Begin typing your search above and press return to search.

పరశురామ్-పూరి..ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్

By:  Tupaki Desk   |   21 Aug 2016 5:30 PM GMT
పరశురామ్-పూరి..ఒక ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్
X
యువ దర్శకుడు పరశురామ్.. సీనియర్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురు శిష్యులు మాత్రమే కాదు. అన్నదమ్ములు కూడా. పూరికి చిన్నాన్న కొడుకు పరశురామ్. పూరి దగ్గర దర్శకత్వంలో ఓనమాలు నేర్చుకుని మెగా ఫోన్ పట్టాడు పరశురామ్. ఐతే పూరి దగ్గర తనకు అంత తేలిగ్గా అవకాశం దక్కలేదని.. చాలా పోరాడితే తప్ప అసిస్టెంటుగా చేర్చుకోలేదని చెప్పాడు పరశురామ్. పరశురామ్ ఎంబీఏ పూర్తి చేసిన టైంలో తన తల్లి చనిపోతే.. డిప్రెషన్ లోకి వెళ్లిపోయే పరిస్థితుల్లో ఉంటే.. హైదరాబాద్ లో ఏదైనా ఉద్యోగం చేసుకుందామని వచ్చాడట. అప్పుడే ఇడియట్ సినిమా విడుదలై.. పూరి జగన్నాథ్ పేరు మార్మోగిపోతోందని.. తన అన్నయ్య స్థాయి ఏంటో అప్పుడర్థమైందని.. ఆయనలాగే కష్టపడి దర్శకుడు కావాలని ఫిక్సయ్యానని చెప్పాడు పరశురామ్.

‘‘ఏం చేసైనా పూరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరమని జోగి నాయుడు గారు చెప్పడంతో అన్నయ్య దగ్గరికెళ్లి విషయం చెప్పాను. ఆయన నన్ను గట్టిగా తిట్టారు. ఎంబీయే చేసి ఫారిన్ వెళ్తానన్నావు కదా.. ఏమైంది అంటూ తనే ఫారిన్ పంపించే ఏర్పాట్లు చేస్తానన్నాడు. కానీ నేను వినలేదు. దీంతో కోపమొచ్చి నాతో కొన్ని రోజులు మాట్లాడ్డం మానేశాడు. ఆ తర్వాత మా నాన్న గారితో ఓసారి చెప్పించాను. ఆయన మాట కాదనలేక అసిస్టెంటుగా చేర్చుకున్నాడు. ఆంధ్రావాలా.. 143 సినిమాలకు పని చేశాను. ఐతే అన్నయ్య దగ్గరే ఉంటే నా సామర్థ్యమేంటో నాకు తెలియదని దశరథ్ దగ్గర చేరాను. ‘శ్రీ’ సినిమాకు పని చేశాను. ఆ తర్వాత ‘పరుగు’ సినిమాకు అడిషనల్ డైలాగ్స్.. స్క్రిప్టు సహకారం అందించాను. ఆ తర్వాత ‘యువత’తో దర్శకుడయ్యే అవకాశం దక్కింది’’ అని పరశురామ్ చెప్పాడు.