Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ఎక్స్ ప్రెస్ రాజా

By:  Tupaki Desk   |   14 Jan 2016 5:15 PM GMT
మూవీ రివ్యూ : ఎక్స్ ప్రెస్ రాజా
X
‘ఎక్స్ ప్రెస్ రాజా’ రివ్యూ

నటీనటులు- శర్వానంద్ - సురభి - ప్రభాస్ శీను - సప్తగిరి - ఊర్వశి - హరీష్ ఉత్తమన్ - సుప్రీత్ - బ్రహ్మాజీ - షకలక శంకర్ - ధన్ రాజ్ - నాగినీడు - పోసాని కృష్ణమురళి - రఘు కారుమంచి - దువ్వాసి మోహన్ తదితరులు
ఛాయాగ్రహణం- కార్తీక్ ఘట్టమనేని
సంగీతం- ప్రవీణ్ లక్కరాజు
నిర్మాతలు- వంశీ, ప్రమోద్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం- మేర్లపాక గాంధీ

సంక్రాంతికి మూడు పెద్ద సినిమాలు పోటీలో ఉన్నా.. రేసులోకి దిగిపోయాడు ‘ఎక్స్ ప్రెస్ రాజా’. దీన్ని బట్టే ఆ సినిమాపై దాని మేకర్స్ కు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా ఏమాత్రం నిలబెట్టిందో చూద్దాం పదండి.

కథ:

రాజా (శర్వానంద్) తండ్రి మాటను లెక్కపెట్టకుండా బాధ్యత లేకుండా తన మావయ్య శీను (ప్రభాస్ శీను)తో కలిసి వైజాగ్ లో బేవార్సుగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఐతే తన తండ్రి మీద ఉన్న గౌరవంతో ఆయన స్నేహితుడు ఉద్యోగం ఇప్పిస్తే అందుకోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. తీరా అక్కడికెళ్లాక ఉద్యోగం చేయకుండా అమూల్య (సురభి) అనే అమ్మాయి వెంట తిరగడం మొదలుపెడతాడు రాజా. మొదట రాజాను అసహ్యించుకున్నా ఆమె కూడా అతడి ప్రేమలో పడుతుంది. ఐతే కుక్కలంటే పడని రాజా.. అమూల్యకు ఎంతో ఇష్టమైన కుక్కపిల్లను మున్సిపాలిటీ వాళ్లకు పట్టిస్తాడు. దీంతో అమూల్య అతణ్ని ఛీకొట్టి వెళ్లిపోతుంది. ఇక తన ప్రేయసికి ఎంతో ఇష్టమైన కుక్కను పట్టి తేవడానికి రాజా ఎలాంటి పాట్లు పడ్డాడు? ఆ కుక్క చుట్టూ తిరిగే కథ చివరికి ఎక్కడికి చేరింది? అన్నది తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం, విశ్లేషణ:

కథ తెలుసుకుంటుంటే.. కుక్క చుట్టూ సినిమా ఏంటి సిల్లీగా అనిపిస్తోంది కదూ. కానీ అందులోనే ఉంది మ్యాజిక్. తొలి సినిమా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’కు కూడా ఓ చిన్న కథాంశాన్ని ఎంచుకుని.. మంచి క్యారెక్టర్లు, సన్నివేశాలు జోడించి ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దిన మేర్లపాక గాంధీ.. రెండో సినిమాకు మరింతగా తన కలానికి, తన దర్శకత్వ ప్రతిభకు పదును పెట్టాడు. హాలీవుడ్ సినిమా ‘వాంటేజ్ పాయింట్’ తరహా స్క్రీన్ ప్లేతో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ను నడిపించానని నిజాయితీగా ఒప్పుకున్న గాంధీ.. ఆ తరహా స్క్రీన్ ప్లేను మనదైన క్యారెక్టర్లతో లోకలైజ్ చేయడమే ఈ సినిమాలోని ప్రత్యేకత.

భిన్నమైన పాత్రల్ని.. వాటి కథల్ని వేర్వేరుగా చూపించి.. చివరికి ఓ చోట అందరినీ కలిపి సినిమాను ముగించే భిన్నమైన స్క్రీన్ ప్లేతో గతంతో తెలుగులో కొన్ని సినిమా వచ్చాయి. ఐతే ‘ఎక్స్ ప్రెస్ రాజా’ది మరో రకమైన స్క్రీన్ ప్లే. ఆరంభంలోనే ఓ సంఘటన చూపిస్తారు. ఆ సంఘటన ప్రభావం అనేక పాత్రలపై ఉంటుంది. కథనం ముందుకు సాగే కొద్దీ ఆ ప్రభావం పడ్డ ఒక్కో పాత్రను సీన్లోకి తెస్తారు. అందరూ హీరో వెంట పడేలా చేస్తారు. చివరికి అంతా ఒకచోట కలుస్తారు. ఈ క్రమంలో బోలెడంత వినోదం. ఇదీ ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సాగే తీరు.

