Begin typing your search above and press return to search.

నేడు ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్ల భేటీ..!

By:  Tupaki Desk   |   27 Dec 2021 4:28 AM GMT
నేడు ఎగ్జిబిటర్స్ - డిస్ట్రిబ్యూటర్ల భేటీ..!
X
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరలు - థియేటర్ల తనిఖీల అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో మీద హైకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే విమర్శలు చేసారు.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల మీద జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి నిర్వహిస్తున్న సినిమా థియేటర్లను సీజ్ చేస్తున్నారు. సినిమా టికెట్‌ ధరలు అధికంగా అమ్మినా.. లైసెన్స్ రెన్యువల్‌ చేసుకోకపోయినా నోటీసులు జారీ చేస్తున్నారు. జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు మాత్రం స్వచ్ఛందంగా మూసివేశాయి.

ఈ నేపథ్యంలో నేడు సోమవారం రాజమండ్రిలో సినిమా ఎగ్జిబిటర్స్‌ - డిస్ట్రిబ్యూటర్లు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. టికెట్‌ ధరలు తగ్గింపు - థియేటర్ల నిర్వహణతో పాటు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ మీటింగ్ లో చర్చించనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అనేక థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. అలానే మరికొన్నిటికి ఫైన్ వేశారు. దీనిని నిరసిస్తూ ఇంకొన్ని థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా సినిమా హాళ్లను క్లోజ్ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో సినిమాలను ప్రదర్శించలేమంటూ మరికొందరు తాత్కాలికంగా థియేటర్లకు తాళాలు వేశారు.

ఇకపోతే సినిమా టికెట్ ధరల తగ్గింపు జీవో నెం.35 పై హైకోర్టులో విచారణ జరుగుతుంది. జీవోని రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. న్యాయస్థానంలో సినిమా టికెట్ల వ్యవహారంపై నేడు మరోసారి విచారణ జరగనుంది. రాబోయే రోజుల్లో పెద్ద సినిమాల విడుదలలు ఉన్నాయి కాబట్టి.. వీలైనంత త్వరగా ఈ సమస్య ఓ కొలిక్కి రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.