Begin typing your search above and press return to search.

'ఎనిమీ' టీజర్: స్నేహితులైన విశాల్ - ఆర్య విరోధులుగా మారి ఫైట్ చేస్తే..!

By:  Tupaki Desk   |   24 July 2021 3:12 PM GMT
ఎనిమీ టీజర్: స్నేహితులైన విశాల్ - ఆర్య విరోధులుగా మారి ఫైట్ చేస్తే..!
X
తమిళ స్టార్ హీరోలైన విశాల్ - ఆర్య కలిసి నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''ఎనిమీ''. ఇది విశాల్‌ కు 30వ చిత్రం కాగా.. ఆర్యకు 32వ సినిమా. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ‘గద్దల కొండ గణేష్‌’ ఫేమ్ మృణాళిని రవి హీరోయిన్‌ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేయబడిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'ఎనిమీ' చిత్రానికి సంబంధించిన తెలుగు తమిళ హిందీ టీజర్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

'ఎనిమీ' టీజర్ లో విశాల్ ను హీరోగా.. ఆర్య విలన్ గా చూపించారు. జైలు నుంచి తప్పించుకున్న ఖైదీగా ఆర్య కనిపిస్తుంటే.. అతన్ని పట్టుకోవాలని చూసే పోలీస్ ఆఫీసర్ గా విశాల్ కనిపిస్తున్నాడు. ఇద్దరూ స్నేహితులే అయినప్పటికీ, కొన్ని పరిస్థితుల వల్ల విరోధులుగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఫైట్ సీన్స్.. భారీ యాక్షన్ సీక్వెన్సులు - ఛేజింగ్ సన్నివేశాలతో నిండిన ఈ యాక్షన్ పాకెడ్ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఇందులో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ - హీరోయిన్ మమతా మోహన్ దాస్ కీలక పాత్రల్లో కీలక పాత్రలు పోషించగా.. తంబి రామయ్య - కరుణాకరన్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. 'ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే' అని ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. స్నేహితులైన విశాల్ - ఆర్య శత్రువులుగా ఎలా మారారు?, దీని వెనకున్న అసలు కథేమిటి? అనేది తెలియాలంటే 'ఎనిమీ' సినిమా విడుదలయ్య వరకు ఆగాల్సిందే.

'ఎనిమీ' సినిమాని భారీ బడ్జెట్ తో చాలా రిచ్ గా రూపొందించారని తెలుస్తోంది. దీనికి ఎస్.ఎస్‌ థమన్ సాంగ్స్ కంపోజ్ చేయగా.. శ్యామ్ సీఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. సినిమాటోగ్రాఫర్ ఆర్‌డి రాజశేఖర్ అందించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ చిత్రానికి రేమాండ్ డేర్రిక్ క్రాస్తా ఎడిటింగ్ వర్క్ చేయగా.. రవి వర్మ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. మినీ స్టూడియోస్‌ పతాకంపై వినోద్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్‌ మొత్తం కంప్లీట్ చేసుకున్న 'ఎనిమీ' చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగు తమిళం హిందీతో పాటుగా మరికొన్ని ఇతర భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. బాలా దర్శకత్వంలో 'వాడు - వీడు' సినిమాలో కలిసి నటించిన విశాల్ - ఆర్య.. పదేళ్ల తర్వాత మళ్ళీ 'ఎనిమీ' చిత్రంలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఇద్దరు హీరోలకు ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.