Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఈటి (ఎవరికీ తలవంచడు)

By:  Tupaki Desk   |   10 March 2022 9:54 AM GMT
మూవీ రివ్యూ :  ఈటి (ఎవరికీ తలవంచడు)
X
చిత్రం : ఈటి (ఎవరికీ తలవంచడు)

నటీనటులు: సూర్య-ప్రియాంక మోహన్-సత్యరాజ్-శరణ్య మోహన్-వినయ్ రాయ్-దేవదర్శిని-సూరి తదితరులు
సంగీతం: డి.ఇమాన్
ఛాయాగ్రహణం: రత్నవేలు
నిర్మాణం: సన్ పిక్చర్స్
రచన-దర్శకత్వం: పాండిరాజ్

ఒకప్పుడు తెలుగులో మంచి మార్కెట్ ఉండి.. సరైన సినిమాలు చేయగా.. ఆ మార్కెట్ ను బాగా దెబ్బ తీసుకున్న కథానాయకుడు సూర్య. చివరగా అతను చేసిన రెండు సినిమాలు ఆకాశం నీ హద్దురా.. జై భీమ్.. నేరుగా ఓటీటీల్లో విడుదలై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఇప్పుడతను ‘ఈటి’ (ఎవరికీ తలవంచడు) చిత్రంతో థియేటర్లలోకి దిగాడు. ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కృష్ణమోహన్ (సూర్య) ఒక పల్లెటూరిలో ఎంతో గౌరవంగా బతికే కుటుంబంలో లాయర్. చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరే ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకుని ఆదుకునే అతను.. ఆడపిల్లలెవరైనా కష్టంలో ఉంటే మరింతగా స్పందిస్తాడు. ఐతే అతడి పక్క ఊరిలో ఉండే వ్యాపారవేత్త అయిన కామేష్ (వినయ్ రాయ్).. కృష్ణమోహన్ ఊరికి చెందిన అమ్మాయిలను తన గ్యాంగ్ ద్వారా ఏదో ఒకలా లొంగదీసుకుని వారి ప్రైవేట్ వీడియోలన్నీ సేకరించి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతుంటాడు. తనకు సన్నిహితులైన ఓ కుటుంబం కామేష్ బ్లాక్ మెయిలింగ్ కు బలైపోవడంతో అతడి సంగతేంటో చూడాలని కృష్ణమోహన్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో కామేష్ నుంచి కృష్ణ మోహన్ కు ఎదురైన సవాళ్లేంటి.. చివరికి తాను అనుకున్నది కృష్ణమోహన్ సాధించాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

రెండు వారాల కిందటే ‘వలిమై’ అనే తమిళ అనువాద చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ సన్నివేశాలను మినహాయిస్తే ఏముంది ఈ సినిమాలో? ఇంకెన్నాళ్లీ రొటీన్ కథాకథనాలు.. సెంటిమెంట్ డ్రామా? అంటూ మన వాళ్లు దాన్ని తిప్పి కొట్టారు. కానీ తమిళంలో ‘వలిమై’ రెండొందల కోట్ల దాకా వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ రేంజికి వెళ్లింది. ఒకప్పుడు మన వాళ్లలా ఇప్పుడు తమిళ ఫిలిం మేకర్స్-ప్రేక్షకుల వరదలో కొట్టుకుపోతున్నారనడానికి ఇది రుజువు. ఈ వరుసలో వచ్చిన కొత్త చిత్రం.. ఈటి (ఎవరికీ తలవంచడు). ఎక్కువగా వైవిధ్యం కోసం తపించే సూర్య.. ఓటీటీలో రిలీజైన ‘ఆకాశం నీ హద్దురా’.. ‘జై భీమ్’ చిత్రాలతో తన మార్కు చూపించాడు కానీ.. ఈసారి మాత్రం అతనూ మూసలోకే దిగిపోయాడు. అమ్మాయిలపై జరిగే లైంగిక వేధింపులకు సంబంధించి ఈ చిత్రానికి ఎంచుకున్న నేపథ్యం కాస్త భిన్నంగానే అనిపించినా.. మిగతా వ్యవహారమంతా రొటీనే. ఈ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథాకథనాలు అంత ఆసక్తికరంగా.. అర్థవంతంగా లేకపోవడం పెద్ద మైనస్ అయింది. ప్రేక్షకులను ఒక అలజడికి గురి చేస్తూ హడావుడిగా.. గందరగోళంగా సాగే కథనం ‘ఈటి’ నీరుగారిపోయేలా చేసింది.

