Begin typing your search above and press return to search.

బోయపాటిని తక్కువ అంచనా వేయకండోయ్..

By:  Tupaki Desk   |   10 Aug 2017 11:13 AM GMT
బోయపాటిని తక్కువ అంచనా వేయకండోయ్..
X
ఈ శుక్రవారం ఒకే రోజు మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. వీటిలో మిమ్మల్ని ఎక్కువ ఆకర్షిస్తున్నది ఏది అంటూ సోషల్ మీడియాలో పోల్స్ పెడుతున్నారు చాలా మంది. అందులో 80-90 శాతం ఓట్లు ‘నేనే రాజు నేనే మంత్రి’.. ‘లై’ సినిమాలకే పడుతుండటం విశేషం. ‘జయ జానకి నాయక’కు పది శాతానికి అటు ఇటు ఓట్లు పడుతున్నాయి. చాలా పోల్స్ లో ఫలితాలు ఈ రకంగానే వస్తున్నాయి. దీన్ని బట్టి ఆ రెండు సినిమాలకే క్రేజ్ ఎక్కువుందని.. బోయపాటి సినిమా మీద ఏమాత్రం ఆసక్తి లేదని అనుకుంటే పొరబాటే. ఫస్ట్ ఛాయిస్ గురించి అడిగినపుడు.. ఆ రెండు సినిమాలకు ప్రయారిటీ ఇచ్చినంత మాత్రాన ‘జయ జానకి నాయక’ను చూడరని అనుకుంటే పొరబాటే.

మూడు రోజుల వీకెండ్.. ఆ తర్వాత రెండు రోజుల సెలవులు.. కాబట్టి సినీ ప్రియులు ఏ ఒక్క సినిమాకో పరిమితం అయిపోరు. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటంలో ప్రయారిటీలు భిన్నంగా ఉండొచ్చు. కానీ మధ్యాహ్నానికి ఈ మూడు సినిమాల టాక్ బయటికి వచ్చాక పరిస్థితి వేరేలా ఉంటుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో పోల్స్ ను బట్టి జనాల ఆసక్తిపై ఒక అంచనాకు వచ్చేయడానికి కూడా లేదు. బోయపాటి సినిమాపై మాస్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. వాళ్లలో ఎక్కువమంది సోషల్ మీడియాలో ఉండరు. కాబట్టి బోయపాటి సినిమాను తక్కువ అంచనా వేస్తే కష్టమే. ‘నేనే రాజు నేనే మంత్రి’.. ‘లై’ సినిమాలు ప్రయోగాత్మకమైనవి. వీటితో కొంచెం రిస్క్ ఉంది. వాటి ఫలితాలపై ముందే ఓ అంచనాకు వచ్చేయలేం. కానీ ‘జయ జానకి నాయక’ బోయపాటి సినిమా కాబట్టి ఒక అంచనా పెట్టుకోవచ్చు. బోయపాటి అంటే మినిమం గ్యారెంటీ అని ఉంటుంది. కమర్షియల్ అంశాలతో పాస్ మార్కులు పడిపోయేలా చేయడంలో బోయపాటి దిట్ట. కాబట్టి బోయపాటి సినిమాను తక్కువగా లెక్క వేస్తే కష్టం.