ఐతే హాలీవుడ్ నుంచి స్క్రీన్ ప్లే టెక్నిక్ పట్టుకొచ్చేస్తే సక్సెస్ నడిచి వచ్చేయదు కదా. ఇక్కడే మేర్లపాక గాంధీ తన ముద్ర చూపించాడు. ఒక చిన్న పాయింట్ ను పట్టుకుని రెండున్నర గంటల సినిమాగా అతను మలిచిన తీరు ఆకట్టుకుంటుంది. తన తొలి సినిమాను కేవలం రకరకాల క్యారెక్టర్ల మీద.. అవి పండించే వినోదం మీదే నడిపించిన గాంధీ మరోసారి అదే టెక్నిక్ ఫాలో అయ్యాడు. సినిమాలో ప్రతి పావుగంటకో పాత్ర ప్రవేశిస్తుంది. తన వంతుగా ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఏ పాత్ర కూడా అర్థరహితంగా, అనవసరంగా అనిపించదు. చివరికి ధన్ రాజ్ పోషించిన అతి చిన్న పాత్ర కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇనుమును మాత్రమే దొంగిలించే ఆ పాత్రను సినిమాలో కీలకమైన మలుపును వాడుకున్న తీరు చూస్తే ముచ్చటేస్తుంది. ఆ పాత్ర ద్వారా సినిమా చివర్లో ఇచ్చిన కొసమెరుపు ప్రేక్షకుడు నవ్వు పులుముకుని థియేటర్ నుంచి వచ్చేలా చేస్తుంది.

మ్యాజిక్ పని చేస్తే లాజిక్ గుర్తుకు రాదు అంటారు. ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాకు ఇది కరెక్టుగా వర్తిస్తుంది. నిజానికి సినిమాకు కీలకంగా చెప్పుకున్న సన్నివేశంలో హీరో వల్ల దెబ్బ తినే క్యారెక్టర్లన్నీ మళ్లీ అతడి జర్నీలో యాదృచ్ఛికంగా అలా వచ్చి కలిసిపోవడం లాజిక్ కు అందని విషయం. కోయిన్సిడెన్స్ లు సినిమాలో మరీ ఎక్కువైపోయాయి. కుక్క మెడలో 75 కోట్ల డైమండ్ పెట్టి వదిలేయడం అన్నది కూడా లాజిక్ కు అందని విషయం. ఇంకా సినిమాలో లాజిక్ లేని విషయాలు చాలానే కనిపిస్తాయి. కానీ అడుగడుగునా వినోదంలో ముంచెత్తుతుండటంతో ప్రేక్షకుడికి లాజిక్ గురించి ఆలోచించే తీరిక ఉండదు.

క్యారెక్టర్లన్నింటినీ కూడా సరదాగా తీర్చిదిద్దుకుని.. తమాషా సన్నివేశాలు రాసుకుని సినిమాను ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించే ప్రయత్నం చేశాడు గాంధీ. ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్ సినిమాల పేర్లను కలిపి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ అని పేరు పెట్టిన గాంధీ.. సినిమా అంతటా కూడా ఆ రెండు సినిమాల ఫ్లేవర్ కనిపించేలా స్క్రిప్టు తీర్చిదిద్దుకున్నాడు. ‘రన్ రాజా రన్’ తరహాలోనే విలన్ పాత్రల్ని కూడా ఎంటర్టైన్మెంట్ కోసమే వాడుకోవడంతో కావాల్సినంత వినోదం పండింది. ఎక్కడా బూతు లేకుండా యూత్ ను ఆకట్టుకునే క్లీన్ ఎంటర్టైన్మెంట్ అందించాడు గాంధీ. నటీనటుల నుంచి కూడా అతడికి పూర్తి సహకారమందింది. అందరూ మంచి కామిక్ టైమింగ్ తో నవ్వులు పండించారు. ప్రథమార్ధమంతా పన్నీ వన్ లైనర్స్ తో సాగిపోతే.. ద్వితీయార్ధం ఛేజ్ లు, ట్విస్టులతో నడుస్తుంది. ప్రథమార్ధం సాగినంత వేగంగా ద్వితీయార్ధం ఉండదు. సెకండాఫ్ లో ఓ దశలో సినిమా ఆగిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఐతే మళ్లీ క్లైమాక్స్ ముందు ఊపందుకుంటుంది. ముగింపు కూడా ఫన్నీగా ఉండేలా చూసుకున్నాడు.

