Begin typing your search above and press return to search.

రేవంత్ ఒక్క‌డు త‌ప్ప వాళ్లంతా టీఆర్ ఎస్‌ లోకిః ఎర్ర‌బెల్లి

By:  Tupaki Desk   |   5 Oct 2017 4:49 PM GMT
రేవంత్ ఒక్క‌డు త‌ప్ప వాళ్లంతా టీఆర్ ఎస్‌ లోకిః ఎర్ర‌బెల్లి
X
తెలంగాణ‌లో మ‌రోమారు జంపింగ్‌ల‌ ప‌ర్వం కొన‌సాగ‌నుందా? ఇప్ప‌టికే చిక్క శ‌ల్య‌మై పోయిన తెలంగాణ తెలుగుదేశం పార్టీలో మ‌రిన్ని వికెట్లు రాలిపోనున్నాయా? ఇక ఆ పార్టీలో మిగిలేది తెలంగాణ టీడీపీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ఒక్క‌రేనా? అంటే అవున‌నే చెప్తున్నారు ఆ పార్టీ త‌ర‌ఫున గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియ‌ర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు.

ఒకింత గ్యాప్‌ త‌ర్వాత తెలంగాణ స‌చివాల‌యానికి వ‌చ్చిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు త‌న‌ను క‌లిసిన మీడియా మిత్రుల‌తో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల ఏపీ మంత్రి ప‌రిటాల సునీత త‌న‌యుడు ప‌రిటాల శ్రీ‌రామ్ వివాహానికి అనంత‌పురం వెళ్లిన సంద‌ర్భంగా జ‌రిగిన ప‌రిణామాలు, తెలంగాణ‌లో టీడీపీ భ‌విష్య‌త్‌ - టీఆర్ ఎస్ పార్టీ రాజ‌కీయం వంటి ప‌లు అంశాల‌పై స‌వివ‌రంగా మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆంధ్రప్రదేశ్‌లోనూ క్రేజ్‌ ఉందని అన్నారు. అనంతపురం ప‌ర్య‌ట‌న‌లో ఇది స్ప‌ష్ట‌మైంద‌ని చెప్పారు. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్‌, ఎమ్మెల్యే బీకే పార్థసార‌ధితో సీఎం కేసీఆర్ భేటీలో ప్ర‌త్యేక‌త ఏమీ లేద‌ని చెప్పారు. అనంత‌పురం జిల్లాకు సీఎం కేసీఆర్ ఇంచార్జీ మంత్రిగా పనిచేసిన నాటి ప‌రిచ‌యాల వ‌ల్ల వారు ముచ్చ‌టించుకున్నార‌ని ఎర్ర‌బెల్లి వివ‌రించారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ‌లో టీడీపీకి భ‌విష్య‌త్ లేద‌ని ఎర్ర‌బెల్లి తెలిపారు. టీడీపీ సీనియర్‌ నేతలు ఎల్‌.రమణ - మోత్కుపల్లి నర్సింహులు - రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అంతా టీఆర్‌ ఎస్‌ వైపే ఉన్నారని ఎర్ర‌బెల్లి జోస్యం చెప్పారు. టీ.టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ఒక్కరే కాంగ్రెస్‌ వైపు ఉన్నారని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఎద్దేవా చేశారు. భ‌విష్య‌త్తుల్లో మ‌రికొంద‌రు నేత‌లు టీఆర్ ఎస్‌ లో చేర‌నున్నార‌ని జోస్యం చెప్పారు.