Begin typing your search above and press return to search.

శ్రీదేవి పెళ్లి.. తెరవెనుక కథ

By:  Tupaki Desk   |   8 Sep 2015 10:43 PM GMT
శ్రీదేవి పెళ్లి.. తెరవెనుక కథ
X
రామ్ గోపాల్ వర్మ ‘నా ఇష్టం’ పుస్తకంలో తన ఆరాధ్య దేవత శ్రీదేవి గురించి రాస్తూ... శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని తనక బలీయమైన కోరిక ఉండేదని.. ఐతే అలాంటి అపురూప సౌందర్యరాశికి తన లాంటి వాడు తగడని ఊరుకున్నానని.. కానీ ఆమె బోనీ కపూర్ ను పెళ్లాడాక తాను వెనకడుగు వేసి చాలా పెద్ద తప్పు చేశానని అనిపించిందని చెప్పాడు. వర్మ లాగే చాలామందికి శ్రీదేవి బోనీని పెళ్లాడటం చాలా పెద్ద షాక్. ఇంతకీ శ్రీదేవి అప్పటికి పెళ్లయి పిల్లలున్న బోనీని ఏ పరిస్థితుల్లో పెళ్లాడింది? వాళ్లిద్దరి మధ్య ప్రేమకథకు సంబంధించి విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి.

70ల్లో సౌత్ లో హవా సాగిస్తున్న రోజుల్లోనే శ్రీదేవిని చూసి ఇష్టపడ్డాడట బోనీ కపూర్. అప్పటికి అతడికి పెళ్లవలేదు. 1979లో శ్రీదేవి సోల్వా సావన్ అనే హిందీ సినిమాలో నటించింది. నిర్మాతగా శ్రీదేవితో సినిమా తీయడం కోసం ఆ సినిమా సెట్ కు వెళ్లాడట బోనీ. ఐతే శ్రీదేవి పొడి పొడిగా రెండు ముక్కలు మాట్లాడి.. తన తల్లిని కలవమని చెప్పిందట. శ్రీదేవి రెమ్యూనరేషన్ రూ.10 లక్షలని ఆమె తల్లి చెబితే.. బోనీ 11 లక్షలిస్తానంటూ అగ్రిమెంట్ చేసుకుని వచ్చాడట. తన సినిమా సమయంలో శ్రీదేవికి దగ్గరై ఆమెను పెళ్లాడాలన్నది బోనీ ప్లాన్. ఐతే శ్రీదేవి అప్పటికే మిథున్ చక్రవర్తితో ప్రేమలో ఉంది. వాళ్లిద్దరూ రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నట్లు రూమర్లున్నాయి. ఐతే భార్య నుంచి విడాకులు తీసుకోమంటే తీసుకోలేదు.

ఈ కథ ఇలా ఉంటే బోనీతో సినిమా చేస్తున్నపుడు అతను తన మీద చూపిన శ్రద్ధ చూసి శ్రీదేవి ఫ్లాటైపోయింది. ఐతే మిథున్ తో శ్రీదేవి ప్రేమ సంగతి తెలిసి.. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు మోనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు బోనీ. ఆపై 1984లో బోనీ నిర్మించిన ‘మిస్టర్ ఇండియా’లో నటించింది శ్రీదేవి. ఆ సమయంలో ఇద్దరూ బాగా క్లోజయ్యారు. అప్పటికే మిథున్ తో బ్రేకప్ అయిపోవడంతో బోనీకి బాగా దగ్గరైంది శ్రీదేవి. ‘చాందిని’ అనే సినిమా చేస్తుండగా శ్రీదేవి కోసం తోడుగా స్విట్జర్లాండ్ కూడా వెళ్లాడు బోనీ. ఆ టూర్ తర్వాత తాను శ్రీదేవిని వదిలి ఉండలేనని తన భార్య మోనాకు చెప్పేశాడు బోనీ. ఆమెకు విడాకులిచ్చేసి చివరికి 1996లో శ్రీదేవిని పెళ్లాడాడు. మిథున్ తో ప్రేమ, పెళ్లి వ్యవహారం విఫలమయ్యాక చాలా ఇన్ సెక్యూర్ గా ఫీలైన శ్రీదేవి బోనీ తన మీద చూపించిన ప్రేమకు కరిగిపోయింది. అలా వారి పెళ్లయింది. ఐతే బోనీ, శ్రీదేవిల పెళ్లి ఎంతో కాలం నిలవదని చాలామంది సినీ జనాలు అంచనా వేశారు. కానీ ఆ మాటలు తప్పని రుజువు చేస్తూ రెండు దశాబ్దాల తర్వాత కూడా ఇద్దరూ అన్యోన్యంగా ఉన్నారు.