హీరో హీరోయిన్ల లవ్ స్టోరీ.. వాళ్లిద్దరి కెమిస్ట్రీ అంతగా పండకపోవడం సినిమాలో మైనస్. ప్రథమార్ధంలా ద్వితీయార్ధంలో అనుకున్నంత స్థాయిలో వినోదం పండలేదు. చాలా సన్నివేశాల్లో లాజిక్స్ లేకపోవడం, కోయిన్సిడెన్స్ లు ఎక్కువైపోవడం మింగుడు పడదు. గాంధీ అందించిన వినోదం ‘ఎ’ క్లాస్ ఆడియన్స్ కు బాగానే కనెక్టవుతుంది కానీ.. మాస్ ఆడియన్స్ కు అంతగా ఎక్కపోవచ్చేమో. ఇంతకుమించి సినిమాలో చెప్పుకోదగ్గ మైనస్సులేమీ లేవు.

నటీనటులు:

‘రన్ రాజా రన్’తో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న శర్వా.. దానికి కొనసాగింపలా అనిపించే పాత్రలో మరింతగా ఆకట్టుకున్నాడు. అతను ఎంత ఎఫర్ట్ లెస్ గా నటించాడంటే చాలా తర్వగా అతడి పాత్రతో కనెక్టయిపోయి అతడితో కలిసి మనం కూడా జర్నీ చేస్తాం. ఒక్క సినిమాతోనే అతను ఎంటర్టైనింగ్ రోల్స్ కు ఇంత బాగా ట్యూన్ అయిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అతడి లుక్, స్టైలింగ్ అన్నీ కూడా యూత్ కి బాగా కనెక్టయ్యేలా ఉన్నాయి. సురభి అందంగా కనిపించింది. ఆమె అభినయం కూడా ఆకట్టుకుంది. ఆమె పాత్రను ఇంకా బాగా వాడుకుని ఉండాల్సిందనిపిస్తుంది. హీరో వెంటే ఉండే పాత్రలో ప్రభాస్ శీను మంచి వినోదాన్నందించాడు. అతడికి వాయిస్ పెద్ద ప్లస్. సప్తగిరి చాన్నాళ్ల తర్వాత తనదైన శైలిలో బాగా నవ్వించాడు. ఎప్పట్లాగే హడావుడి ఎక్కువ చేసినప్పటికీ.. ఈసారి కేవలం హడావుడితో సరిపెట్టకుండా నవ్వించాడు. సుప్రీత్ - హరీష్ ఉత్తమన్ - ఊర్వశి - బ్రహ్మాజీ - ధన్ రాజ్ - రఘు కారుమంచి.. వీళ్లంతా కూడా తమ వంతుగా వినోదాన్నందించారు. అందరి పాత్రలూ ఆకట్టుకుంటాయి.

సాంకేతిక వర్గం:

‘ఎక్స్ ప్రెస్ రాజా’కు టెక్నీషియన్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. పాటలన్నీ హుషారెత్తించేలా ఉన్నాయి. వాటి చిత్రీకరణ కూడా ఆకట్టకుంటుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ తోనూ బాగానే ఎంగేజ్ చేశాడు ప్రవీణ్. కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. చాలా వైబ్రంట్ లుక్ తీసుకొచ్చాడు సినిమాకు అతను. ఎడిటింగ్ కూడగా బాగుంది. నిర్మాణ విలువలు ‘యువి’ స్థాయికి తగ్గట్లు రిచ్ గా ఉన్నాయి. క్వాలిటీ సినిమా అన్న ఫీలింగ్ ప్రతి సన్నివేశంలోనూ అనిపిస్తుంది. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ.. తాను ఆరంభ శూరుణ్ని కాదని రుజువు చేశాడు. ఇటు రాతలో, అటు తీతలో తొలి సినిమా కంటే కూడా రెండో సినిమాతో బలమైన ముద్ర వేశాడు. టాలీవుడ్లో కొత్తదనంతో కూడుకున్న వినోదం అందించే అతి కొద్ది మంది దర్శకుల్లో ఒకడైపోయాడు గాంధీ. అతడి నరేషన్ స్టయిల్ చాలా సింపుల్ గా ఉంటూనే ఎంగేజింగ్, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇది డైరెక్టర్స్ మూవీ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

చివరగా: రాజాతో రైడింగ్.. ఫన్నీ ఫన్నీ
రేటింగ్- 3/5