్లీ సెటియా హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది.

'కృష్ణ వ్రింద విహారి' చిత్రాన్ని మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి.

అలానే మ్యూజికల్ ప్రమోషన్స్‌ లో భాగంగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ 'వర్షంలో వెన్నెల' ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన ఈ మెలోడీ నంబర్ లో నాగ శౌర్య మరియు షిర్లీ సెటియా మధ్య రాకింగ్ కెమిస్ట్రీని చూశాం.

ఈరోజు బుధవారం 'ఏముంది రా' అనే రెండో పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'ఏముంది రా.. ఈ అద్భుతాన్ని చూడు.. మారింది రా.. అందం చరిత్ర నేడు..' అంటూ సాగిన ఈ సాంగ్ శ్రోతలను అలరిస్తోంది.

మహతి స్వర సాగర్ స్వరపరిచిన ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ ను సింగర్ హరిచరణ్ ఆలపించారు. కథానాయకుడు తన ప్రేయసి అందాన్ని వర్ణిస్తున్నట్లు గీత రచయిత హర్ష సాహిత్యం అందించారు.

ఇందులో బ్రాహ్మణ యువకుడైన శౌర్య.. మోడ్రన్ గర్ల్ షిర్లీని అగ్రహారానికి తీసుకువస్తాడు. అక్కడ ఆమె చీరలో సాంప్రదాయ బ్రాహ్మణ అమ్మాయిగా ముస్తాబవుతుంది. ఈ పాటలో హల్దీ ఫంక్షన్ నుండి మొదలుకొని ఇద్దరూ పెళ్లి చేసుకోవడం.. చాలా మంది పిల్లలు పుట్టడం వరకు వారి జీవితంలోని ఉత్తమమైన క్షణాలను చూపుతుంది.

వైబ్రెంట్ విజువల్స్‌ తో కూడిన ఈ పాటకు డ్యాన్స్ మాస్టర్ విజయ్ బెన్నీ కొరియోగ్రఫీ నీట్ గా ఉంది.. హుక్ స్టెప్ ఆకర్షణీయంగా ఉంది. శౌర్య మరియు షైర్లీ ఇద్దరూ విభిన్నమైన కాస్ట్యూమ్స్ లో అందంగా కనిపిస్తున్నారు.

'కృష్ణ వ్రింద విహారి' సినిమాలో అలనాటి నటి రాధిక శరత్‌ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - సత్య - బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.

శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. MNS గౌతమ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించగా.. తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రామ్‌ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.