Begin typing your search above and press return to search.

విడుద‌ల‌ల్లో ప్ర‌యోగం.. డైరెక్ట్ టీవీలో రిలీజ్!

By:  Tupaki Desk   |   6 Sep 2021 4:50 AM GMT
విడుద‌ల‌ల్లో ప్ర‌యోగం.. డైరెక్ట్ టీవీలో రిలీజ్!
X
డైరెక్టుగా టీవీల్లో రిలీజ్ చేయ‌డం.. గ‌త ద‌శాబ్దంన్న‌ర‌గా ఇలాంటి ప్ర‌యోగం గురించి ఊహ‌గానాలున్నాయి. థియేట‌ర్ల విడుద‌ల హ‌క్కుల‌తో పోలిస్తే టీవీ రైట్స్ కూడా రికార్డు స్థాయి ధ‌ర‌లు ప‌లుకుతున్న‌ప్ప‌టి నుంచి ఈ ఊహాగానాలు అప్పుడ‌ప్పుడు ఏర్ప‌డుతున్నాయి. అప్పుడెప్పుడో త‌మిళ‌నాట క‌లైంజ‌ర్ టీవీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ర‌జ‌నీకాంత్ శివాజీ సినిమాను డైరెక్టు టీవీ రిలీజ్ జ‌రుగుతుంద‌నే ఊహాగానాలు వినిపించాయి.

స‌న్ నెట్ వ‌ర్క్ తో విబేధాల‌తో క‌రుణానిధి కుటుంబం సొంతంగా టీవీ నెట్ వ‌ర్క్ ను ప్రారంభించింది. ఆ స‌మ‌యంలో వాటి ప్రారంభోత్స‌వానికి ఊపు తీసుకురావ‌డానికి అప్పుడు విడుద‌ల‌కు రెడీగా ఉన్న ర‌జనీకాంత్ సినిమా శివాజీని క‌లైంజ‌ర్ టీవీలో విడుద‌ల రోజే ప్ర‌సారం చేస్తారంటూ ఊహాగానాలు వ‌చ్చాయి. అయితే ఆ ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం కాలేదు. శివాజీ థియేట‌ర్ల‌లో మాత్ర‌మే విడుద‌ల అయ్యింది.

ఆ త‌ర్వాత కొన్నేళ్ల‌కు క‌మ‌ల్ హాస‌న్ అలాంటి ప్ర‌యోగాన్ని అనౌన్స్ చేశాడు కూడా. త‌న సినిమా ఒక‌దాన్ని డీటీహెచ్ ల‌లో విడుద‌ల చేస్తానంటూ క‌మ‌ల్ ప్ర‌క‌టించాడు. డీటీహెచ్ ల‌లో ఆన్ లైన్ స‌బ్ స్క్రిప్ష‌న్ ద్వారా ఆ సినిమాను చూడొచ్చంటూ క‌మ‌ల్ ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న దాన్ని క‌మ‌ల్ ముందుగానే ఆచ‌రించ‌బోయాడు. అయితే.. అప్పుడు అనేక మంది దాన్ని ఆక్షేపించారు. క‌మ‌ల్ సినిమా థియేట‌ర్ల‌కు రావాల్సిందే అన్నారు. ఆ ఒత్తిడికి క‌మ‌ల్ కూడా డైరెక్ట్ టీవీ రిలీజ్ చేయ‌లేక‌పోయాడు.

ఆ త‌ర్వాత త‌మిళంలో చేర‌న్ ఇలాంటి ప్ర‌యోగం ఏదో చేస్తాన‌న్నాడు. అది విడుద‌ల‌య్యిందో లేదో కానీ.. విజ‌య‌వంతం అయితే కాలేదు. అయితే క‌రోనాతో మొత్తం క‌థ మారింది. ఇప్పుడు టీవీ చాన‌ళ్ల‌ వాళ్లు అడిగితే కొన్ని సినిమాలు డైరెక్టు టీవీ విడుద‌ల‌కు సై అంటున్నాయి. ఈ క్ర‌మంలో.. తమిళంలో ఒక సినిమా ఇలానే విడుద‌ల అవుతోంది.

విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన తుగ్ల‌క్ ద‌ర్భార్ అనే సినిమా అక్క‌డ ముందుగా స‌న్ టీవీలో ప్ర‌సారం అవుతోంది. థియేట‌ర్ల‌లో ఈ సినిమా విడుద‌ల కావ‌డం లేదు. తొలి రోజే టీవీలో ప్ర‌సారం కాబోతోంది. ఆ త‌ర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంచుతార‌ట‌. ఇలా క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో థియేట‌ర్ల‌లో విడుద‌ల‌కు సాహ‌సం చేయ‌లేని ఒక సినిమా హ‌క్కుల‌ను డైరెక్టుగా టీవీ చాన‌ల్ వాళ్ల‌కు అమ్మేసిన‌ట్టుగా ఉన్నారు. అనేక సినిమాలో ఓటీటీల్లో మాత్ర‌మే విడుద‌ల అవుతున్న నేప‌థ్యంలో.. అందుకు కూడా భిన్నంగా ఒక సినిమా టీవీ చాన‌ల్ విడుద‌ల‌ను ఎంచుకోవ‌డం గ‌మ‌నార్హం.