Begin typing your search above and press return to search.

టికెట్ల పెంపు వార్త‌ల వెనుక అస‌లేం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   8 May 2019 4:50 AM GMT
టికెట్ల పెంపు వార్త‌ల వెనుక అస‌లేం జ‌రిగింది?
X
కాసుల క‌క్కుర్తి పెద్ద క‌న్ఫ్యూజ‌న్ కు తెర తీయ‌ట‌మే కాదు.. కేసీఆర్ స‌ర్కారుకు కోపం తెచ్చేలా చేసిందా? అంటే అవున‌నే చెబుతున్నారు గులాబీ పార్టీ ముఖ్యులు. తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మ‌హ‌ర్షి మూవీ అన‌వ‌స‌రంగా కొత్త వివాదంలో చిక్కుకున్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌హ‌ర్షి సినిమాకు ఐదు షోలు వేసేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఇదే విష‌యాన్ని టీవీల్లో స్క్రోలింగ్ ల రూపంలో వ‌చ్చింది.

ఇక్క‌డి వ‌ర‌కూ అంతా ఓకే. ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. రోజుకు ఐదు షోల పెంపుతో పాటు.. టికెట్ల ధ‌ర‌ల్ని పెంపున‌కు ప్ర‌భుత్వం ఓకే చెప్పిందంటూ స్క్రోలింగ్స్ మొద‌ల‌య్యాయి. దీంతో.. టికెట్ల ధ‌ర‌ల పెంపుపై పలువురు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన ప‌రిస్థితి. ఇదే అంశంపై తెలంగాణ ప్ర‌భుత్వ ముఖ్యుల‌కు వివిధ వ‌ర్గాల నుంచి ఎంక్వ‌యిరీలు స్టార్ట్ అయ్యాయి.

ఒకేసారి ఇంత భారీగా (సింగిల్ స్క్రీన్ కు రూ.30.. మ‌ల్టీఫ్లెక్సుల‌కు రూ.50 చొప్పున‌) ధ‌ర‌లు ఎలా పెంచుతార‌న్న ప్ర‌శ్న పెద్ద ఎత్తున మొద‌లైంది. ఇలాంటి నిర్ణ‌యం ప్ర‌భుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తూ.. సినీ ప‌రిశ్ర‌మకు మ‌రీ ఇంత గులాం చేయాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న వ్యాఖ్య‌లు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు రావ‌టంతో వారు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డిన ప‌రిస్థితి.

ఏదో పెద్ద హీరో సినిమాకు షోల పెంపున‌కు అనుమ‌తి అడిగితే కాద‌న‌కుండా ఇస్తే.. టికెట్ల ధ‌ర‌ల పెంపుపై ఈ ట్విస్ట్ ఏమిటంటూ.. స‌ద‌రు సంబంధిత శాఖ ఒక్క‌సారిగా అలెర్ట్ అయ్యింది. స‌ద‌రు శాఖామంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ సైతం ఆశ్చ‌ర్యానికి గురై.. టికెట్ల పెంపుపై ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదంటూ డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్ర‌య‌త్నాన్ని షురూ చేశారు. దీంతో.. కొత్త క‌న్ఫ్యూజ‌న్ మొద‌లైంది. తెలంగాణ ప్ర‌భుత్వం అనుమ‌తి లేకుండా టికెట్ల పెంపు విష‌యం ఎందుకు తెర మీద‌కు వ‌చ్చింద‌న్న ఎంక్వ‌యిరీ షురూ అయ్యింది.

ఆ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర అంశం బ‌య‌ట‌కు వ‌చ్చింది. గ‌తంలో కోర్టు నుంచి తెచ్చుకున్న అనుమ‌తితో టికెట్ల పెంపు నిర్ణ‌యాన్ని చిత్ర నిర్మాత‌లు తీసుకున్న‌ట్లుగా తెలిసింది. దీంతో.. తెలంగాణ ప్ర‌భుత్వానికి ఎక్క‌డో కాలినట్లుగా చెబుతున్నారు. టికెట్ల పెంపు నిర్మాత‌కు సంబంధించిన అంశ‌మే కాద‌ని.. ఇది ప్ర‌భుత్వం మీద ప్ర‌భావితం చేసే అవ‌కాశం ఉన్న‌ప్పుడు.. ఆ విష‌యాన్ని త‌మ‌కు చెప్ప‌కుండా.. త‌మ‌తో చ‌ర్చ జ‌ర‌ప‌కుండా.. ఏకాఏకిన సొంత నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ఎలా తీసుకుంటార‌న్న ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. దీని ఫ‌లిత‌మే.. సినిమాటోగ్ర‌ఫీ శాఖ నుంచి టికెట్ల పెంపు నిర్ణ‌యం ప్ర‌భుత్వానికి కాదంటూ ఖండ‌న ప్ర‌క‌ట‌న రిలీజ్ కావ‌టంగా చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే.. గ‌తంలో ఇచ్చిన ఆదేశాల్ని చూపిస్తూ.. కోర్టు వ‌ద్ద‌కు వెళ్లి టికెట్ల పెంపు నిర్ణ‌యానికి అనుకూలంగా మ‌హ‌ర్షి చిత్ర నిర్మాత‌లు అనుమ‌తి తెచ్చుకున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో.. టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ ఆగ్ర‌హం ఒక రేంజ్ కు చేరిన‌ట్లుగా చెబుతున్నారు. చిత్ర నిర్మాత‌ల ఆదాయానికి ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయాల‌నుకుంటున్నారా? అన్న గుస్సాలో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. త‌మ‌కు మాట మాత్రం చెప్ప‌కుండా.. కీల‌క నిర్ణ‌యాన్ని చిత్ర నిర్మాత‌లు ఎలా తీసుకుంటార‌న్న కోపంలో ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకునే వీలుంద‌ని చెబుతున్నారు. లెట్స్ వెయిట్ అండ్ సీ.