Begin typing your search above and press return to search.

తల్లిపాత్రను పోషించే టైమొచ్చేసింది: 'సాహో' సుందరి

By:  Tupaki Desk   |   20 Nov 2021 8:30 AM GMT
తల్లిపాత్రను పోషించే టైమొచ్చేసింది: సాహో సుందరి
X
ఎవ్లీన్ శర్మ అనే పేరు చెప్పగానే ఎక్కడో విన్నట్టుగా ఉందే అని తెలుగు ప్రేక్షకులు అనుకుంటారు. తెలుగులో ఆమె చేసింది ఒకటే సినిమా గనుక, కాస్త ఆలోచన చేస్తే 'సాహో' సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రను పోషించిన విషయం గుర్తుకు వస్తుంది. ఆ సినిమా పరాజయంపాలు కావడం వలన .. పాత్రలు సరిగ్గా రిజిస్టర్ చేయకపోవడం వలన ఇప్పటివరకూ గుర్తుండటం కష్టమే. 'సాహో' సినిమాలో జెన్నిఫర్ పాత్రలో ఆమె నటించింది. ఆ ఎవ్లీన్ శర్మ ఇప్పుడు ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

ఆస్ట్రేలియాకు చెందిన ప్రవాస భారతీయుడు .. దంత వైద్యుడు 'తుషాన్ భిండి'తో కొంతకాలం క్రితం ఆమె వివాహమైంది. తాను ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చినట్టుగా సోషల్ మీడియా ద్వారా ఎవ్లీన్ శర్మ చెప్పింది. పాపకి 'అవభిండి' అనే పేరు పెట్టామనీ, ఇక నుంచి అమ్మ పాత్రను పోషించవలసి ఉంది అని పేర్కొంది. అన్ని పాత్రల కంటే అమ్మ పాత్రను పోషించడం చాలా కష్టమనీ, అలాంటి పాత్రను పోషించే సమయం ఆసన్నమైందని చెప్పింది. ఆ పాత్రకి న్యాయం చేయడానికి తాను సిద్ధమవుతున్నానని అంది. ఒక తల్లిగా తాను పొందుతున్న అనుభూతిని మాటల్లో చెప్పలేకపోతున్నానని రాసుకొచ్చింది.

జర్మనీకి చెందిన ఎవ్లీన్ హాలీవుడ్ సినిమాలతోనే తన కెరియర్ ను మొదలుపెట్టింది. అక్కడ సినిమాలు చేస్తూనే ఆమె బాలీవుడ్ అవకాశాల పట్ల కూడా ఆసక్తిని చూపుతూ వచ్చింది. 'ఫ్రమ్ సిడ్నీ విత్ లవ్' అనే సినిమాతో 2012లో ఆమె బాలీవుడ్ కి పరిచయమైంది. రణబీర్ - దీపిక జంటగా చేసిన 'యే జవాని హై దివాని' సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 'ఇషాక్' .. 'యారయాన్' .. 'మై తేరా హీరో' మొదలైన సినిమాలు ఆమెను బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత చేరువ చేశాయి. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకి 'సాహో' సినిమాలో అవకాశం దక్కింది.

ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో హీరోయిన్ తో పాటు చాలామంది బాలీవుడ్ ఆర్టిస్టులను తీసుకున్నారు. హాలీవుడ్ లుక్ తో బాలీవుడ్ లోను మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఎవ్లీన్ ను కూడా ఎంపిక చేసుకున్నారు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. బాలీవుడ్ సినీ ప్రముఖులతో ఆమెకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వాళ్లంతా కూడా అమ్మగా ప్రమోషన్ కొట్టేసిన ఎవ్లీన్ కి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.