‘ఈటి’ కథ నడిచేదేమో రెండు పల్లెటూళ్ల మధ్య. ఆ రెండు ఊర్ల మధ్య కొన్ని గొడవలుంటాయి. హీరో పంచెకట్టుతో కనిపిస్తుంటాడు. పెళ్ళిళ్ళు.. జాతరలు అంటూ.. ఒక రూరల్ డ్రామా చూడబోతున్న ఫీలింగ్ కలిగిస్తారు ఒక దశ వరకు. కానీ అవతలి వైపు విలన్ చూస్తే దీనికి భిన్నంగా ఉంటాడు. చాలా పోష్ గా కనిపిస్తూ వందల కోట్లలో బిజినెస్ డీల్స్ చేస్తుంటాడు. అలాంటి విలన్ కు.. పల్లెటూరి వాడిలా కనిపించే హీరోకు మధ్య శతృత్వం రావడానికి చూపించే పాయింటే అసలు సింక్ కానట్లుగా అనిపిస్తుంది. రెండు ఊర్ల మధ్య గొడవ ఉంటే.. ఒక ఊరికి చెందిన విలన్ అతడి గ్యాంగ్.. అవతలి ఊరిలో ఉన్న ప్రతి ఇంట్లోనూ అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్ల వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తారని చూపిస్తారు. ఐతే ఓ పది మందో ఇరవై మందో అంటే ఓకే కానీ.. తమ ఊరికి శతృత్వం ఉన్న ఊరి అబ్బాయిలకు ఈ ఊరిలో ఉన్న 500 కుటుంబాల్లో ప్రతి అమ్మాయీ లొంగిపోవడం.. వాళ్ల బ్లాక్ మెయిలింగ్ కు గురి కావడమేంటో అర్థం కాదు. నిజానికి ఈ ప్రైవేట్ వీడియోల వ్యవహారం గ్లోబల్ ప్రాబ్లెం. దాని చుట్టూ ఒక కథను చెప్పాలనుకున్నపుడు దాని పరిధి చాలా విస్తృతంగా ఉండాలి. సమస్యను లోకలైజ్ చేసి దాని చుట్టూ ఒక గ్రామం పరిధిలో చూపించడంతో.. తెరపైన జరిగే నమ్మశక్యంగా అనిపించదు. ఈ కథతో.. పాత్రలతో ఎమోషనల్ కనెక్ట్ అనేది ఏర్పడదు. అటు విలన్.. ఇటు హీరో.. ఇద్దరి పాత్రలూ ఎలివేట్ కాని పరిస్థితి తలెత్తింది.

ఒక కథలో ప్రేక్షకుడు ఇన్వాల్వ్ కావడంలో ఆరంభ సన్నివేశాలు.. పాత్రల ఎస్టాబ్లిష్మెంట్ చాలా కీలకం. కానీ ‘ఎవరికీ తలవంచడు’ ఆరంభ సన్నివేశాలే తేలిపోయాయి. ఇటు హీరో.. అటు విలన్ పాత్రల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారో అర్థం కాని అయోమయం తలెత్తుతుంది. ముందుగా హీరో ఫ్యామిలీ.. ఆ తర్వాత హీరోయిన్ కుటుంబాన్ని రంగంలోకి దించి లైటర్ వీన్లో కామెడీ చేయించడానికి పాండిరాజ్ ప్రయత్నించాడు కానీ.. అవి చాలా సిల్లీగా తయారయ్యాయి. మరీ సీరియల్ ను తలపించేలా ఉన్న కొన్న సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. ఇక రెండు ఊర్ల మధ్య గొడవలు.. మహిళా ఉత్సవం.. హోమం అంటూ.. చూపించే సన్నివేశాల్లో తమిళ వాసనలు గుప్పుమంటాయి. వీటితో అసలే కనెక్ట్ కాలేం. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ పూర్తిగా తేలిపోయింది. ఎంత త్వరగా ఈ ప్రేమకథ.. ఫ్యామిలీ సీన్స్ పక్కకు వెళ్లిపోయి హీరో-విలన్ క్లాష్ చూపిస్తారా అని ఎదురు చూసేలా చేస్తుంది ప్రథమార్ధం. విరామ సమయానికి దర్శకుడు ఆ విషయంపై దృష్టిపెట్టాడు.

