Begin typing your search above and press return to search.

బిజినెస్ 500 కోట్లు.. కలెక్షన్స్ 1000 కోట్లు!

By:  Tupaki Desk   |   14 Feb 2017 10:39 AM GMT
బిజినెస్ 500 కోట్లు.. కలెక్షన్స్ 1000 కోట్లు!
X
‘బాహుబలి: ది బిగినింగ్’ మీద తెలుగులో ఉన్నంత అంచనాలు వేరే భాషల్లో లేవు. అందులోనూ నార్త్ ఆడియన్స్ విడుదల సమయంలో ఈ సినిమా కోసం వేలం వెర్రిగా ఏమీ ఎగబడలేదు. అయినప్పటికీ ఆ చిత్రం రూ.200 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. విడుదల తర్వాత ఏకంగా రూ.600 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం సృష్టించింది. నేషనల్ వైడ్ అనేక రికార్డుల్ని బద్దలు కొట్టింది.

ఇక వర్తమానంలోకి వస్తే ‘బాహుబలి: ది కంక్లూజన్’ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన ప్రేక్షకులు ఎంత ఉత్కంఠగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారో నార్త్ ఆడియన్స్‌ దీ అదే పరిస్థితి. ప్రేక్షకుల్లో అంతకంతకూ అంచనాలు పెరిగిపోతుండటంతో ఈ సినిమా బిజినెస్ అనూహ్యమైన స్థాయికి చేరేలా కనిపిస్తోంది. అలాగే వసూళ్లు కూడా కనీ వినీ ఎరుగని స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నారు.

‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమాను హిందీలో రిలీజ్ చేసిన కరణ్ జోహార్.. హక్కుల కోసం నిర్మాతలకు ఇచ్చింది రూ.10 కోట్లేనని సమాచారం. ఆ సినిమా హిందీ వరకే వరల్డ్ వైడ్ రూ.150 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది. ఇందులో సగం షేర్ వచ్చి ఉన్నా కరణ్ జోహార్ ఏ స్థాయిలో లాభపడ్డాడో అంచనా వేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ‘బాహుబలి: ది కంక్లూజన్’ కోసం చాలా పెద్ద మొత్తంలోనే చెల్లించాడట కరణ్. ఆ మొత్తం రూ.120 కోట్లని సమాచారం. తొలి భాగంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మొత్తంగా కనిపించొచ్చు కానీ.. ‘బాహుబలి’ మీద ఉన్న అంచనాల ప్రకారం ఈ చిత్రం హిందీ వరకే కనీసం రూ.200 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టవచ్చని అంచనా.

ఆ మధ్య 2017లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏవంటూ దేశవ్యాప్తంగా సర్వే చేస్తే దాదాపు 60 శాతం మంది ‘బాహుబలి’కే ఓటేశారు. మిగతా సినిమాలన్నింటికీ కలిపి 40 శాతం ఓట్లే పడ్డాయి. ఈ ఆసక్తిని గమనించే ‘బాహుబలి: ది కంక్లూజన్’కు భారీగానే రేటు కట్టారు నిర్మాతలు. కరణ్ కూడా ఈ విషయంలో బెట్టు చేయకుండా డిమాండుకు తగ్గ రేటే ఇచ్చాడంటున్నారు. ఇదే రీతిలో మిగతా భాషల హక్కులు కూడా అనూహ్యమైన రేట్లు పలుకుతున్నాయి. తమిళ వెర్షన్ హక్కులు రూ.50 కోట్ల దాకా తెచ్చిపెట్టగా.. కర్ణాటకలో నేరుగా తెలుగు వెర్షన్ రిలీజ్ చేయడానికి రూ.45 కోట్ల దాకా పుచ్చుకున్నారట. కేరళలో మలయాళ వెర్షన్ రైట్స్ రూ.10 కోట్లు పలికాయి. ఇక తెలుగు రాష్ట్రాలు.. ఓవర్సీస్ కలిపి తెలుగు వెర్షన్ బిజినెస్ రూ.150 కోట్లను దాటుతోంది. కేవలం నైజాం హక్కుల్ని మాత్రమే రూ.50 కోట్లకు అమ్మారంటే ‘ది కంక్లూజన్’ రేంజేంటో అంచనా వేయొచ్చు. అన్ని భాషల శాటిలైట్ రైట్స్.. ఇతర హక్కులు అన్నీ కలుపుకుంటే ‘బాహుబలి: ది కంక్లూజన్’ లెక్క ఈజీగా రూ.500 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. బాహుబలి నిర్మాతలు దాదాపుగా అన్ని ఏరియాలకూ బిజినెస్ క్లోజ్ చేసినట్లు సమాచారం.

‘బాహుబలి: ది బిగినింగ్’పై అంచనాలు ఓ మోస్తరుగా ఉండగానే ఆ చిత్రం రూ.600 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే.. ‘ది కంక్లూజన్’ మీద ఉన్న అసాధారణ అంచనాల నేపథ్యంలో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో చెప్పలేం. ఐతే రూ.1000 కోట్ల గ్రాస్ గ్యారెంటీ అన్నది ట్రేడ్ పండిట్ల అంచనా. దాన్ని దాటి ఇంకా ముందుకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే సమ్మర్ సీజన్లో పోటీయే లేకుండా.. మంచి టైమింగ్ చూసుకుని సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా రిలీజవ్వనంత భారీ స్థాయిలో ‘ది కంక్లూజన్’ రిలీజవబోతోంది. సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ, రాజకీయ, వ్యాపార దిగ్గజాల వరకు అందరూ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవాలని ఉత్కంఠతో ఉన్నారు. ఇండియాలో సినిమాను ఇష్టపడే ప్రతి ప్రేక్షకుడూ ఈ సినిమా చూస్తానడంలో సందేహం లేదు. కాబట్టి ‘ది కంక్లూజన్’ రూ.1000 కోట్ల మార్కును అందుకోవడం లాంఛనమే కావచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/