ఐతే ద్వితీయార్ధంలో కూడా ‘ఈటి’ పెద్దగా పుంజుకున్నది లేదు. హీరో-విలన్ మధ్య పోరు మొదలయ్యాక ఎత్తులు పై ఎత్తులతో కొన్ని సన్నివేశాలు పర్వాలేదనిపిస్తాయి. కానీ ముందే అన్నట్లు ‘ప్రైవేటు వీడియోలు’ అనే గ్లోబల్ ప్రాబ్లెం బాగా లోకల్ స్థాయికి తీసుకొచ్చేయడంతో ఈ కథతో కనెక్ట్ కాలేని పరిస్థితి తలెత్తుతుంది. విలన్ పాత్రే తేలిపోవడంతో ఇక హీరో పాత్ర కూడా పెద్దగా ఎలివేట్ కావడానికి అవకాశం లేకపోయింది. సూర్య తన పెర్ఫామెన్స్ తో ఎంతగా ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కూడా అతడి పాత్ర అనుకున్నంత ఇంపాక్ట్ వేయలేదు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మినహాయిస్తే ద్వితీయార్ధం కూడా ప్రత్యేకంగా అయితే అనిపించదు. ఒక దశలో కాస్త మెరుగ్గా అనిపించే సినిమా.. పతాక సన్నివేశాలతో మళ్లీ పడకేస్తుంది. సుదీర్ఘంగా సాగే క్లైమాక్స్ విసుగెత్తిస్తుంది. ఆరంభం నుంచి కూడా ప్రతి సన్నివేశంలో హడావుడి.. గందరగోళం కనిపిస్తాయి తప్ప ఎక్కడా కథను ఒక తీరుగా చెప్పి ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి ప్రయత్నం జరగలేదు. సూర్య తప్ప సినిమా చూడ్డానికి కారణాలేమున్నాయంటే చెప్పడం కష్టం.

నటీనటులు:

ఏ పాత్ర ఇచ్చినా తన వంతుగా సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి దాన్ని పండించే ప్రయత్నం చేస్తాడు సూర్య. కృష్ణమోహన్ పాత్రను నిలబెట్టడానికి కూడా అతను శక్తి వంచన లేకుండా ప్రయత్నించాడు. కానీ దర్శకుడు ఆ పాత్రను సరిగా తీర్చిదిద్దకపోవడంతో అది అనుకున్నంతగా ఎలివేట్ కాలేదు. ఎమోషనల్ సీన్లలో సూర్య నటన ప్రత్యేకంగా కనిపిస్తుంది. హీరోయిన్ ప్రియాంక మోహన్ పర్వాలేదు. విలన్ పాత్రలో వినయ్ రాయ్ లుక్.. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటాయి. ఆరంభంలో ఆ పాత్ర భారీ అంచనాలు రేకెత్తిస్తుంది. కానీ తర్వాత రొటీన్ గా మారిపోతుంది. సత్యరాజ్ ను దర్శకుడు సరిగా వాడుకోలేదు. హీరో తల్లి పాత్రలో శరణ్య తనకు అలవాటైన రీతిలోనే నటించింది. కమెడియన్ సూరి కొన్ని చోట్ల నవ్వించాడు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతిక వర్గం:

డి.ఇమాన్ సంగీతం పూర్తిగా తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు సాగింది. మన వాళ్లు వాటితో కనెక్ట్ కావడం కష్టమే. డబ్బింగ్ పాటల ముద్ర అడుగడుగునా కనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. రత్నవేలు ఛాయాగ్రహణం ఓకే. విజువల్స్ బాగానే అనిపించినా.. తన ముద్రను చూపించే సన్నివేశాలేమీ ఇందులో కనిపించదు. సన్ పిక్చర్స్ వాళ్ల సినిమా కాబట్టి నిర్మాణ విలువలకేం ఢోకా లేదు. ఐతే తనకు కావాల్సిన వనరులన్నీ అత్యుత్తమ స్థాయిలోనే అందినా.. దర్శకుడు పాండిరాజ్ ఉపయోగించుకోలేకపోయాడు. అతను తీసుకున్న పాయింట్ బాగున్నా.. దానికి సరితూగే కథను.. కథనాన్ని తీర్చిదిద్దుకోలేకపోయాడు. అతడి నరేషన్ చాలా గందరగోళంగా సాగింది. రచయితగానే కాక దర్శకుడిగా పాండిరాజ్ మెప్పించలేకపోయాడు.

చివరగా: ఈటి.. ఎవరూ తట్టుకోలేరు

రేటింగ్-2/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre